ఇస్తర్ల తయారీలో ఆ నలుగురు

ఇస్త్తరాకుల యూనిట్ స్థాపించిన నలుగురు మహిళా సంఘాల సభ్యులు
రూ.5 లక్షల పెట్టుబడితో స్థాపన
మొదట్లో మార్కెటింగ్‌కు ఇబ్బందులు
ఇప్పుడు మోదుగాకు ఇస్త్తరాకులకు భలే గిరాకీ
అధికారులు, వ్యాపారుల నుంచి ఆర్డర్లు
సీఎం సమావేశానికి సరఫరా
తెలుగు లోగిళ్లలో పది, పదిహేనేండ్ల క్రితం వరకు ఏ పండుగైనా, దావత్ జరిగినా భోజనం చేసేందుకు మోదుగాకులతో కుట్టిన ఇస్త్తరాకులనే వాడేవారు. కాలక్రమేణా ప్లాస్టిక్ వినియోగం పెరుగడం, మోదుగాకుతో ఇస్త్తరాకులు కుట్టే వారు తగ్గడంతో వాటి వాడకం తగ్గి దాదాపు కనుమరుగైంది. మళ్లీ మోదుగ ఇస్తర్లను చూస్తామా అన్న తరుణంలో శ్రీగిరిపల్లి గ్రామ మహిళలు మోదుగాకులతో ఇస్త్తరాకులను మిషన్‌పై అందంగా కుట్టి విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో వీటిలో భోజనం చేసేందుకు అందరూ మక్కువ చూపుతున్నారు. దీంతో యూనిట్ స్థాపించిన నలుగురు మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభిస్తుండగా, స్వచ్ఛమైన పచ్చని ఆకులో భోజనం చేసే వారికి ఆరోగ్యకరణంగా మారింది.
-గజ్వేల్ రూరల్, జనవరి 23
మోదుగాకు ఇస్త్తరాకులకు భలే గిరాకీ..
‘వింటే భారతం వినాలి.. తింటే మోదుగాకు ఇస్తరాకులోనే తినాలి’ అన్నారు పెద్దలు. పది, పదిహేనేండ్ల క్రితం పండుగలు, దావత్‌ల్లో భోజనం చేసేందుకు మోదుగాకులతో కుట్టిన ఇస్త్తరాకులనే వాడేవారు. ఈ మధ్యకాలంలో మోదుగాకుతో ఇస్త్తరాకులు కుట్టే వారు కనిపించకపోవడంతో ప్లాస్టిక్ వినియోగం పెరిగింది. మళ్లీ మోదుగాకు వినియోగం రాదనుకున్న సమయంలో శ్రీగిరిపల్లి గ్రామంలో మహిళలు మోదుగాకుతో ఇస్త్తరాకులను మిషన్‌పై అందంగా కుడుతున్నారు. వీటిలో భోజనం చేసేందుకు ఎంతో మక్కువ చూపిస్తున్నారు. స్వచ్ఛమైన పచ్చని ఆకులో భోజనం చేస్తే ఎలాంటి వ్యాధులు రావని తెలిసి, రూపాయి ఎక్కువ ఖర్చు చేసైనా వాటినే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం రాకముందు గ్రామాల్లో ఏ ఇంటి ఎదుట చూసినా మోదుగాకు తోరణాలు కనిపించేవి.. కానీ, ప్లాస్టిక్ భూతం చాపకింద నీరులా మార్కెట్‌ను ముంచెత్తింది. మోదుగాకుతో ఇస్త్తరాకుల తయారీలో ఎంతో మందికి ఉపాధి లేకుండా చేసిన ప్లాస్టిక్‌ను తరిమేందుకు ఆ నలుగురు మహిళా సంఘాల సభ్యులు చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. కొద్దిపాటి డబ్బులతో ప్రారంభమైన వారి వ్యాపారం, దినదినాభివృద్ధి చెందుతున్నది. వారి ప్రయత్నానికి గ్రామ సర్పంచ్ చంద్రమోహన్‌రెడ్డి తోడ్పాటునందిస్తుండడంతో ముందుకు సాగుతున్నారు. మోదుగు, సరస్వతీ ఆకులతో తయారు చేస్తున్న ఇస్త్తరాకుల యూనిట్ పై ప్రత్యేక కథనం.
- గజ్వేల్ రూరల్, జనవరి 23
గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలోఇస్తరాకుల తయారీ చేస్తూ మహిళలు దూసుకపోతున్నారు. ఐకేపీ అధికారుల సూచనలతో ఇస్త్తరాకుల తయారీని చేపట్టారు. గ్రామానికి చెందిన రాపోలు కల్యాణి, ముసనగారి మంజుల, చేబర్తి రాణి, పాండవుల కవిత తొలుత ముందుకు వచ్చారు. దుబ్బాక మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన నిపుణుడి వద్ద ఒక రోజు శిక్షణ పొందారు వీరు. ఆ తర్వాత రూ. 5లక్షలు బ్యాంకు రుణం పొంది మిషనరీలు, కుట్టుమిష న్, ప్రెస్సీంగ్ మిషన్లతో పాటు ముడి సరుకును తెచ్చుకొని 2020 జూలైలో యూనిట్ ప్రారంభించారు.
