ఓటీపీ చెప్పు.. ‘రేషన్' పట్టు..

హైకోర్టు ఆదేశాలతో చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ విధానానికి స్వస్తి
ఫిబ్రవరి 1 నుంచి ఓటీపీ లేదా ఐరిస్ విధానంలో సరుకుల పంపిణీ
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
జిల్లాలో 680 రేషన్ దుకాణాలు, 2,87,879 రేషన్ కార్డులు
ప్రతినెలా 5771.467 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ
సిద్దిపేట కలెక్టరేట్, జనవరి 24 :
కరోనా మహమ్మారి నేపథ్యంలో చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ ద్వారా సరుకులు పంపిణీ విధానాన్ని బంద్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బయోమెట్రిక్ విధానంలో సరుకుల పంపిణీ విధానాన్ని బంద్ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి రేషన్ సరుకుల పంపిణీకి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఐరిస్ విధానంతో కెమెరాకు లబ్ధిదారుల కన్నును అనుసంధానం చేసి, ఆధార్ కార్డుకు వారి ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేయడం ద్వారా నేరుగా లబ్ధిదారుడి ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా సరుకులు అందించాలని ప్రభుత్వం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి ఐరిస్ లేదా ఓటీపీ విధానం ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభం కానున్నది.
పారదర్శకంగా పంపిణీ..
రేషన్ సరుకులను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానానికి స్వస్తి పలుకనున్నది. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఓటీపీ లేదా ఐరిస్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయనుంది. సిద్దిపేట జిల్లాలో 680 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో 2,87,879 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో అంత్యోదయ అన్న యోజన కింద 18,790 కార్డులు, ఫుడ్ సెక్యూరిటీ కింద 2,68,989, అన్నపూర్ణ కార్డుదారులు 93 మంది ఉన్నారు. సుమారు ఈ కార్డుదారులందరికీ ప్రతి నెలా 5771.467 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ ప్రభుత్వం ఆహార భద్రతను కల్పించి, ప్రతి నెలా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అందజేస్తున్నది. ఇందుకోసం రేషన్ షాపులకు ఈ-పాస్ మిషన్లను అందజేసి ఒక కుటుంబంలోని రేషన్‌కార్డు కలిగి ఉన్న వ్యకి వేలిముద్రలను బయోమెట్రిక్ సిస్టమ్ సరిపోల్చుకొని రేషన్ సరుకులు పంపిణీ చేసేది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఐరిస్ ఓటీపీ ద్వారా బియ్యం పంపిణీ చేయాలని సివిల్ సైప్లె అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ప్రతి రేషన్ దుకాణం పరిధిలోని కార్డుదారుల ఫోన్ నంబర్‌కు ఆధార్‌ను లింకు చేసుకోవడం, లేదా ఐరిస్ విధానంలోనే సరుకులను పంపిణీ చేసుకునేలా లబ్ధిదారులకు సమాచారం అందించాలని ఆదేశించింది.
మొబైల్ ఫోన్‌కు ఆధార్ అనుసంధానం..
వన్‌టైమ్ పాస్వర్డ్ ద్వారా బియ్యం పంపిణీ చేసుకునేందుకు వీలు కల్పించడంతో లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్ ఫోన్ నంబర్‌కు లింకు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలోనే అనుసంధానం చేసి ఉంటే అవసరం లేదని, అనుసంధానం చేయని వారు ఫోన్ నంబర్ లింకు చేసుకోవాలని సూచించారు. ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకున్న లబ్ధిదారులకు రేషన్ దుకాణానికి వెళ్లి తమ కార్డు నంబర్ చెప్పగానే, అందులోని కుటుంబ సభ్యుల్లో ఎవరైతే ఆధార్ అనుసంధానం ఉంటుందో, వారికి నేరుగా ఓటీపీ బటన్ క్లిక్ చేయగానే సదరు లబ్ధిదారుడి ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దీంతో రేషన్ డీలరుకు ఆ ఓటీపీ చెప్పడం ద్వారా సులభంగా సరుకులు పొందవచ్చు.