ధరణితో.. భద్రతా, పారదర్శకత

భూవివాదాలు పరిష్కరించడం, భూములకు భద్రత కల్పించడం, సేవల్లో పారదర్శకత, రైతులు, క్రయ విక్రయ దారుల ఇబ్బందులు తొలగించడం, భూవివాదాలు లేని రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ‘ధరణి’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో గురువారం ‘ధరణి’ పోర్టల్‌పై జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 70ఏండ్లయినా దేశంలో భూవివాదాలు పరిష్కారం కాలేదన్నారు. కోర్టులు, పోలీసుస్టేషన్లలో కేసులు నానుతున్నాయని తెలిపారు. భూ వివాదాలతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధరణితో భూ సమస్యలకు సీఎం కేసీఆర్ చెక్పెడుతున్నారని తెలిపారు. జిల్లాలో సాదాబైనామాల దరఖాస్తులు, పార్ట్-బీ భూముల సమస్యలు త్వరగా పరిష్కరించి, అర్హులకు పాసుబుక్కులు అందించాలని యంత్రాంగానికి ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.
సిద్దిపేట, జనవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భూతగాదాల శాశ్వత పరిష్కారమే కాకుండా లంచాలు లేకుండా నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా సేవలందించేందుకు ‘ధరణి పోర్టల్'ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని, క్రయవిక్రయాదారులకు ధరణి వరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లయినా దేశంలో భూతగాదాలు పరిష్కారం కాలేదని, పోలీసుస్టేషన్లలో నమోదైన కేసు ల్లో సగానికి పైగా భూతగాదాలకు సంబంధించినవేనని, భూ వివాదాలతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి అన్నారు. భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే సీఎం ‘ధరణి’ పోర్టల్ శ్రీకారం చుట్టారని తెలిపారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో ‘ధరణి’ పోర్టల్‌పై గురువారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తమ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితెల సతీశ్‌కుమార్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్లు పద్మాకర్, ముజామిల్ ఖాన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతుబంధు సమితి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, సేవలు సులభతరం అయినట్లు తెలిపారు.
‘ధరణి’తో భద్రతా, భరోసా...
కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం భూవిషయా ల్లో తలదూర్చలేనంతగా పారదర్శకతో ’ధరణి’ ఏర్పడిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. భూముల రికార్డులను వ్యక్తుల చేతుల్లో నుంచి ధరణితో వ్యవస్థలోకి ప్రభుత్వం తెచ్చిందని తెలిపారు. ధరణితో వేగంగా, సులభంగా, తేలిగ్గా, పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా సేవలు అందుతున్నాయన్నారు. ధరణి పోర్టల్‌లో భూ వివరాలు ఎక్కాయంటే కలెక్టర్‌కు కూడా తొలగించే, సవరించే అధికారం లేదన్నారు. వ్యక్తుల చేతుల్లోని విచక్షణాధికారాలను ధరణి తొలగించిందన్నారు. దేశంలోనే 28 రాష్ర్టాల్లో ఎక్కడా ‘ధరణి’ పోర్టల్ వ్యవస్థ లేదన్నారు.
బాలారిష్టాలు అధిగమిస్తూ...
‘ధరణి’ పోర్టల్ ప్రారంభంలో వచ్చిన బాలారిష్టాలు అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కలెక్టర్ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్ సభ్యుడిగా భూ వివాదాల సత్వర పరిష్కారానికి ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేసిందన్నారు. పెండింగ్ మ్యుటేషన్లు అమలు చేయడంలో సిద్దిపేట నంబర్‌వన్, మెదక్ నంబర్ టూ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ రెండు జిల్లాల్లో 2,911 మ్యుటేషన్లు అమలు చేశామన్నారు. ఏమైనా పెండింగ్‌లో ఉంటే త్వరగా అమలయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. విదేశాల్లో ఉన్న వ్యక్తులు, అనారోగ్య కారణాలతో ఇంటి నుంచి బయటకు రానివారు తమ భూములను అమ్ముకునేలా, కొనుగోలు చేసేలా ధరణిలో ప్రత్యేక సౌకర్యం కల్పించామన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో మిస్సింగ్ విస్తీర్ణం కూడా సరిచేసేలా సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు. ‘22-ఏ’లో తొలగించిన భూముల సమస్యలను పరిష్కారం చూపుతామన్నారు. సమావేశంలో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సతీశ్‌కుమార్ మాట్లాడారు. ధరణి సేవలపై అడిగిన పలు సందేహాలను మంత్రి హరీశ్‌రావు నివృత్తి చేశారు.
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
జిల్లాలో 44,583 సాదాబైనామాల అమలు కోసం రైతులు దరఖాస్తు చేసుకున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.అత్యధికంగా దుబ్బాక, అక్కన్నపేట మండలాల్లో వచ్చినట్లు తెలిపారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమన్వయ సమితి సభ్యులు 3 నెలల్లో అన్ని సాదాబైనామాలకు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. అర్హులకు పాసుబుక్కులు జారీఅయ్యేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. ‘ధరణి’ పోర్టల్ ద్వారా అన్ని భూ సమస్యలకు పరిష్కారం చూపాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ధరణితో కలిగే ప్రయోజనాలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించాలన్నారు. పార్ట్ -బీ భూములకు నెల రోజుల్లో పరిష్కరించేలా అధికారులకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చిందన్నారు. అటవీ, రెవెన్యూ అధికారుల సంయుక్త సర్వే ద్వారా అటవీ భూ వివాదాలకు రెండో దశలో పరిష్కారం చూపాలన్నారు. పేదలు కొన్న అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలను రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు.