శనివారం 06 మార్చి 2021
Siddipet - Jan 22, 2021 , 01:25:40

మెట్ట ప్రాంతాల్లో సిరుల పంటలు

మెట్ట ప్రాంతాల్లో సిరుల పంటలు

బెజ్జంకి, జవనరి 21 : మండలం మెట్ట ప్రాంతం కావడంతో రైతులందరూ కేవలం వర్ష ఆధారిత పంటలను మాత్రమే సాగు చేసేవారు. దీంతో పంటల దిగుబడి సరిగ్గా రాక అప్పుల్లో కురుకుపోయేవారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  రైతుల సాగు నీటి కష్టాలు తీరాయి. రైతును రాజు చేయాలన్న ధృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. వేలాది కోట్లు వెచ్చించి గోదావరి జలాలను మెట్ట ప్రాంతాలకు మళ్లించడంతో ఇప్పుడు మెట్టమాగాణుల్లో సిరులు పంటలు పండనున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, మిడ్‌మానేరు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి, అన్నపూర్ణ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు చేరడంతో, ప్రధాన కాల్వల ద్వారా దిగువ ప్రాంతంలోని చెరువులు, కుంటలను నింపనున్నారు. త్వరలో పంటలకు సాగు నీరు అందనుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

20వేల ఎకరాలకు సాగునీరు

గతంలో సాగునీరు లేక అవస్థలు పడ్డ రైతులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ఊరట కలిగించింది. సాగునీటి ప్రాజెక్టులతో మండలంలో 20వేల ఎకరాల ఆయకట్టు రైతులకు సాగునీరు అందనున్నది. అన్నపూర్ణ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడంతో దిగువ రైతులకు సాగునీటిని అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 10లో భాగంగా మండలంలోని గుండారం, బెజ్జంకి, కల్లేపల్లి, వడ్లూర్‌బేగంపేట, దాచారం, ముత్తన్నపేట, వీరాపూర్‌, తోటపల్లి మీదుగా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్‌ వరకు 15.2కి.మీ పొడువునా డీ7 కాల్వను నిర్మిస్తున్నారు. ఈ కాల్వతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు నింపడంతో పాటు దిగువ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించనున్నారు. దీంతో డీ7 ప్రధాన కాల్వ, 19 ఉపకాల్వలతో 14,000 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. అంతేకాకుండా తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌ నిర్మాణంతో తోటపల్లి, దేవక్కపల్లి, తిమ్మాపూర్‌ మండలంలోని రేణికుంట వరకు డీ6 ప్రధాన కాల్వతో పాటు ఉపకాల్వలను  నిర్మిస్తున్నారు, దీంతో 3012 ఎకరాలకు సాగునీరు అందనున్నది. కోహెడ మండలంలోని శనిగరం చెరువు నుంచి మండలంలోని బెజ్జంకి, గుగ్గిళ్ల, గాగిల్లాపూర్‌, ముత్తన్నపేట, దాచారం, రేగులపల్లి, చీలాపూర్‌ గ్రామాల్లోని 2,564 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. 

గోదారమ్మ పరవళ్లు..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కాళేశ్వరం’, మిడ్‌మానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్లు పూర్తికావడంతో ‘కాళేశ్వర’ జలాలను ప్రాజెక్టులోకి మళ్లించారు. దీంట్లో భాగంగా గత వేసవి కాలంలో అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్వల ద్వారా మండలంలోని బెజ్జంకి, గుండారం, చీలాపూర్‌, ముత్తన్నపేట, కల్లెపల్లి, బేగంపేట, లక్ష్మీపూర్‌, దాచారం ఇతర గ్రామాల్లోని చెరువులు, కుంటలు ‘కాళేశ్వరం’ జలాలతో మత్తడి దుంకుతున్నాయి. మండుటెండల్లో గోదావరి జలాల రాకతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

VIDEOS

logo