రూపాయి లాభానికే అమ్మకం
మోదుగాకు ఎక్కువగా దొరకక పోవడంతో, ఖర్చు అధికంగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన ఒక్కో మోదుగాకును రూ.6కు విక్రయిస్తున్నారు. దీనిని తయారు చేసేందుకు ఎక్కువ ఖర్చు రావడంతో ధరను ఒక రూపాయి అధికంగా పెట్టి విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదే సరస్వతీ ఆకు తయారీకి ఒక్కో ఆకుకు కేవలం రూ.3.40 రావడంతో, వాటిని రూ.4.50 నుంచి రూ.5కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. సరస్వతీ ఆకులో అట్టకు రూ.1.60, కుట్టినందుకు 60 పైసలు, ఆకు 60 పైసలు, ఇతర ఖర్చులు మరో 60 పైసలు వస్తుంది.
అమ్మకానికి భలే గిరాకీ
ఇస్త్తరాకులను తయారు చేసిన తర్వాత విక్రయించడం (మార్కెటింగ్) చేయడం మహిళల సంఘాల సభ్యులకు కష్టంగా ఉండేది. కానీ, నేడు మోదుగాకు, సరస్వతీ ఆకుతో తయారు చేసే ఇస్త్తరాకులకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడడంతో గిరాకీ పెరిగింది. గజ్వేల్, సిద్దిపేట, హైదరాబాద్, భువనగిరి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు సూపర్ మార్కెట్లలో విక్రయించేందుకు వీరి వద్దకు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం శుభఖార్యాలు, దావత్‌ల్లో వీటినే ఎక్కువగా వాడుతున్నారు.
టిఫిన్, గప్‌చుప్ ప్లేట్లకు డిమాండ్..
మోదుగాకు, సరస్వతీ ఆకులతో తయారు చేసే టిఫిన్, గప్‌చుప్ ప్లేట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ టిఫిన్ ప్లేట్ రూ. 2, గప్‌చుప్ ప్లేట్ రూపాయికి విక్రయిస్తున్నారు. గజ్వేల్, సిద్దిపేట లాంటి పట్టణాల్లో వందల సంఖ్యలో టిఫిన్ సెంటర్లతో పాటు గప్‌చుప్ బండ్లు ఉన్నాయి. శ్రీగిరిపల్లిలో తయారుచేసే ప్లేట్లనే ఎక్కువగా చిరు వ్యాపారులు వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు తీసుకొస్తే వీటి వినియోగం మరింత పెరగడంతో పాటు ఎంతో మందికి ఉపాధి దొరకనుంది.
రాణించడం సంతోషం ఉంది..
ఇస్త్తరాకుల వ్యాపా రంలో రాణించడం సంతోషంగా ఉంది. చాలా మంది వ్యాపారులు మోదుగాకు, సరస్వతీ ఆకులతో చేసిన ఇస్త్తరాకులనే కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తునారు. వ్యాపారం బాగుంది.
-మంజుల, ఇస్తరాకుల తయారీ యూనిట్ నిర్వాహకురాలు
మోదుగాకు@పీర్లపల్లి
మోదుగాకులకు పెట్టింది పేరు జగదేవ్‌పూర్ మండల పరిధిలోని పీర్లపల్లి. అక్కడ ఏఇంటి ముందు చూసినా మోదుగాకు తోరణాలే కనిపిస్తాయి. ఎండకాలంలో వాటిని అటవీ ప్రాంతం నుంచి తెచ్చుకొని తోరణాలుగా చేసి అరబెడతారు. గతంలో ఇస్త్తరాకులు కుట్టి హైదరాబాద్‌కు సరఫరా చేసే వారు. కానీ, ఇప్పుడు శ్రీగిరిపల్లి గ్రామంలో తయారు చేస్తున్న ఇస్తరాకుల కేంద్ర నిర్వాహకులు ముందుగానే వాటిని కొనుగోలు చేసేందుకు మాట్లాడుకుంటున్నారు. గజ్వేల్ ప్రాంతంలోనే పీర్లపల్లి మోదుగాకు దొరికే ఏకైక గ్రామంగా చెప్పవచ్చు.
సీఎం మీటింగ్‌కు తీసుకెళ్లారు..
సిద్దిపేటలో జరిగిన సీఎం కేసీఆర్ మీటింగ్‌కు అధికారులు ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్లారు. అక్కడ చూసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతో బాగున్నాయని మెచ్చుకున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. మా వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తాం. ఇతర ప్రాంతాలకు ఇస్త్తరాకులను సరఫరా చేసేందుకు సిద్ధ్దంగా ఉన్నాం.
- కవిత, నిర్వాహకురాలు
తాజావార్తలు
- వామన్‌రావు హత్య కేసు సీబీఐకి ఇవ్వండి
- మహిళా దినోత్సవం నిర్వహణకు కమిటీ
- ఎన్ఏఈబీ సభ్యుడిగా శ్రీనివాస్‌రెడ్డి
- మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
- ‘వెల్చేరు’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా
- ఖనిజ నిధులతో అభివృద్ధి
- ముగిసిన జిల్లా స్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్
- బంగారం కొనుగోలుకు ఎస్బీఐ రుణ పరపతి ఇలా..
- వాస్తవాలు గ్రహించండి