ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 21, 2021 , 00:03:28

గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి సహకరించాలి

గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి సహకరించాలి

  • ఆర్డీవో జయచంద్రారెడ్డి

హుస్నాబాద్‌, జనవరి 20: గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు పూర్తయ్యేలా నిర్వాసితులు సహకరించాలని ఆర్డీవో జయచంద్రారెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి గౌరవెల్లి భూనిర్వాసితుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రిజర్వాయర్‌ నిర్మాణ పనులు ఇప్పటివరకు 85 శాతం పూర్తయ్యాయని, మిగతా 15 శాతం పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు. పనులు కొనసాగేలా ముంపు గ్రామాలైన గుడాటిపల్లి, తెనుగుపల్లి, గౌరవెల్లి తదితర గ్రామాల ప్రజలు సహకరించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం ఇస్తే నష్టం జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న రేట్లకు అనుగుణంగా పరిహారం అందేలా చూడాలని పలువురు నిర్వాసితులు అధికారులను కోరారు. నిర్వాసితుల  డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, రెండు రోజుల్లో సర్వే నిర్వహించి పెండింగ్‌లో ఉన్న భూసమస్యలను పరిష్కరిస్తామన్నారు. కోర్టుకు వెళ్లిన నిర్వాసితులు కూడా పునరాలోచించుకొని ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని రెవెన్యూ, ఇంజినీరింగ్‌ అధికారులు కోరారు . సమావేశంలో ఎస్సారెస్పీ ఈఈ రాములునాయక్‌, ఏసీపీ మహేందర్‌, సీఐ రఘుపతిరెడ్డి, డీటీ దమ్మని రాము, అక్కన్నపేట మండల రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 

 ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

 హుస్నాబాద్‌ నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 1నుంచి నిర్వహించబోయే పోటీ పరీక్షల ఉచిత శిక్షణా శిబిరాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో జయచంద్రారెడ్డి కోరారు.  హుస్నాబాద్‌ మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్‌టికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ కృషితో ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఈ నెల 23వరకు ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని, 28న హుస్నాబాద్‌ టీఎస్‌ మోడల్‌ స్కూల్‌లో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ వేణుగోపాల్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాము పాల్గొన్నారు. 

VIDEOS

logo