గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 18, 2021 , 00:14:20

మల్లన్న దర్శనం భక్తుల పరవశం

మల్లన్న దర్శనం భక్తుల పరవశం

వైభవంగా మల్లన్న పట్నం వారం

కిటకిటలాడిన కొమురవెల్లి ఆలయం

70వేల మంది భక్తుల దర్శనం

స్వామి దర్శనానికి 4గంటల సమయం

నేడు పెద్దపట్నం, అగ్నిగుండం

వైభవంగా మల్లన్న పట్నంవారం

పట్నం వారం పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయానికి ఆదివారం 

సుమారు 70వేల మంది వరకు భక్తులు తరలివచ్చారు. కొమురవెల్లి మల్లన్న ఉత్సవాలు పట్నం వారంతో వైభవంగా ప్రారంభం 

కాగా, భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. మల్లన్న బ్రహ్మోత్సవాల్లో మొదటి వారం పట్నం వారంగా పిలుస్తారు. 

పట్నం(హైదరాబాద్‌)కు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని, పెద్దపట్నం వేసి అగ్నిగుండం 

దాటుతారు.  దీంతో మొదటి వారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. కొమురవెల్లి మల్లన్న మమ్మేలు స్వామి అంటూ భక్తులు 

చేసిన నామస్మరణలతో ఆదివారం మల్లన్న ఆలయం మార్మోగింది. కొమురవెల్లికి వచ్చే అన్ని రహదారులు వాహనాలతో  కిక్కిరిసిపోయాయి. 

విస్తృత బందోబస్తు..

మల్లన్న ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు నరేందర్‌రెడ్డి, రాకేశ్‌, జాన్‌రెడ్డి తదితరులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్షేత్రంలో పోలీస్‌ ఔట్‌పోస్టును ఏర్పాటు చేసి, పోలీస్‌ అధికారులు అక్కడే ఉండి సేవలందించారు. ఏసీపీ ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లో భక్తుల పరిస్థితులను గమనించడంతో పాటు పోలీస్‌ వాహనంలో ఆలయ పరిసరాల్లో తిరుగుతూ విధులు నిర్వహించారు. 

దారులన్నీ కొమురవెల్లి ఆలయం వైపే.. 

పట్నం వారం సందర్భంగా ప్రధాన రహదారులన్నీ కొమురవెల్లి వైపునకే కొనసాగాయి. చేర్యాల, సిద్దిపేట, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, జనగామ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. స్వామి వారి ఆలయానికి చేరుకునే హైదరాబాద్‌, సిద్దిపేట, చేర్యాల కొమురవెల్లి రహదారుల్లో రెండు కిలోమీటర్ల మేర భక్తులు నిండిపోయారు. భారీగా భక్తులు తరలిరావడంతో మల్లన్న ఆలయ ఆవరణలో ఇసుక వేస్తే రాలని పరిస్థితి కనిపించింది. శనివారం సాయంత్రం నుంచే స్వామి వారి దర్శనం, మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలోతరలివచ్చారు.

మల్లన్న భక్తులకు అన్ని వసతులు..

స్వామి వారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడికి వసతి కల్పించేందుకు తాము కృషి చేస్తున్నట్లు మల్లన్న ఆలయ ఈవో ఎ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ దువ్వల మల్లయ్య తెలిపారు. పట్నం వారం సందర్భంగా 70వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారన్నారు.ఆలయానికి వచ్చే భక్తుల రక్షణ కోసం ఆలయ పరిసరాల్లో 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. 60మంది పారిశుధ్య సిబ్బంది, వంద మంది వలంటీర్లు  ఎప్పటికప్పుడు సేవలందిస్తున్నారని చెప్పారు. వీరితో పాటు డైరెక్టర్లు వజ్రోజు శంకరాచారి, ఊట్కూరి అమర్‌, తాళ్లపల్లి       శ్రీనివాస్‌,  ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగా శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, కమిటీ సభ్యులు, ఆలయ ప్రధానార్చాకుడు మహాదేవుని మల్లికార్జున్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మొక్కులు చెల్లించిన భక్తులు... 

మల్లికార్జున స్వామి వారిని భక్తులు దర్శించుకొని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి పట్నాలు, మల్లన్న గుట్టపైన ఉన్న ఎల్లమ్మకు బోనాలు చెల్లించుకున్నారు. మట్టి పాత్రల్లో అన్నం వండి బోనంగా తయారు చేసి వాటిని పట్నంపై నిలిపారు. మరికొందరు కొండ పైకి తీసుకువెల్లి ఎల్లమ్మకు సమర్పించి కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. 

మల్లన్న దర్శనానికి 4గంటలు..

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆదివారం వేకువజాము నుంచే క్యూలైన్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. ధర్మ దర్శనానికి 4గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, శీఘ్రదర్శనానికి  2 గంటల సమయం పట్టింది. ఉదయం 5గంటలకు ప్రారంభమైన దర్శనాలు రాత్రి వరకు కొనసాగాయి.

నేడు పెద్దపట్నం, అగ్నిగుండం..

మల్లన్న స్వామి కల్యాణ వేదిక ప్రాంతంలో మల్లన్న ఆలయవర్గాల సహకారంతో హైదరాబాద్‌ భక్తుల ఆధ్వర్యంలో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండం కార్యక్రమం జరుగనున్నది. భక్తులు అగ్నిగుండం అనంతరం కొండపోచమ్మ ఆలయానికి తరలిపోతారు. పెద్దపట్నం, అగ్నిగుండం  కార్యక్రమాల నిర్వహణకు ఆలయవర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 

పవిత్ర స్నానం అనంతరం దర్శనం.. 

శనివారం సాయంత్రం నుంచే భక్తులు కొమురవెల్లి ఆలయానికి చేరుకున్నారు.ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు,ద్విచక్ర వాహనాలపై వచ్చిన భక్తులు వచ్చారు. గదులను అద్దెకు తీసుకుని రాత్రి విశ్రమించి, ఆదివారం వేకువజామునే నిద్రలేచి కోనేటిలో పవిత్ర స్నానాలు చేశారు. అక్కడి నుంచి నేరుగా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లకు వెళ్లి, గంటల పాటు వేచి ఉండి దర్శించుకున్నారు. స్వామి వారికి ముఖ మండపం, గంగరేగు చెట్టు ప్రాంగణంతో పాటు అద్దెకు తీసుకున్న గదుల వద్ద చిలుకపట్నం,గంగరేగు చెట్టు వద్ద నజరు పట్నం, మహా మండపంలో ముఖ మండప పట్నాలు వేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు స్వామి వారికి కల్యాణం నిర్వహించి అమ్మవార్లకు ఒడిబియ్యం పోశారు. అభిషేకం, అర్చన తదితర పూజలు నిర్వహించారు. 

VIDEOS

logo