శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 17, 2021 , 00:11:58

వ్యాక్సిన్‌ సక్సెస్‌

వ్యాక్సిన్‌ సక్సెస్‌

తొలి రోజు 66 మందికి వ్యాక్సినేషన్‌

సిద్దిపేటలో ప్రారంభించిన జడ్పీ అధ్యక్షురాలు

నంగునూరులో ప్రజాప్రతినిధులు

గజ్వేల్‌లో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

కరోనా మహమ్మారి అంతానికి ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. సిద్దిపేట జిల్లా దవాఖాన, నంగునూరు సీహెచ్‌సీ, గజ్వేల్‌ జిల్లా దవాఖానల్లో వైద్య ఆరోగ్య శాఖ సెంటర్లు ఏర్పాటు చేసింది. మొత్తం 90మందికి గానూ తొలి రోజు 66 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. సిద్దిపేటలో 11, నంగునూరులో 29, గజ్వేల్‌లో 26 మందికి టీకా వేశారు. సిద్దిపేటలో జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి తదితరులు, గజ్వేల్‌లో ఎఫ్‌డీసీ చైర్మన్‌, జడ్పీ అధ్యక్షురాలు, నంగునూరులో ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. తొలి టీకా వేసుకున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను పలువురు అభినందించారు.

సిద్దిపేట కలెక్టరేట్‌/గజ్వేల్‌/నంగునూరు, జనవరి 16

మొదటి టీకా నేనే వేయించుకున్న ..

కరోనా వైరస్‌ అంతానికి టీకా రావడం గొప్ప విషయం. నిత్యం దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ రోగులు ఆరోగ్యంగా ఉండేందుకు మేం కృషి చేస్తున్నాం. ప్రభుత్వం మాకు మొదటగా గుర్తింపునిచ్చింది. మండలంలోనే మొదటి టీకాను నేను వేయించుకున్నందుకు సంతోషంగా ఉంది. 

- సంపత్‌, నంగునూరు దవాఖాన పారిశుధ్య సిబ్బంది  

క రోనా నిరోధానికి ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో తొలిరోజు మూడు సెంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 90మందికి టీకా వేయాల్సి ఉండగా, 66 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. సిద్దిపేటలో 11, నంగునూరులో 29, గజ్వేల్‌లో 26 మందికి టీకా వేశారు. శనివారం సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, స్టేట్‌ అబ్జర్వర్‌ జేడీ అమర్‌సింగ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ముజమ్మీల్‌ఖాన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, డీఎంహెచ్‌వో మనోహర్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. సిద్దిపేట జనరల్‌ దవాఖానలో కొవిషీల్డ్‌ తొలి టీకా కొవిడ్‌ వార్డులో జనరల్‌ ఫిజీషియన్‌గా పని చేస్తున్న డాక్టర్‌ సారస్మితకు వేశారు. టీకా వేసిన వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అబ్జర్వేషన్‌ వార్డులో ఉంచి పరీక్షించారు. టీకా వేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని వైద్యులు నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనిటీ అధికారి విజయరాణి, మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ తమిళ ఆరసు, సూపరింటెండెంట్‌ చంద్రయ్య, డాక్టర్‌ కాశీనాథ్‌తోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- సిద్దిపేట కలెక్టరేట్‌, జనవరి 16 

టీకా వేయించుకున్న వారు..

తొలిరోజు 66 మందికి టీకాను వేశారు. వేసుకున్న వారిలో 13మంది డాక్టర్లు, ఏడుగురు నర్సులు, 16మంది పారిశుధ్య కార్మికులు, ఏడుగురు ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఇద్దరు, ఆశవర్కర్‌ ఒకరు, 20మంది పారామెడికల్‌ సిబ్బందికి టీకా వేశారు. అస్తమా ఉండడంతో గజ్వేల్‌లో ఇద్దరు, నంగునూరులో ఒకరికి టీకా వేయలేదు. 

నంగునూరులో 29 మందికి..

నంగునూరు, జనవరి 16 : నంగునూరు సీహెచ్‌సీ సెంటర్‌లో 29 మందికి శనివారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్‌ రాధికతో పాటు 12మంది వైద్య సిబ్బందికి, 15మంది దవాఖాన పారిశుధ్య సిబ్బందికి, ఇద్దరు అంగన్‌వాడీ టీచర్లు, ఆశవర్కర్‌కు వ్యాక్సినేషన్‌ చేశారు. ఒక అంగన్‌వాడీ టీచర్‌కు అస్తమా కారణంగా వ్యాక్సిన్‌ వేయలేదు. వ్యాక్సినేషన్‌ సందర్భంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో వైద్యులు రాధిక, రాజేశ్‌, మురళి పర్యవేక్షించారు. కేంద్రాన్ని ఎంపీపీ జాప అరుణాదేవి, జడ్పీటీసీ తడిసిన ఉమా వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మమత, ఎంపీటీసీ సునీత, తహసీల్దార్‌ భూపతి, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. 

వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం.. 

