మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Jan 24, 2021 , 00:16:09

బాటిళ్లలో.. భగీరథ జలం

బాటిళ్లలో.. భగీరథ జలం

మిషన్‌ భగీరథ వాటర్‌ బాటిళ్ల తయారీ

త్వరలోనే సిద్దిపేట జిల్లాలో అందుబాటులోకి 

తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు అందించడమే లక్ష్యం

గజ్వేల్‌ మండలం కోమటిబండ కేంద్రంగా లక్ష బాటిళ్ల తయారీకి ఏర్పాట్లు  

ఒక్కో వాటర్‌ బాటిల్‌ సామర్ధ్యం 300 ఎంఎల్‌

ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తున్న ప్రభుత్వం 

జిల్లాలో 2,03,370 నల్లా కనెక్షన్లు

588 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల నిర్మాణం

2,641 కిలోమీటర్ల పైప్‌లైన్లు

‘మిషన్‌ భగీరథ’ పథకం విజయవంతమై ఇప్పటికే ఇంటింటికీ శుద్ధి తాగునీరు అందుతుండగా, జిల్లాలో త్వరలోనే ‘మిషన్‌ భగీరథ’ వాటర్‌ బాటిళ్ల్లు వినియోగంలోకి రానున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. జిల్లాలో తొలుత లక్ష వాటర్‌ బాటిళ్లను తయారు చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో వాటర్‌ బాటిల్‌ సామర్ధ్యం 300 ఎంఎల్‌ ఉంటుంది. మొదటి విడుతలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వీటిని అందించనున్నారు. ఆ తర్వాత అధికారిక సమావేశాల్లో వీటినే ఉపయోగించనున్నారు. డబ్బా నీటి (ఆర్వో) వాడకంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకర మిషన్‌ భగీరథ నీటిని తాగేందుకు ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో పాటు బాటిళ్లలో మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేసి అధికారులు, ప్రజాప్రతినిధులు తాగేలా చర్యలు తీసుకుంటున్నది. తద్వారా ప్రజలకు భరోసా ఏర్పడనుంది.

- సిద్దిపేట, జనవరి 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి)

నిత్యం ఒక్కో వ్యక్తికి సరఫరా చేస్తున్న నీరు (లీటర్లలో)

గ్రామాల్లో 100 

మున్సిపాలిటీల్లో 135

మున్సిపల్‌ కార్పొరేషన్లలో 150 

మిషన్‌ భగీరథ వాటర్‌ బాటిల్స్‌ త్వరలోనే సిద్దిపేట జిల్లాలో అందుబాటులోకి రానున్నాయి. తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు అందించే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. గజ్వేల్‌ మండలం కోమటి బండ కేంద్రంగా లక్ష వాటర్‌ బాటిల్స్‌ను తయారు చేయాలని నిర్ణయించారు. ఒక్కో వాటర్‌ బాటిల్‌ 300 ఎంఎల్‌ సామర్ధ్యం ఉండనున్నది. కొద్దిరోజుల్లోనే వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూపొందించి, పూర్తిచేసిన సిద్దిపేట సమగ్ర తాగునీటి పథకమే ‘మిషన్‌ భగీరథ’ పథకానికి స్ఫూర్తి. ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధిచేసిన తాగునీటిని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్‌ భగీరథ’ తాగునీటి పథకాన్ని ప్రారంభించింది. నాడు సిద్దిపేటలో అమలు చేసిన విధంగానే ఇవాళ ‘మిషన్‌ భగీరథ’ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీరు అందిస్తున్నారు. 

సిద్దిపేట, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

జిల్లాలో 2,03,370 నల్లా కనెక్షన్లు..

సిద్దిపేట,గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి ,ధూళిమిట్ట మండలాలతో పాటు మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలాలు జిల్లా పరిధిలోకి వస్తాయి. జిల్లాలో మొత్తం 754 ఆవాస గ్రామాలకు నిత్యం తాగునీటిని అందిస్తున్నారు. ఇవి కాకుండా అన్ని మున్సిపాలిటీలకు నిరంతరంగా మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందుతున్నది. మొత్తం 588 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు నిర్మించారు. 2,641 కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేసి, 2,03,370 నల్లా కనెక్షన్లు ఇవ్వడంతో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు. జిల్లాకు సరిపడా నీటినంతా హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ సైప్లె నుంచి రాజీవ్‌ రహదారిపై కొండపాక వద్ద ఉన్న పాయింట్‌ నుంచి 6.27 ఎంజీడీ నీళ్లను తీసుకొని, సిద్దిపేట, కొండపాక, నంగునూరు మండలాలకు, మరో 5.60 ఎంజీడీ నీళ్లను ఇదే పాయింట్‌ నుంచి తీసుకొని జనగామ నియోజకవర్గంలోని కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు,ధూళిమిట్ట  మండలాలకు తాగునీటిని అందిస్తున్నారు. ప్రజ్ఞాపూర్‌ పాయింట్‌ వద్ద 16.20 ఎంజీడీ నీళ్లను తీసుకొని కోమటిబండ సంప్‌హౌస్‌ నుంచి గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాలకు నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ సెగ్మెంట్‌ నుంచి 10 ఎంజీడీల నీటిని హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలకు తాగునీటిని అందిస్తున్నారు. మొత్తంగా జిల్లాకు 47.57 మిలియన్‌ గ్యాలన్ల నీళ్లు ఒక రోజుకు అవసరమవుతాయి. 

