శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 19, 2021 , 00:03:17

పట్నం పసుపువర్ణ శోభితం

పట్నం పసుపువర్ణ శోభితం

కొమురవెల్లి మల్లన్న ఆలయం భక్త జనసంద్రం

భక్తిశ్రద్ధలతో పెద్ద పట్నం

సంప్రదాయబద్ధంగా సాగిన అగ్నిగుండాలు

శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు

మార్మోగిన మల్లన్న నామస్మరణ

పులకించిన భక్తజనం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్నం వారాన్ని పురస్కరించుకొని కొమురవెల్లి మల్లన్న ఆలయం సోమవారం పసుపుమయంగా మారింది. వేలాదిగా భక్తులు తరలిరాగా.. శివసత్తులు పూనకాలతో.. పోతరాజులు విన్యాసాలతో సందడి చేశారు. పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కడు వైభవంగా జరిగింది. ‘మల్లన్న సామి.. మమ్మేలు.. కోరమీసాల సామి.. మమ్ము దీవించు.. మా కోరికలు తీర్చు.. మా మొక్కులు స్వీకరించు’.. అంటూ భక్తులు వేడుకున్నారు. సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు కొనసాగగా.. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. అగ్నిగుండాలను దాటేందుకు భక్తులు పోటీపడ్డారు. మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మను దర్శించుకున్న భక్తులు, అక్కడి నుంచి తీగుల్‌ నర్సాపూర్‌ కొండపోచమ్మ ఆలయానికి వెళ్లారు. 

- చేర్యాల, జనవరి 18 

చేర్యాల, జనవరి 18 : పట్నం వారాన్ని పురస్కరించుకొని కొమురవెల్లి మల్లన్న ఆలయం సోమవా రం పసుపుమయంగా మారింది. వేలాది భక్తులతో సందడిగా మారింది. హైదరాబాద్‌ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆలయవర్గాల సహకారంతో సోమవా రం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. భక్తులు అగ్నిగుండాలను దాటే కార్యక్రమం ఉత్కంఠంగా కొనసాగగా, భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పట్నం వారానికి వచ్చిన భక్తులు శనివారం ధూళిదర్శనం, ఆదివా రం బోనాలు, పట్నాలు, సోమవారం పెద్దపట్నం, అ గ్నిగుండాల కార్యక్రమం ఆనవాయితీ ప్రకారం నిర్వహించారు. ఒగ్గు పూజారులు పంచవర్ణాలు(తెలుపు, పసుపు, నీలి, ఎరుపు, ఆకుపచ్చ) రంగులతో కూడిన పిండితో పెద్దపట్నం వేశారు. అనంతరం పంచ పల్లవాలు(మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి) కట్టెలను వరుసుగా పేర్చి అగ్నిగుండంగా తయారు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, అర్చకుడు చిన్న మల్లికార్జున్‌ తదితరులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి రాజగోపురం నుంచి నేరుగా పెద్దపట్నం,అగ్నిగుండం వరకు తీసు కొచ్చి, పూజలు చేశారు. అనంతరం పెద్దపట్నం, అగ్నిగుండాలను దాటారు. ఆ తర్వాత భక్తులకు అవకా శం కల్పించారు. అక్కడి నుంచి భక్తులు మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మను దర్శించుకున్నారు. శివసత్తులు, ఘనాచార్యులకు ఆలయ ఈ వో బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మల్లయ్య, డైరెక్టర్లు వజ్రోజు శంకరాచారి, ఉట్కూరి అమర్‌, తాళ్లపల్లి శ్రీనివాస్‌, ఆలయ సిబ్బంది కండు వా, జాకెట్‌ ముక్కలతో పాటు స్వామి వారి బండారిని పంపిణీ చేశారు.అంతకు ముందు భక్తులు ఒంటికి పసుపును  పూసుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం కొనసాగింది. హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌, సీఐ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో        300 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగా శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు. 

రూ.45.92 లక్షల ఆదాయం 

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి పట్నం వారం సందర్భంగా రూ.45,92,948 ఆదాయం వచ్చినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. శనివారం రూ.11,46,462, ఆదివారం రూ.28,46,486, సోమవారం రూ.6లక్షలు ఆర్జిత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం ద్వారా మొత్తం రూ.45,92,948 స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు తెలిపారు. గతేడాది మొదటి ఆదివారం రూ.42,31,267 వచ్చింది. మరో 12 ఆదివారాలతో పాటు పెద్దపట్నం,అగ్నిగుండం కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో రానుండడంతో మరింతగా ఆదాయం సమకూరనుంది.


VIDEOS

logo