వ్యాధినిరోధశక్తి పెంచేందుకు టీకా ఎంతో దోహదపడుతుందని జిల్లా వైద్యాధికారి మనోహర్‌ తెలిపారు. సీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. సిద్దిపేట జిల్లా దవాఖాన, గజ్వేల్‌ దవాఖాన, నంగునూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వ్యాక్సినేషన్‌ వేయించుకునేందుకు వైద్య సిబ్బంది, అంగన్‌ వాడీటీచర్లు, ఆశ వర్కర్లు, పారిశుధ్య సిబ్బంది ముందుకొచ్చి, టీకా వేయించుకున్నారన్నారు.

మనమే ఆదర్శం..

గజ్వేల్‌, జనవరి 16 : కొవిడ్‌-19 టీకా తయారీ, పంపిణీలో మనమే ముందు నిలిచామని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ రోజాశర్మ అన్నారు. శనివారం గజ్వేల్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానలో వ్యాక్సినేషన్‌ను ఎఫ్‌డీసీ చైర్మన్‌, జడ్పీ అధ్యక్షురాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనాను అంతమొందించడానికి మనదేశం వ్యాక్సిన్‌ను తయారు చేసి పెద్ద మొత్తంలో పంపిణీ చేస్తుంది. వైద్యపరంగా మిగతా రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌, నంగునూరు ప్రభుత్వ దవాఖానల్లో వ్యాక్సిన్‌ పంపిణీ చేశామన్నారు. అంతకు ముందు  కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వార్డు ప్రత్యేక గదిని ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి ప్రారంభించారు. గజ్వేల్‌ ప్రభుత్వ దానఖానలోని పలు వార్డులను జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణ శర్మ పరిశీలించారు. కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, ప్రోగ్రాం ఇన్‌చార్జి గోపాల్‌రావు, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఎఎంసీ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్సీ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ పంగ మల్లేశం, సుపరింటెండెంట్‌ మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ధైర్యంగా ఉంది.. 

కరోనాతో చాలా భయపడ్డాం. అయినప్పటికీ విధులు సక్రమంగా నిర్వర్తించాం. జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగాం. నేడు కరోనా టీకా వేయడంతో ధైర్యంగా ఉంది. ముందుగా మాకు టీకాలు ఇవ్వడం సంతోషంగా ఉంది.  - ఎడ్ల ఉమ, నంగునూరు సీహెచ్‌సీ పారిశుధ్య కార్మికురాలు 

చాలా సంతోషం ఉన్నది...

కరోనాతో అందరూ పోరాడుతూ విధులను నిర్వర్తించాం. ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజలకు ఇంటింటికీ తిరుగుతూ కరోనా పై అవగాహన కల్పించాం. టీకా అందుబాటులోకి రాగానే ప్రభుత్వం 

ఆశవర్కర్లను గుర్తించి టీకాలు వేసింది. చాలా సంతోషంగా ఉన్నది. 

- అరుణ, ఆశవర్కర్‌, నంగునూరు  

ఆత్మవిశ్వాసం పెరిగింది..

కొవిడ్‌తో సంవత్సర కాలంగా పోరాడుతున్న వారికి ఈ టీకాతో గొప్ప ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ముందుగా టీకాను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వేయడంతో వారిలో కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. మా కుటుంబ సభ్యులు ఇంతకు ముందు భయపడే వాళ్లు. వ్యాక్సిన్‌తో నేడు భయం పోయింది. కరోనా టీకా వేయించుకోవడం గొప్పగా ఉంది. - డాక్టర్‌ క్రాంతికుమార్‌, సిద్దిపేట  

ధైర్యం పెరిగింది.. 

ప్రభుత్వం కరోనా వాక్సిన్‌ ఇవ్వడంతో మనోధైర్యం పెరిగింది. దవాఖానలో సేవలను మరింత చురుకుగా రోగులకు అందిస్తాను. గజ్వేల్‌ ప్రభుత్వ జిల్లా దవాఖానలో శానిటేషన్‌ వర్కర్‌గా పనిచేస్తున్న నాకు కరోనా టీకా ఇచ్చారు. ముందుగా కొంత భయం అనిపించింది. కానీ టీకా తీసుకున్న తర్వాత ఆర గంట అక్కడే కూర్చున్నాను. దీంతో వైద్యులు నా ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీకా తీసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. - దానవోయిన కీర్తన, గజ్వేల్‌ ప్రభుత్వ జిల్లా దవాఖాన శానిటేషన్‌ వర్కర్‌ 

వ్యాక్సిన్‌ వేసుకొని కాన్ఫిడెంట్‌గా ఉన్న..

సిద్దిపేటలో తొలి టీకా వేసుకున్నందుకు సంతోషంగా ఉన్న.. ఎలాంటి ఆందోళన లేదు. చాలా ఆత్మవిశ్వసంతో టీకా వేసుకున్న. ఇది నా జీవితంలో గొప్ప సంఘటన. 10 నెలల నుంచి ఇక్కడే కొవిడ్‌ వార్డులో సేవలందిస్తున్న. వార్డులోనే కరోనా నిరోధక టీకా వేసుకున్నందుకు గర్వంగా ఉంది. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.  - డాక్టర్‌ సారస్మిత, సిద్దిపేట 


VIDEOS

logo