మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Jan 25, 2021 , 00:03:41

మల్లయ్య రాసే.. భగవంతుడు మురిసె..

మల్లయ్య రాసే.. భగవంతుడు మురిసె..

రచన, గానంలో మేటి..  కోడం మల్లయ్య 

ఆధ్యాత్మికత, భక్తితో కూడిన పాటల రచనలో దిట్ట

ఇప్పటి వరకు 368 పాటల రచన, ఆరుపుస్తకాల ఆవిష్కరణ

ప్రధాన దేవాలయాల్లో భజన సంకీర్తనలు చేస్తూ  ప్రత్యేక గుర్తింపు

భజన మండలిని స్థాపించి కళాకారులకు ప్రోత్సాహం

హుస్నాబాద్‌, జనవరి 24 : 

చిన్ననాటి నుంచే ఆధ్యాత్మికత, భజనలపై ఆసక్తిని పెంచుకొని వృద్ధ్యాప్యం వచ్చినప్పటికీ వాటిని మరువకుండా భజన, సంకీర్తనలకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారు ప్రముఖ రచయిత, గాయకుడు కోడం మల్లయ్య. వృత్తిరీత్యా చేనేత కార్మికుడైన మల్లయ్య.. నిత్యం పది మంది కళాకారులను కలుపుకొని ఎక్కడ ఉత్సవాలు జరిగినా, అక్కడికి తన బృందంతో వెళ్లి భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతారు. ఇతను కంజెరపట్టి పాట అందుకున్నాడంటే ఇక భక్తులు గొంతు కలిపి పాట అందుకోవాల్సిందే. సినిమా పాటలను అనుకరించే పాటలతో పాటు సొంతంగా పాటలు రాయడం, రాసిన పాటలను సొంతంగా పాడటం ఈయన ప్రత్యేకత. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ప్రధాన ఉత్సవాలు మొదలయ్యాయంటే కోడం మల్లయ్యకు పిలుపు వస్తుంది. అంటే ఆయన భజన సంకీర్తనల్లో ఎంత ప్రావీణ్యుడో అర్థమవు తుంది.  హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన మల్లయ్య చేనేత కార్మికుడిగా, రచయితగా, గాయకుడిగా మంచి గుర్తింపును పొందారు.  ఇ ప్పటి వరకు ఆరు పుస్తకాల్లో 368 పాటలు రచించారు.

ప్రధాన ఆలయాల్లో మల్లయ్య బృందం సంకీర్తనలు..

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి దేవస్థానం, వేములవాడ, భద్రాచలం, యాదాద్రి, కొమురవెల్లి, పాలకుర్తి సోమేశ్వరాలయం ఆలయాల్లో మల్లయ్య భజన మండలి ఆధ్వర్యంలో అనేక సార్లు భజనలు, సంకీర్తనలు చేశారు. భద్రాచలం రామాలయం నుంచి మల్లయ్యకు ప్రతినెలా ఆహ్వానం అందుతుంది. యాదాద్రిలో 24 గంటలు ఓం నమో నారాయణ యజ్ఞం ఈయన ఆధ్వర్యంలో జరుగడం విశేషం. ఆయా ఆలయాలు, అక్కడి దేవతల మహత్యం, ప్రత్యేకతలపై పాటలు రాసి పుస్తకాలను సైతం అచ్చువేయించారు. ప్రస్తుతం శ్రీరామదాసు భజన మండలి రాష్ట్ర కమిటీ సలహాదారుగా ఉన్న మల్లయ్య, హుస్నాబాద్‌ పట్టణంలో సదానంద భజనమండలి, తిరుమల తిరుపతి భజన మండలి వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి ఎందరో కళాకారులను ప్రోత్సహించారు. ఇటీవల కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవంలోనూ తన బృం దంతో నగర సంకీర్తన చేసి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఎందరో ప్రముఖులచే అభినందించబడిన మల్లయ్య ఎన్నో జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు పొందారు.

 మల్లయ్య రాసిన పాటల పుస్తకాలు.. 

తిరుమల తిరుపతి భజన మాలిక (75 పాటలు)

వేములవాడ రాజేశ్వరస్వామి భజన మాలిక (50 పాటలు)

శ్రీకృష్ణ రాగమాలిక (76పాటలు)

శ్రీరామ రాగమాలిక (53 పాటలు)

యాదాద్రి  లక్ష్మీనర్సింహస్వామి భజన మాలిక (52 పాటలు)

భద్రాచల సీతారామ భజన మాలిక (62 పాటలు)

ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంచడమే లక్ష్యం : కోడం మల్లయ్య ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంచడమేలక్ష్యం. చిన్నప్పటి నుంచి నాకు భక్తి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమా పాటలను అనుకరిస్తూ కూడా భక్తి పాటలు రాశా. సొంతంగా అనేక పాటలు రాసి పాడా. నా భార్య లక్ష్మితో పాటు కుమారులు, కూతురు సహకారంతో పాటలను పుస్తక రూపంలోకి మార్చాను.  రాబోయే రోజుల్లో మరిన్ని భక్తి పాటలు రాయడంతో పాటు ప్రజను భక్తి పారవశ్యంలో ముంచేందుకు  గానం చేస్తూనే ఉంటా.

VIDEOS

logo