ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Jan 23, 2021 , 00:03:52

తవ్విద్దాం.. బావి

తవ్విద్దాం.. బావి

  • వ్యవసాయ కొత్త బావుల తవ్వకానికి ఆసక్తి చూపుతున్న రైతులు
  • జిల్లాలో జోరుగా తవ్వకాలు
  • పుష్కలంగా నీరు.. పెరిగిన భూగర్భ జలాలే కారణం
  • బోరుబావి కంటే మేలని రైతుల విశ్వాసం
  • యంత్రం సహాయంతో రెండు రోజుల్లోనే కొత్తబావి 
  • మళ్లీ బావుల సేద్యం

సిద్దిపేట, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసి బోరు వేస్తే అందులో నీళ్లు వచ్చేది ఎంతో.. రానిదేందో...! ఒక వేళ బోరు నిండా నీళ్లు వచ్చినా.. కొన్ని ఏండ్ల తర్వాత ఆ బోరు బావి కూడుకపోకమానదు..! ఇలా ఎన్ని బోర్లు వేసినా ఫలితం లేదని గమనించిన రైతులు ఇప్పుడు తాజాగా నూతన బావుల తవ్వకంపై మొగ్గుచూపుతున్నారు. బావి ఓ యేడాది ఎండిపోయినా.. మరో యేడాదికి పుష్కలంగా నీళ్లు వస్తాయి... అనేది రైతుల గట్టి నమ్మకం. బావి శాశ్వతంగా  ఉంటుంది. జిల్లాలో కొత్త బావులను టెక్నాలజీని ఉపయోగించి తవ్వుతున్నారు. రెండు మూడు రోజుల్లోనే కొత్త బావి తయారవుతున్నది. జిల్లాలో యాసంగి సాగులో వరినాట్లు  పూర్తి కావొచ్చాయి. ఈ యేడాది యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక, కొండపోచమ్మ రిజర్వాయర్లలో గోదావరి జలాలున్నాయి. వచ్చే నెలలో మళ్లీ చెరువులను నింపే ప్రక్రియను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ యేడాది పుష్కలంగా వర్షాలు పడడంతో చెరువుల నిండా నీళ్లున్నాయి. నెల రోజుల నుంచి యాసంగి సాగు దున్నకాలు జోరుగా నడుస్తుండడంతో చెరువుల్లో నీటి మట్టం తగ్గుతూ వస్తోంది. భూగర్భ జలాలు మంచిగా ఉండడంతో ఎక్కువగా అన్నదాతలు కొత్త బావుల తవ్వకంపై దృష్టి సారిస్తున్నారు.

కలిసొచ్చిన కాలం..  పండుగలా ఎవుసం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఈ సారి కాలం కలిసొచ్చిందని చెప్పాలి. జిల్లాలో పెద్ద ఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడంతో గోదావరి జలాలతో రిజర్వాయర్లు నిండు కుండలా మారాయి. ఫలితంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ సారి యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. ఇప్పటికే 90 శాతానికి పైగా వరినాట్లు రైతులు పూర్తి చేశారు. మిగిలిపోయిన వరినాట్లు ఈ వారంలో పూర్తి కానున్నాయి. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకా రం సిద్దిపేట జిల్లాలో 2,84,580 మంది రైతులకు గాను ఎకరాకు రూ.5వేల చొప్పున  జిల్లాలోని రైతులందరికీ యాసంగి రైతు బంధు కింద రూ. 315.03 కోట్లు ఇటీవల జమ చేసింది.  జిల్లాలోని మూడు రిజర్వాయర్లలో ప్రస్తుతం నీళ్లు  13.5 టీఎంసీలుల నీళ్లు ఉన్నాయి. మల్లన్నసాగర్‌, గౌరవెల్లి రిజర్వాయర్ల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 3,484 చెరువులున్నాయి. శనిగరం మధ్యతరహా ప్రాజెక్టుతో పాటు తపాస్‌పల్లి రిజర్వాయర్‌ కింద రైతులు వరినాట్లు పూర్తి కావొచ్చాయి. రైతులకు చేతినిండా పని  దొరికింది. సాగుకు యోగ్యమైన ప్రతి అంగుళాన్ని అచ్చుకట్టి సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుండడంతో రైతులు ఆనందంతో సాగు చేస్తున్నారు.

రెండు రోజుల్లోనే కొత్త వ్యవసాయ బావి తవ్వకం..

ఒకప్పుడు కొత్త బావులు తవ్వాలంటే కొన్ని నెలల సమయం పట్టేది. ప్రస్తుతం యంత్రాల సహాయంతో రెండు, మూడు రోజుల్లోనే కొత్త బావులు తవ్వుతున్నారు. యంత్రాల సహాయంతో బావులు తవ్వడంతో సమయం ఆదా కావడంతో పాటు రైతులకు త్వరగా వినియోగంలోకి వస్తున్నాయి. జిల్లాలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో రైతులు బోరు బావులు కాకుండా కొత్త బావులను తవ్వుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఒక బోర్‌ వేస్తే సుమారు రూ.60 వేల నుంచి లక్ష వరకు ఖర్చవుతుంది. తీరా బోర్‌ వేశాక నీళ్లు వస్తే సరేసరి లేకపోతే ఆ బోర్‌ ఖర్చు రైతును నిండా ముంచుతుంది. పైగా కొన్నేండ్లు తర్వాత ఆ బోర్‌ నుంచి నీళ్లు రాకపోవడం.. అదీకాగా మట్టి కూరుకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ యేడాది కొత్తగా ఆయకట్టు పెరుగడంతో రైతులు ఎక్కడికక్కడ పొలాలు చేస్తున్నారు. కొత్తగా అచ్చుకట్టి నాట్లు వేస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులు ఎక్కువగా కొత్త బావులను తవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. ఇటీవల రైతులు ఎక్కడ చూసినా యంత్రాల సహాయంతో కొత్త బావులను తవ్వుతున్నారు. యంత్రంతో బావి తవ్వడానికి గంటకు రూ. 2,800లు  తీసుకుంటున్నారు. ఒక బావి పొడవు-8, వెడల్పు-8 గజాల విస్తీర్ణంలో 12 గజాల లోతు వరకు భూమి పై నుంచి యంత్ర సహాయంతో తవ్వుకుంటున్నారు. తర్వాత మరింత లోతు తవ్వాలంటే  బేస్‌ (ర్యాంప్‌) వేసుకొని మరో 10 నుంచి 12 గజాల వరకు లోతు తవ్వుకునే అవకాశం కలుగుతుంది.  ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు యంత్ర సహాయంతో 12 గజాల లోతు తవ్వగానే నీళ్ల ఊట వస్తున్నాయి. ఇలా 12 గజాల వరకు రైతు తవ్వుకున్న బావికి మొత్తం ఖర్చులు అన్నీ కలుపుకొని సుమారుగా రూ. లక్షా 20వేల వరకు వరకు ఖర్చు వస్తుంది. ( ఒక బావి మోటర్‌కు రూ.20 వేలు ఖర్చు అవుతాయి.). దీంతో ఎక్కువగా యంత్రాల సహాయంతో కొత్త బావులను తవ్వడానికి రైతులు దృష్టి సారిస్తున్నారు.

బోర్ల మీద నమ్మకం లేకే బావి తవ్విస్తున్న..

బోర్ల మీద నమ్మకం పోయింది. బోరు వేస్తే పడేది ఏదో.. పడనిది ఏదో.. ఇప్పటికే రెండు మూడు సార్లు బోర్లు వేసిన. బావి ఐతే నీళ్లు ఎప్పటికి ఉంటయి. కొన్నేండ్ల దాక ఇబ్బంది ఉండదు. మిషన్‌తో 12 గజాల వరకు బావి తవ్విస్తున్న. మిషన్‌తో తవ్వితే పని తొందరగా అవుతది. గంటకు రూ.2,800 తీసుకొని బావి తవ్విస్తున్నరు. చాలా మంది రైతులు ఇలానే బావులు తవ్విస్తున్నారు.

- లక్ష్మారెడ్డి, రైతు, సిద్దన్నపేట

12 గజాలకు రూ.లక్షలు

నా పొలంలో కొత్త బావిని తవ్వించిన. పని తొందరగైంది. 12 గజాల బావికి నాకు లక్ష రూపాయల ఖర్చు వచ్చింది. రూ.20 వేలతో కొత్త మోటరును తెచ్చి, ఫిట్‌ చేయించిన బోరు బావులకు పెట్టే ఖర్చుతో బావిని తవ్వుకొవచ్చు. బావి నమ్మకం.. కొన్ని ఏండ్ల వరకు మనకు పని చేస్తుంది. బోర్లు ఎప్పుడు ఎండిపోతాయో తెల్వదు. కాలం ఐతే చాలు బావి నిండా పుష్కలంగా నీళ్లుంటాయి.

- రాజిరెడ్డి, రైతు, సిద్దన్నపేట 


VIDEOS

logo