సోమవారం 01 మార్చి 2021
Siddipet - Jan 17, 2021 , 00:11:58

మల్లన్నా.. వస్తున్నం..

మల్లన్నా.. వస్తున్నం..

ఉత్సవాలకు కొమురవెల్లి క్షేత్రం సిద్ధం

నేడు పట్నం వారం

రేపు అగ్నిగుండాలు.. పెద్దపట్నం

ఇప్పటికే ఆలయానికి చేరుకున్న భక్తజనం

చేర్యాల, జనవరి 15 :

 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఉత్సవాలకు సిద్ధ్దమైంది. భక్తుల పాలిట కొంగు బంగారంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం విరాజిల్లుతున్నది. జనవరి 10న నిర్వహించిన కల్యాణోత్సవాన్ని ఆలయవర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి పర్వదినం పూర్తి అయిన తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో  స్వామి వారి ఉత్సవాలు ప్రారంభమ వుతాయి.బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి కల్యాణం, పట్నం వారం, లష్కర్‌వారం, మహా శివరాత్రి పర్వదినం రోజున నిర్వహించే పెద్ద పట్నం, అగ్నిగుండాలు కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఉత్సవాల సందర్భంగా ఆలయవర్గాలు స్వామి వారి ఆలయం, రాజగోపురం, గదులకు రంగులను వేయించడంతో  మల్లన్న క్షేత్రం సుందరంగా మారింది. నేడు (ఆదివారం) నిర్వహించే పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభం కానుండడంతో బ్రహ్మోత్సవాల సమయంలో 13వ ఆదివారాలతో పాటు, ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రానున్నారు. భక్తులకు ఇబ్బందులు పడకుండా స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయవర్గాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా క్యూలైన్లలో నీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేశారు. అలాగే విశిష్ట దర్శనం, శీఘ్రదర్శనం, ధర్మ దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాటు చేయడంతో పాటు ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్న ఆనంతరం బయటకు వెళ్లే దారికి అన్ని ఏర్పాట్లు చేశారు. 

రేపు పెద్ద పట్నం, అగ్నిగుండాలు..

సోమవారం స్వామి వారి కల్యాణ వేదిక వద్ద పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ఆలయవర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ సంప్రదాయం మేరకు పట్నం వారం తెల్లవారి(సోమవారం) మల్లన్న ఆలయవర్గాల సహకారంతో హైదరాబాద్‌ ఒగ్గు పూజారులు పట్నం వేయడంతో పాటు అగ్నిగుండం తయారు చేసి దానిని దాటుతారు. స్వామి వారి కల్యాణం నిర్వహించిన శాశ్వత కల్యాణ వేదిక ముందు భాగంలో ప్రత్యేకంగా అగ్నిగుండం, పెద్దపట్నం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్నం వారానికి తరలివచ్చిన భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండం కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న ఆనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాల వద్దకు వెళ్లి అక్కడ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

ఉత్సవాలకు భక్తులు హాజరు కావాలి

స్వామి వారి ఉత్సవాలు ప్రారంభమవుతున్న క్రమంలో అన్ని ప్రాంతాలకు చెందిన భక్తులు కొమురవెల్లికి అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలయ ఈవో బాలాజీ  కోరారు. శుక్రవారం వారు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగా శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పుజారులు పాల్గొన్నారు.

పట్నం వారానికి తరలివచ్చిన భక్తజనం

చేర్యాల, జనవరి 16 :

 కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటి ఆదివారం(పట్నంవారం) సందర్భంగా భక్తులు శనివారం మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రైవేటు వాహనాల్లో మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి, ప్రైవేటు గదులను అద్దెకు తీసుకున్నారు. మరికొందరు భక్తులు వారు తీసుకువచ్చిన వాహానాలనే గదులుగా ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు భక్తులు క్షేత్రంలోని ఖాళీ ప్రదేశాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకొని వారి సామగ్రిని భద్రపర్చుకున్నారు. ఆదివారం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మొక్కులు చెల్లించుకొని, సోమవారం నిర్వహించే పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొని కొండపోచమ్మకు వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. భక్తులు వాహనాలను పార్కింగ్‌లో పెట్టేలా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పట్నం వారానికి హైదరబాద్‌ భక్తులు..

పట్నం వారం సందర్భంగా ఆదివారం అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు చెందిన భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు.దీనికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు మల్లన్న పేరిట సట్టీ దీక్షలను 41 రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించి,  అనంతరం దీక్షలను విరమించనున్నారు. స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు స్వామి వారితో పాటు పట్నం వేసి గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించనున్నారు. పట్నం వారానికి 60వేలకు పైగా భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఏసీపీ మహేందర్‌ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

VIDEOS

logo