గురువారం 04 మార్చి 2021
Siddipet - Jan 16, 2021 , 03:03:24

సిద్దిపేట కీర్తి పతంగిలా ఎగరాలి

సిద్దిపేట కీర్తి పతంగిలా ఎగరాలి

  • స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అందరూ భాగస్వాములు కావాలి 
  • కైట్‌ ఫెస్టివల్‌లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట కమాన్‌, జనవరి 15 : పతంగుల తరహాలో సిద్దిపేట కీర్తి దేశమంతా చాటి చెప్పేలా పట్టణ ప్రజలంతా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొనాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. దీనికి మంత్రి హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. అందరికీ స్వచ్ఛ నమస్కారం తెలుపుతూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కైట్‌ ఫెస్టివల్‌ మహానగరాల్లో జరుగుతాయని, కానీ, మన సిద్దిపేటలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పతంగులు గొప్ప సందేశాన్ని ఇస్తాయని, ఆకాశం అంచుల్లో పతంగి రెపరెపలాడుతూ కనిపిస్తుందని, కానీ అది ఎగురడానికి ఎవరికీ కనబడకుండా దారం ఉంటుందని, అదే తరహాలో సిద్దిపేట ప్రజలు దారంలా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొని దేశ వ్యాప్తంగా తమ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సిద్దిపేట కీర్తి పతంగిలా దశ దిశలా చాటడంలో ఇక్కడి ప్రజల భాగస్వామ్యం ఓ దారంలా పని చేస్తున్నపట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  సిద్దిపేట పట్టణ ప్రజలు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛత యాప్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు ఇవ్వాలని, పట్టణానికి చెందిన ప్రతి పౌరుడు దేశ వ్యాప్తంగా భారత ప్రభుత్వం మున్సిపాలిటీ పట్టణాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఓటింగ్‌లో పాల్గొని సిద్దిపేట పేరును ఇనుమడింపజేయాలని కోరారు. ఈ కైట్‌ ఫెస్టివల్‌ రెండున్నర గంటల పాటు జరుగగా, మంత్రి పతంగులు ఎగురేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కమిషనర్‌ రమణాచారి, కౌన్సిలర్లు, కైట్స్‌ క్లబ్‌, వడోదర కైట్‌ క్లబ్‌, దూద్‌ భల్లాపూర్‌, బెంగళూరు, జీమ్‌ కైట్‌ క్లబ్‌, ఇండియా కైట్‌ క్లబ్‌, కోహినూర్‌ కైట్‌ క్లబ్‌ ప్రతినిధులకు మంత్రి మెమోంటోలను అందజేశారు.

VIDEOS

logo