శనివారం 06 మార్చి 2021
Siddipet - Jan 24, 2021 , 00:31:44

ఈసారి ఆరు పరీక్షలే..

ఈసారి ఆరు పరీక్షలే..

పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు

జిల్లాలో పరీక్ష రాయనున్న  15,681 మంది ఎస్సెస్సీ విద్యార్థులు 

293 ప్రభుత్వ పాఠశాలల్లో 11,713 మంది.. 

90 ప్రైవేటు పాఠశాలల్లో 3,968 మంది విద్యార్థులు 

సిద్దిపేట అర్బన్‌, జనవరి 23 : 

రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తర్వులు జారీ చేసింది. మే 17వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. గతంలో లాగా కాకుండా ఈ సారి కేవలం ఆరు సబ్జెక్టులకు ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రతి సంవత్సరం జరిగే నాలుగు ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ టెస్టులకు గానూ, ఈ సారి రెండు ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ టెస్టులు మాత్రమే నిర్వహిస్తారు. మొదటి ఎఫ్‌ఏ మార్చి 15న, రెండో ఎఫ్‌ఏ ఏప్రిల్‌ 15న నిర్వహించనున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. 9, 10వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరుకావడం తప్పనిసరి కాదని, విద్యార్థులకు సరిపడా హాజరుశాతం లేకున్నా పరీక్షలకు అనుమతించనున్నారు.

జిల్లాలో పరీక్ష రాయనున్న 15,681 మంది విద్యార్థులు..

సిద్దిపేట జిల్లాలో మొత్తం 383 పాఠశాలల్లో 15,681 మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. 293 ప్రభుత్వ సంబంధిత పాఠశాలల నుంచి 11,713 మంది విద్యార్థులు ఉండగా, అందులో 227 మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 8,021 మంది విద్యార్థులు ఉండగా, 22 కేజీబీవీల్లో 682 మంది విద్యార్థులు, 16 సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో 920మంది, 14ఆదర్శ పాఠశాలల్లో 1344మంది, 6మైనార్టీ వెల్ఫేర్‌ పాఠశాలల్లో 322మంది, 5 మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 297 మంది, ఒక ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో 35 మంది, ఒక టీఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలలో  77మంది, ఒక ఎయిడెడ్‌ పాఠశాలలో 15మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం జిల్లాలో 90ప్రైవేట్‌ పాఠశాలల్లో 3,968 మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. 


VIDEOS

logo