బడికి రెడీగా..

- ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం
- జిల్లాలో తెరుచుకోనున్న 506 విద్యాసంస్థలు
- ఒక క్లాసులో 20 మందికి మాత్రమే అనుమతి
- సూచనలు, మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ
- ఏర్పాట్ల పర్యవేక్షణకు మండల, డివిజన్ స్థాయిలో అధికారుల నియామకం
- ఇప్పటికే పుస్తకాలు, యూనిఫామ్‌ల అందజేత
- 23న కలెక్టర్‌కు ఏర్పాట్ల నివేదికలు
- నేడు సమీక్షించనున్న మంత్రి హరీశ్‌రావు
కొవిడ్-లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 2020 నుంచి పాఠశాలలు నిరవధికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2020 నుంచి పాఠశాలలు తెరుచుకొని ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హాజరవుతున్నారు. సీ-శాట్, డీడీ చానెల్ ద్వారా ప్రసారం చేసే డిజిటల్ పాఠాలను పర్యవేక్షిస్తున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
సిద్దిపేట అర్బన్, జనవరి 20 : ఫిబ్రవరి 1 నుంచి నియమిత విద్యార్థులు మాత్రమే తరగతులకు హాజరు కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందు లో పాఠశాలలకు తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు మాత్రమే భౌతికంగా హాజరు కావాలి. అది కూడా తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతితోనే హాజరవ్వాల్సి ఉంటుంది. ఒక తరగతికి కేవలం 20 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతిస్తారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు పాఠశాలకు రానవసరం లేదు. ఇంటర్మీడియెట్, కళాశాల విద్య, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు కళాశాలలకు హాజరు కావాలని ప్రభుత్వం సూచించింది. సాంకేతిక విద్య, అన్నిరకాల సాంకేతిక విద్యాసంస్థలు, భారత ప్రభుత్వం/యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయనున్నాయి. ఉపాధ్యా య విద్య కళాశాలలు డీఎడ్, బీఈడీ కళాశాలలకు సంబంధించిన మార్గదర్శకాల ప్రకారం తెరుచుకోనున్నాయి.
జిల్లాలో తెరుచుకోనున్న 506 విద్యాసంస్థలు
సిద్దిపేట జిల్లాలో మొత్తం 506 విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. అందులో 387 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. 216 మండల, జిల్లా పరిషత్ పాఠశాలలు, 92 ప్రైవేటు పాఠశాలలు, 22 కేజీబీవీలు, 18 సొసైటీ పాఠశాలలు, 14 ఆదర్శ పాఠశాలలు, 10 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, 6 మైనార్టీ వెల్ఫేర్, 5 మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలు, రెండు ఆశ్రమ పాఠశాలలు, ఒక నవోదయ పాఠశాల ఉన్నాయి. మొత్తం 387 పాఠశాలల్లో 30, 262 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 39 ప్రైవేటు జూనియర్ కళాశాలలు.. మొత్తం 59 జూనియర్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. జిల్లాలో 8 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 25 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు 7, ప్రైవేటు పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు 3, ప్రైవేటు డీఈడీ, బీఈడీ, బీపీఈడీ కళాశాలలు 9, బీటెక్, బీ ఫార్మసీ కళాశాలలు 4, ఒక ప్రభుత్వ పీజీ కళాశాల , 3 ప్రైవేటు పీజీ కళాశాలలు ఉండగా.. మొత్తం 333 ప్రభుత్వ, 173 ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫిబ్రవరి ఒకటిన తరగతులు ప్రారంభం కానున్నాయి.
పర్యవేక్షకుల నియామకం
- పాఠశాలలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు మండల స్థాయిలో ప్రత్యేకాధికారి, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవోలు, మండల పరిషత్ ఎక్స్టెన్షన్ అధికారులను పర్యవేక్షణ అధికారులుగా వివిధ విద్యాసంస్థలకు నియమించారు.
- పర్యవేక్షణ అధికారులు తమకు కేటాయించబడిన విద్యాసంస్థలకు స్వయంగా వెళ్లి తనిఖీ చేసి నివేదికలను కలెక్టర్‌కు ఈనెల 23లోపు అందించాల్సి ఉంటుంది.
- పర్యవేక్షణ అధికారులు ప్రతి విద్యాసంస్థను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశించిన విధంగా పరిశుభ్రత, శానిటైజేషన్, సిట్టింగ్ అరెంజ్మెంట్, బాత్రూమ్ల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, రెసిడెన్షియల్ విద్యాలయాల హాస్టళ్లలో అందుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉం టుంది.
- మండల స్థాయిలో తహసీల్దార్, డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు కోఆర్డినేటర్లుగా పని చేస్తారు. ఈ నెల 25న డివిజనల్ సమన్వయ అధికారి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి తదనంతర చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో డివిజనల్ స్థాయి సమన్వయ అధికారులు, మండల స్థాయి సమన్వయ స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రధానోపాధ్యాయులు, తమ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉం టుంది.
