శనివారం 06 మార్చి 2021
Siddipet - Jan 23, 2021 , 00:04:15

అర్హులకు యాజమాన్య హక్కులు

అర్హులకు యాజమాన్య హక్కులు

సిద్దిపేట కలెక్టరేట్‌, జనవరి 22 : ముప్పై ఏండ్ల క్రితం కాళ్లకుంట కాలనీలోని లేఔట్‌లో ప్రభుత్వం 1558 మంది పేదలకు ఇండ్ల పట్టాలను ఇచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గడిచిన ముప్పై ఏండ్లలో అనేక మార్పులు జరిగాయన్నారు. కాలనీ సందర్శన సమయంలో ఇండ్లు తమ పేరుపై లేవని, నల్లా, కరెంట్‌ కనెక్షన్లు ఇతరుల పేరు మీద ఉన్నాయని, వాటిని ప్రభుత్వ రికార్డుల్లో సరిచేయాలని కాలనీవాసుల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చేవన్నారు. ఈ సమస్యలు, ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం ఆలోచించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నిజమైన లబ్ధ్దిదారులకు యాజమాన్య హక్కులు, పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు నివాస స్థల పట్టాల పం పిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. శుక్రవారం విపంచి కళా నిలయంలో 27వ వార్డు కాళ్లకుంట కాలనీ 180 మంది లబ్ధిదారులకు తొలిదశలో పట్టాలను అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళ్లకుంట కా లనీలో 30 ఏండ్లుగా నివాసముంటున్న వారికి పట్టాలు ఇస్తామన్నారు. కాలనీని మొత్తం సర్వే చేయించి అర్హులైన వారికి పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కాళ్లకుంట కాలనీలో 1558 ప్లాట్లు ఉంటాయని, వీటి లో 30 ఏండ్ల నుంచి ఇప్పటివరకు 493 మంది మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో? వారి పిల్లలు, వారసులు ఉన్నారని, 588 మంది ఆ స్థలాలు కొన్నవారు ఉన్నారని, దాదాపు 400 పైగా ఖాళీ స్థలాలు ఉన్నాయ ని, 67 మంది కిరాయి ఉన్నారని తెలిపారు. ఈ రోజు 180 మందికి పట్టాలు ఇస్తున్నామన్నారు. ఒక ఇంటికి 3 పట్టాలు ఇస్తున్నామ ని, మ్యుటేషన్‌, నల్లా, కరెంట్‌ మీటరు మీ పేరు మీదే ఇస్తామని తెలిపారు. కాలనీలో రెండు రోజులకు ఒకసారి నల్లా వస్తుందని, రోజు ఉదయాన్నే మున్సిపల్‌ నల్లాలు వచ్చేలా చూడాలని మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారిని మంత్రి ఆదేశించారు. యూజీడీ కనెక్షన్‌ ప్రతి ఇంటికి ఇవ్వాలని, 10 రోజుల్లో  పనులు పూర్తి చేయాలన్నారు. అందరూ తడి, పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరణ వాహనాలకు ఇవ్వాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకం మానేయాలని, సరుకులను కొనడానికి మార్కెట్‌ కు వెళ్తే స్టీల్‌ బాక్సు, బట్ట సంచులు తీసుకెళ్లాలన్నారు. మీ కోసం స్టీల్‌ బ్యాంకులు ఏర్పాటు చేశామని తెలిపారు.

VIDEOS

logo