అన్నీ దొరికె..అంగడి మారె..

- కాలానుగుణంగా అంగళ్లలో అనేక మార్పులు
- పెద్ద అంగళ్లలో దొరకని వస్తువంటూ లేదు..
- కూరగాయల నుంచి ఎలక్ట్రానిక్స్ వస్తువుల వరకు అన్నీ లభ్యం
- సంచార వాహనాలతో జోరుగా వ్యాపారం
- దూర ప్రాంతాల నుంచి వచ్చి దందా
- ఎంతోమందికి ఉపాధి.. కొనుగోలుదారులకు సౌకర్యం
- డిజిటల్ చెల్లింపుల ఆధారంగా క్రయవిక్రయాలు
- ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన చేపలు, రొయ్యలు, జీవాల విక్రయాలు
- నాన్‌వెజ్ ప్రియులకు అందుబాటులో..
ప్రజా జీవన విధానంలో అంగడికి ప్రత్యేక స్థానమున్నది. ఒకప్పుడు స్థానికంగా పండిన కూరగాయలు, పప్పు దినుసులతో పాటు పశువులు, జీవాల విక్రయాలు మాత్రమే అంగళ్లలో జరిగేవి. కాలంతో పాటు ఇప్పుడు అంగడి మారింది. సరికొత్త మార్కెట్‌గా అవతరించింది. ఇప్పుడు అంగళ్లలో దొరకని వస్తువు అంటూ లేదు. మనం నిత్య జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువు లభిస్తున్నది. గ్రామీణులు సరుకుల కోసం పట్టణానికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. అన్నీ అంగళ్లలోనే సరసమైన ధరల్లో దొరుకుతున్నాయి. కరోనా-లాక్డౌన్ సమయంలో చాలా గ్రామాల్లో కొత్తగా అంగళ్లు ప్రారంభమయ్యాయి. దీంతో స్థానికులకు సౌకర్యంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపలు,రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహిస్తుండడంతో ఇప్పుడు ఏ అంగడిలో చూసినా అవి లభిస్తున్నాయి. గొల్ల కుర్మలకు ప్రభుత్వం సబ్సిడీపై జీవాలను పంపిణీ చేయడంతో వాటి సంతతి పెరిగింది. దీంతో గొర్రెలు, మేకలు, కోళ్ల విక్రయాలు పెరిగాయి. అంగడిలో టెక్నాలజీ వచ్చి చేరింది. క్రయవిక్రయాల చెల్లింపులు డిజిటల్ విధానంలో జరుగుతున్నాయి. మొత్తంగా అంగడి స్వరూపమే మారింది.
-దుబ్బాక, జనవరి 19
దుబ్బాక, జనవరి 19 :దుబ్బాకలో లచ్చపేట రోడ్డులో పెద్ద చెరువును ఆనుకుని నిర్వహించే కూరగాయల సంతకు మంచి ఆదరణ లభించింది. శనివారం ఉదయం నుంచే కూరగాయల సంత కొనసాగుతుంది. దుబ్బాక పట్టణానికి వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతరులు సాయంత్రం వేళలో కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. ఈ సంతలో తాజా ఆకు కూరలు, కూరగాయలతో పాటు వంట సామగ్రి వస్తువులు తక్కువ ధరకే లభిస్తాయి. చేపలు, నాటు కోళ్లు, బట్ట లు, పిల్లలకు ఆట వస్తువులు, మహిళ లకు గాజులు, సౌందర్య వస్తువులు, పండ్లు, పూలు, తినుబండరాలు అన్ని ఉంటాయి. జిల్లా నుంచి కాకుండా పక్క జిల్లాల నుం చి రైతులు పండించిన కూరగాయలను ఇక్కడికి తెచ్చి విక్రయిస్తారు. సంతలో కూర గాయలు తక్కువ ధరకు లభించటంతో దుబ్బాక పట్టణ ప్రజలే కాకుండా చుట్టూ పక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో వస్తారు.
పశువుల సంతకు భలే గిరాకీ..
శనివారం దుబ్బాక సంతతో పాటు బస్‌డిపో పక్కన రామసముద్రం చెరువు వద్ద పశువుల సంత కొనసాగుతుంది. దీనికి జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో అమ్మకందారులు, కొనుగోలుదారులు వస్తారు. మరుసటి రోజు ఆదివారం(సెలవుదినం) కావడం అత్యధికంగా ఫంక్షన్లు ఉండటంతో మేకలు, గొర్లు కొనేందుకు ఇక్కడికే వస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పశువుల సంత కొనసాగుతుంది.
చేపలకు భలే డిమాండ్..
టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులకు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు మంచి ఫలితాలిస్తున్నాయి. చెరువు, కుంటల్లో ఉచితంగా చేప పిల్లల పంపిణీ, మత్స్యకారులకు వాహనాలు అందించడంతో సంతలోకి చేపలు తెచ్చి, అమ్ముతున్నారు. దుబ్బాక సంతలో దుబ్బాకతో పాటు పక్క మండలాల మత్స్యకారులే కాకుండా రాజన్నసిరిసిల్ల జిల్లా మిడ్మానేరులోని చేపలను ఈ సంతలో విక్రయిస్తున్నారు. శనివారం సంతలో కోర మీన (కొర మట్ట), బొచ్చ, రవు, బంగారు తీగ తదితర చేపలకు ఇక్కడ భలే డిమాండ్ ఉంటుంది.
అర్ధశతాబ్దపు అంగడి..
కోహెడ, జనవరి 19 : కోహెడ మండల కేంద్రంలో ప్రతి ఆదివారం కొత్త బస్టాండ్‌లో వార సంత జరుగుతుంది. సుమారు 50ఏండ్ల క్రితం కోహెడ దేశ్‌ముఖ్ రాంధర్మారెడ్డి తన సొంత స్థలం కురుంబలో వార సంతను ప్రారంభించగా, అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. చిగురుమామిడి మండలం, సుందరగిరి, హుస్నాబాద్ మండలం రామవరం తదితర ప్రాంతాల నుంచి రైతులు వారసంతలో తమ పంటను తెచ్చి, అమ్ముకుంటున్నారు. కూరగాయలు, ఆకు కూరలు, అల్లం వెల్లిపాయలు ఇలా అన్ని రకాల కూరగాయలు ప్రతివారం తాజాగా వారసంత లో దొరుకుతాయి. అలాగే ప్లాస్టిక్ సామానులు, ఎడ్లకు సంబంధించిన పగ్గాలు, చెప్పులు, గొంగళ్లు, ఎండు మిరపకాయలు, కొడవల్లు, చీపుర్లు, దుస్తులు, చిన్నపిల్లల, పెద్దలకు వచ్చే రెడిమేడ్ దుస్తులు, అన్ని రకాలపండ్లు, బేకరీ ఐటమ్స్, పప్పులు, వంటనూనెలు, వ్యవసా యానికి సంబంధించిన పనిముట్లు ఇలా అనేక రకాల వస్తువులు వారసంతలో లభిస్తాయి. మండల కేంద్రంతో పాటు చాలా గ్రామాలకు చెందిన ప్రజలు ఆదివారం వారసంతకు మం డల కేంద్రంలో ఇతర దుకాణాల వారు వారానికి అవసరమైన వస్తువులు ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. ఆటోవాలాలకు మంచి గిరాకీ ఉంటుంది.
ప్రతి శుక్రవారం పశువుల సంత..
కోహెడలో ప్రతి శుక్రవారం పశువుల సంత జరుగుతుంది. గొర్రెలు, మేకల వ్యాపారం జోరుగా ఉంటుంది. వారసంత మండల ప్రజలకు సంవత్సరాలుగా సేవలందిస్తున్నది. కరోనా సమయంలో కొన్ని వారాలు వారసంత జరుగకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
మాకెంతో మేలు చేస్తోంది..
సుందరగిరి గ్రామానికి చెందిన మేము 30మందిమి కూరగాయలు, ఆకుకూరలు పండిస్తం. కోహెడ వారసంతలో ఆదివారం అమ్ముకుంటాం. ఇక్కడ అమ్మితేనే కూరగాయలకు గిట్టుబాటు వస్తున్నది. మాకు ఈ సంత అనువైన స్థలంగా మారింది. ప్రతి వారం వచ్చి కూరగాయలు అమ్ముకొని వెళ్తం. ఈ సంవత్సరం వర్షాలు అనుకూలంగా పడి పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది.
- కనుకట్ల వెంకన్న, రైతు, సుందరగిరి
దుబ్బాక మార్కెట్ బాగుంది...
దుబ్బాక పశువుల మార్కెట్ చాలా బాగుంది. ఈ ప్రాంతంలో మేకలు ఎక్కువగా కొంటారు. మేము నిజామాబాద్, మహారాష్ట్ర నుంచి కొని, ఈ సంతలో అమ్ముతాం. ఐదేండ్ల నుంచి ఇక్కడికి వస్తున్నాం. ప్రతి వారం సుమారు వందకు పైగా మేకలు అమ్ముడుపోతాయి.
- ముబారస్, మేకల వ్యాపారి, నిజామాబాద్
తాజావార్తలు
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా
- నా మీటింగ్‌కు అనుమతి ఇవ్వడం లేదు..
- స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్
- బెస్ట్ ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్