- డివిజనల్ సమన్వయ అధికారి తమ పరిధిలోని పర్యవేక్షణా అధికారుల సమావేశం ఏర్పాటు చేసి సంస్థల వారీగా పరిశుభ్రత, భౌతిక వసతులు, శానిటైజేషన్ తదితర అంశాలను సమీక్షించాల్సి ఉంటుంది. డివిజనల్ స్థాయిలో ప్రభుత్వ విద్యాసంస్థల వారీగా గుర్తించిన అవసరాలను క్రోడీకరించి చర్యలు కోసం కలెక్టర్‌కు సమర్పించాలి. మండల పర్యవేక్షణ అధికారికు తన పరిధిలోని విద్యాసంస్థలను సందర్శించి నివేదికలను ఈ నెల 23 కల్లా డివిజనల్ సమన్వయ అధికారికి సమర్పించాలి. పాఠశాల సందర్శన సమయంలో ఆ పాఠశాల ఆవరణ పరిశుభ్రత, శౌచాలయాల పరిశుభ్రత, పిచ్చి మొక్కలు, పొదల నిర్మూలన, తరగతి గదులు, సిట్టింగ్ అరెంజ్మెంట్ గురించి పర్యవేక్షించాలి. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కూడా పై విషయాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.
- ప్రతి విద్యాసంస్థలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ), పేరెంట్స్ అండ్ టీచర్స్ అసోసియేషన్(పీటీఏ) సమావేశం నిర్వహించి, ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునః ప్రారంభిస్తున్నందున తగిన సూచనలు ఇచ్చి తల్లిదండ్రుల అంగీకార పత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది.
విద్యాశాఖ సూచనలు,మార్గదర్శకాలు
- తొమ్మిది, పది, పదకొండు, పన్నెండో తరగతికి సంబంధించిన విద్యాసంస్థలు ప్రతిరోజూ నడుపబడతాయి.
- అందరూ ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యాసంస్థలకు తప్పనిసరిగా హాజరుకావాలి.
- విద్యాసంస్థలు సాధారణ టైం టేబుల్ ప్రకారం నడుపబడతాయి. -ప్రధానోపాధ్యాయలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించేలా చూడాలి.
- విద్యార్థుల మధ్య భౌతిక దూరం, మాస్కు ధరించడం, దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారిని అనుమతించకూడదు.
- తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు విధిగా మధ్యాహ్న భోజనం అందించాలి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల్లను పాఠశాలల వారీగా ఏర్పాటు చేయాలి. రెసిడెన్షియల్ పాఠశాలలకు ఆవాస ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.
- ఈ ప్రణాళికలను ఈ నెల 20 వరకు సంబంధిత ప్రధానోపాధ్యాయుల, ప్రిన్సిపాళ్లు అందజేయాల్సి ఉంటుంది.
- పాఠశాలలకు విద్యార్థులు వివిధ స్థలాల నుంచి ప్రజారవాణా వ్యవస్థ, పాఠశాలలకు సంబంధించిన రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంలో వాహనాలను రోజుకు రెండుసార్లు శానిటైజ్ చేయాలి.
- విద్యార్థుల విధిగా మాస్కు ధరించేలా చూడాలి. పాఠశాలలోని తరగతి గదులు, ఫర్నిచర్ శుభ్రపరిచి శానిటైజ్ చేయించాలి. విద్యార్థులు పరిశుభ్రమైన తాగునీరు అందించేలా చూడాలి. ఈ పరిశుభ్రత చర్యలు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది.
- ఒకవేళ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టళ్లయితే, అందులో ఉండే విద్యార్థులకు నిర్దేశించిన గదులను శుభ్రపరిచి శానిటైజ్ చేయాలి. హాస్టల్ సిబ్బంది, విద్యార్థులకు కొవిడ్-19 మార్గదర్శకాలపై శిక్షణ ఇచ్చి పాటించేలా చర్యలు తీసుకోవాలి.
- వంట పాత్రలను శుభ్రపర్చాల్సి ఉంటుంది. మధ్యా హ్న భోజనం ఇచ్చే పాఠశాలల్లో తగిన విధం గా శుభ్రపరచేలా చర్యలు తీసుకోవాలి. బియ్యం, పప్పు దినుసులు లాంటి ఆహార పదార్థాలు నాణ్యత పరిశీలించాలి. వంట గదిలోకి సంబంధిత వంట మనుషులను మాత్రమే అనుమతించాలి.
కొవిడ్ నిబంధనలు పాటిస్తాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఒకటి నుంచి పాఠశాలలను తెరిచేందుకు సన్నద్ధ్దమవుతున్నాం. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, పాఠశాలల్లో అన్ని వసతులు కల్పి స్తాం. చాలా రోజుల నుంచి మూసి ఉన్నందున అన్నిచోట్ల శానిటైజేషన్, నీటి వసతి, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తాం. కొవిడ్ నిబంధనల మేరకే తరగతులు జరుగుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బం ది తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్య లు తీసుకుంటాం. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫామ్‌లు అందజేశాం.
-కే. రవికాంతరావు, సిద్దిపేట జిల్లా విద్యాధికారి
తాజావార్తలు
- పల్లె, పట్టణ ప్రగతిపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
- కాంగ్రెస్‌లో చేరిన నాథురాం గాడ్సే భక్తుడు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురుతో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?