గురువారం 04 మార్చి 2021
Siddipet - Jan 28, 2021 , 00:28:11

ఆరోగ్యం, ఆహ్లాదానికి అర్బన్‌ పార్కు

ఆరోగ్యం, ఆహ్లాదానికి అర్బన్‌ పార్కు

 • ఆహ్లాదాన్ని పంచే వాతావరణం  
 • నడక కోసం ప్రత్యేక ట్రాక్‌లు
 • ఆరోగ్యాన్ని పెంచే ఓపెన్‌ జిమ్‌లు 
 • చిన్నారులను ఆకట్టుకునే ఆటస్థలాలు.. 
 • రూ.3.50 కోట్లతో అర్బన్‌ పార్కు నిర్మాణం 
 • నాగులబండ వద్ద ప్రారంభానికి సిద్ధమైన అర్బన్‌ పార్కు 
 • నేడు మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం

ఉరుకులు పరుగుల జీవితాల్లో ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించేందుకు సిద్ధమైంది ‘తేజోవనం అర్బన్‌ ఫారెస్టు పార్కు’. సిద్దిపేట అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోని నాగులబండ వద్ద మూడేండ్ల క్రితం జీవం పోసుకున్న ఈ అర్బన్‌ ఫారెస్టు పార్కు, 205 హెక్టార్లలో రూ.3.50 కోట్లతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నేడు మంత్రి హరీశ్‌రావు దీనిని ప్రారంభించనున్నారు. ఈ పార్కులో మొక్కలు, జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. రాశివనం, ప్రత్యేకతల పచ్చని పందిరి, ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడ్డ కుంటలు, సౌర విద్యుత్‌ కేంద్రం, నడక దారి, సైక్లింగ్‌ట్రాక్‌, ఆటస్థలం, ఓపెన్‌ జిమ్‌లు, చిన్నారుల కోసం ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. పూలు, పండ్లు, ఔషధ మొక్కలు పర్యాటకులకు స్వచ్ఛమైన గాలిని అందించనున్నాయి. మూడంతస్తుల్లో నిర్మించిన వాచ్‌టవర్‌ ద్వారా సందర్శకులు ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. 

-కొండపాక, జనవరి 27 

కొండపాక, జనవరి 27 : ఉరుకులు.. పరుగుల జీవితాల్లో ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించేందుకు సిద్ధమైంది తేజోవనం అర్బన్‌ ఫారెస్టు పార్కు. సుడా పరిధిలోని నాగులబండ వద్ద మూడేండ్ల క్రితం జీవం పోసుకున్న అర్బన్‌ ఫారెస్టు పార్కు, 205 హెక్టార్లలో రూ. 3.50 కోట్లతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. గురువారం మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా తేజోవనం అర్బన్‌ పార్కు ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 

మంత్రి హరీశ్‌రావు కృషితో... 

‘తేజోవనం అర్బన్‌ ఫారెస్టు పార్కు’ 205 హెక్టార్లలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం పునరుద్ధరించి అర్బన్‌ పార్కు పేరుతో తీర్చిదిద్దింది. జిల్లాకేంద్రానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో తేజోవనం అర్బన్‌ ఫారెస్టు పార్కు నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. కొండపాక మం డలం మర్పడగ, దుద్దెడ గ్రామ శివారులోని అటవీ ప్రాంతాన్ని అర్బన్‌ పార్కు కోసం కోసం కేటాయించారు. రూ.3.50 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో అర్బన్‌ పార్కుగా రూపుదిద్దుకుంది. దీని నిర్మాణ క్రమంలో ఎన్నోమార్లు మంత్రి హరీశ్‌రావు సందర్శించి అధికారులకు సూచనలు ఇచ్చారు. పా ర్కులో మొక్కలు, జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్‌ అధికారులను ఆదేశించారు. 

ఆహ్లాదానికి నెలవు ...

అర్బన్‌ పార్కు చుట్టూ ఇనుప కంచె నిర్మించారు. స్వాగత తోరణాన్ని ఆకట్టుకునే ఆకృతిలో తీర్చిదిద్దా రు. ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి తాగునీటి సదుపాయం కల్పించారు. మూడేండ్ల క్రితం కొత్తగా లక్షకు పైగా మొక్కలు నాటగా, అవన్నీ వృక్షాలుగా ఎదగడం తో పచ్చదనం పరుచుకుంది. ఇప్పటికే పట్టణంలోని కోమటి చెరువు ఆహ్లాదానికి, పర్యాటకానికి నెలవుగా మారింది. అదేస్థాయిలో తేజోవనం అర్బన్‌ పార్కు సిద్దిపేట అభివృద్ధిలో కలికితురాయిగా మారనుంది.  

జీవరాశులు... 

తేజోవనంలో జింకలు, కొండగొర్రెలు, దుప్పులు, నక్కలు, అడవి పందులు, నెమళ్లు, వివిధ రకాల పక్షి, జంతుజాతులు నివసిస్తున్నాయి. వాటికి రక్షణ చర్యలు తీసుకుంటూనే దాహం తీర్చేందుకు 10 నీటి కుంటలు ఏర్పాటు చేశారు. 

ఆటస్థలం, ఓపెన్‌ జిమ్‌లు... 

చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఎకరా స్థలా న్ని కేటాయించారు. జారుడు బల్ల, ఊయల, ఇతరత్రా ఆట వస్తువులు, మరో ఎకరంలో వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేశారు. పార్కులో మొత్తం 63 బెంచీలు ఉన్నాయి. పర్యావరణంపై పిల్లలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. 

ప్రకృతి వనం... 

చిట్టడవి తలపించే ప్రత్యేక నిర్మాణం.హెక్టారు విస్తీర్ణంలో 10వేల మొక్కలు పెంచారు. పూలు, పండ్లు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఇవి పర్యాటకుల కు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించనున్నాయి. 

మూడంతస్తుల్లో వాచ్‌ టవర్‌... 

వాచ్‌టవర్‌ మూడు అంతస్తుల్లో నిర్మించారు. దీనిని సిమెంట్‌, కాంక్రీట్‌తో కట్టినా, తుది మెరుగులుదిద్ది రంగులు అద్దడంతో కలపతో కట్టినట్లుగా కనిపిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఒక్కో అంతస్తులో 15 మంది కూర్చొవచ్చు. వాచ్‌టవర్‌ పై నుంచి చూస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.  

ప్రత్యేకతల పచ్చని పందిరి... 

 • కూర్చొని సేదతీరేలా గెజిబో నిర్మాణం. 
 • విశాలమైన ప్రాంతంలో16 మంది కూర్చోవచ్చు.
 • కర్రతో కూడిన గుడిసె (ఉడెన్‌ హట్‌)ను తాటి  మొద్దులతో తీర్చిదిద్దారు. 
 • ఆర్నమెంట్‌ డిజైన్‌ బ్రిడ్జి .. కాల్వ దాటేందుకు దీన్ని కృత్రిమంగా తీర్చిదిద్దారు. 
 • సహజ సిద్ధ కుంటల్లో నీరు నిల్వ చేశారు. 
 • అందుబాటులో సౌర విద్యుత్‌ కేంద్రం. 
 • 9 కి.మీ మేర నడక దారి, 
 • 11 కి.మీ సైక్లింగ్‌ దారులు ఉన్నాయి. 

VIDEOS

logo