బుధవారం 24 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 26, 2021 , 00:17:14

జిల్లాకు 48 హెల్త్‌ సెంటర్లు

జిల్లాకు 48 హెల్త్‌ సెంటర్లు

ఒక్కో ఆరోగ్య కేంద్రానికి 16లక్షలు

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక నియోజకవర్గంలో 20  హెల్త్‌ సెంటర్లు

ఒక్కో హెల్త్‌ సెంటర్‌కు రూ. 16 లక్షలు 

దుబ్బాక, జనవరి25 : దుబ్బాక నియోజకవర్గానికి మొత్తం హెల్త్‌ సెంటర్లు, ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరయ్యాయి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్‌హెచ్‌ఎం (నేషనల్‌ హెల్త్‌ మిషన్‌) ద్వారా నిధులు మంజూరయ్యాయి. ఇందులో మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని 48 ఆరోగ్య ఉప కేంద్రాలకు(సబ్‌ సెంటర్లకు ) నిధులు మంజూరయ్యాయని  ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి  తెలిపారు. ఒక్కో ఆరోగ్య కేంద్రానికి రూ. 16 లక్షల చొప్పున మొత్తం రూ. 7.68 కోట్లు నిధులు మంజూరయ్యాయని  వెల్లడించారు.  ఇందులో  దుబ్బాక మండలంలో ఎనగుర్తి, పోతారెడ్డిపేట, అప్పనపల్లి, పెద్దగుండవెల్లి, పోతారం, చీకోడ్‌, ధర్మాజీపేట, రామక్కపేట, తిమ్మాపూర్‌ గ్రామాలు  మిరుదొడ్డి మండలంలో భూం పల్లి, వీరారెడ్డిపల్లి, ఖాజీపూర్‌, రుద్రారం, అక్బర్‌పేట, బేగంపేట, మిరుదొడ్డి, అల్వాల్‌,  ధర్మారం, దౌల్తాబాద్‌ మండలంలో  ఇందుప్రియాల్‌,  రాయపోల్‌ మండలం లో వడ్డేపల్లి గ్రామాలకు ఉప కేంద్రాల భవనాలకు నిధు లు మంజూరయ్యాయి. 

గజ్వేల్‌కు మరో 7 సబ్‌సెంటర్లకు నిధులు

గజ్వేల్‌  : గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపాక, జగదేవ్‌పూర్‌ మండలాలకు చెందిన పలు గ్రామాలకు సబ్‌ సెంటర్లను సీఎం ఆదేశానుసారం మంజూరు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు సోమవారం తెలిపారు. ఒక్కో సబ్‌ సెంటర్‌కు రూ. 16 లక్షలు మంజూరు కాగా త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. కొండపాక మండలం సిరసనగండ్ల, ఖమ్మంపల్లి, జప్తి నాచారంతో పాటు జగదేవ్‌పూర్‌ మండలం తిగుల్‌, చాట్లపల్లి, జగదేవ్‌పూర్‌, ఇటిక్యాల గ్రామాలకు మంజూరయ్యాయన్నారు. గ్రామీణ ప్రాంత  ప్రజలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని సీఎ కేసీఆర్‌ సబ్‌ సెంటర్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించారన్నారు. గ్రామాల్లో ప్రసూతిలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా సబ్‌ సెంటర్ల ద్వారా గర్భిణులకు సకాలంలో వైద్యసేవలను అందించడానికి వీలు కలుగు తుందన్నారు.

నిధులు మంజూరుపై హర్షం 

దుబ్బాక మండలంలో 9 ఆరోగ్య ఉప కేంద్రాలకు నిధులు మంజూరు చేసినందుకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి దుబ్బాక జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శేర్ల కైలాశ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లారెడ్డి,అస్క రవి, శ్రీనివాస్‌గౌడ్‌,  నారాయణరెడ్డి, దయాకర్‌ తదితరులున్నారు.

సర్కారు వైద్యానికి అధిక  ప్రాధాన్యం 

దుబ్బాక టౌన్‌, జనవరి 25 : మారుమూల ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్‌ తరహాలో సర్కారు వైద్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో కృషి చేస్తున్నదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే ప్రజలకు సర్కారు వైద్యంపై నమ్మకం కలిగిందన్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం కార్పొరేట్‌ వైద్యాన్ని పొందుతున్నారని అందుకు అనుగుణంగా కావలసిన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు. దాదాపు ప్రతి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ఇప్పటి వరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆరోగ్య ఉపకేంద్రాలను పక్కా భవనాలుగా నిర్మించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా ప్రభుత్వం రూ. 7.68 కోట్లు మంజూరు చేసిందని అందులో దుబ్బాక నియోజకవర్గంలోని 24 ఆరోగ్య ఉప కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన  సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఎంపీ  కృతజ్ఞతలు తెలిపారు. 

VIDEOS

logo