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా 754 హ్యాబిటేషన్లలో ఇంటింటికీ తాగునీరు అందుతున్నది. 588 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు, సంప్‌లు నిర్మించారు. 2,641 కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేసి 2,03,370 నల్లా కనెక్షన్‌ ఇవ్వడంతో ప్రతి ఇంటికీ ఇవ్వాళ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. 

త్వరలో ‘మిషన్‌ భగీరథ’ వాటర్‌ బాటిల్స్‌..

సిద్దిపేట జిల్లాలో ‘మిషన్‌ భగీరథ’ వాటర్‌ బాటిల్స్‌ త్వరలోనే వినియోగంలోకి రానున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. గజ్వేల్‌ మండలం కోమటిబండ ‘మిషన్‌ భగీరథ’ నాలెడ్జ్‌ సెంటర్‌లో ఇటీవల మిషన్‌ భగీరథ కార్యదర్శి, సీఎం ఓఎస్డీ స్మితాసబర్వాల్‌ ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులు తయారు చేయించిన మిషన్‌ భగీరథ వాటర్‌ బాటిల్స్‌ను ఆమె పరిశీలించారు. జిల్లాలో తొలుత లక్ష వాటర్‌ బాటిల్స్‌ను తయారు చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో వాటర్‌ బాటిల్‌ సామర్ధ్యం 300 ఎంఎల్‌ ఉంటుంది. బాటిల్స్‌పై మిషన్‌ భగీరథ స్టిక్కర్‌ను అంటిస్తున్నారు. తొలుత జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ సమావేశాల్లో, జిల్లా స్థాయి సమీక్షా సమావేశాల్లో భగీరథ వాటర్‌ బాటిల్స్‌ అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఈ సమావేశాల్లో  భగీరథ వాటర్‌ బాటిల్స్‌ వాడకం ద్వారా నాణ్యతపై ప్రజల్లో అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ప్రజల్లో ఉన్న అపోహలు తొలిగిస్తూ భగీరథ నీటి వినియోగంపై అవగాహన కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మిషన్‌ భగీరథతో గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీల్లోని ప్రతి ఒక్కరికీ 135 లీటర్లు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని ప్రతి ఒక్కరికీ రోజుకు 150 లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ, నీటిశుద్ధి కేంద్రాల్లో నీటి నాణ్యతను నిశితంగా పరిశీలించి ,అన్ని పరీక్షల చేసిన అనంతరమే ప్రజలకు తాగునీటిని  సరఫరా చేస్తున్నారు. మిషన్‌ భగీరథ నీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ నాణ్యతా ప్రమాణాలను, బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌కు అనుగుణంగా నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉన్నాయి. భగీరథ నీటి నాణ్యత, వినియోగంపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డబ్బా నీటి (ఆర్వో) వాడకంతో తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. 

డబ్బా నీటి (ఆర్వో) వాడకంతో ఆరోగ్య సమస్యలు..

మారుమూల పల్లె ప్రాంతాల్లో కూడా ప్రజలు ఆర్వో ఫిల్టర్‌ ద్వారా తయారైన బాటిల్‌ నీళ్లను వాడుతున్నారు. సురక్షితమైన నీరు తాగుతున్నామని భ్రమలో, సంపాదనలో ఎక్కువ మొత్తం వాటర్‌ బాటిల్‌ కొనడానికి ఖర్చు చేస్తున్నారు. కానీ, ఆర్వో డబ్బా వాటర్‌లో సహజమైన ఖనిజాలైన మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, సోడియం, ఇతర ముఖ్యమైన లవణాలను ఆర్వో ఫిల్టర్‌ తొలిగిస్తుంది. తద్వారా మానవ శరీరం ఖనిజ లవణ లోపానికి కారణమవుతుంది. కాల్షియం లేకపోవడంతో  ఎముకలు, కీళ్లు బలహీనంగా తయారవుతాయి. మెగ్నీషియం పూర్తిగా లేకపోవడంతో శరీరంలో జీవక్రియను ప్రభావితం చేస్తుంది. నైట్రేట్‌ లోపించడంతో రక్తప్రసరణ ప్రభావితమవుతుంది.ఖనిజ లవణాలను తొలిగించడంతో నీరు ఆమ్లత్వం శరీర అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. 

VIDEOS

logo