వ్యాక్సినేషన్.. తొలి రోజు 90మందికి

- కరోనా టీకా పంపిణీకి సర్వం సిద్ధం
- నేటి నుంచి మూడు చోట్ల కరోనా టీకా పంపిణీకి సర్వం సిద్ధం
- నేటి నుంచి మూడు చోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం
- సిద్దిపేట, గజ్వేల్, నంగునూరులో పూర్తయిన ఏర్పాట్లు
- జిల్లాకు చేరుకున్న 1,790 డోసులు
- తొలి టీకా వేసుకున్న తర్వాత 23 రోజుల తర్వాత మరో డోసు
- రెండో డోసు టీకా సమయానికి సదరు వ్యక్తి సెల్‌కు సమాచారం
- నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట ప్రతినిధి, జనవరి15 (నమస్తే తెలంగాణ): కొవిడ్ టీకా పంపిణీకి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేడు (శనివారం) కరోనా టీకాను జిల్లాలో మూడు చోట్ల వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గనిర్దేశానుసారం మొదటి విడుతలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వేసేలా కార్యాచరణ చేశారు. ఈ టీకాను తొలుత ఒక్కో కేంద్రంలో 30మందికి వేస్తారు. తొలి రోజు 90మందికి టీకా వేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. సిద్దిపేట జనరల్ దవాఖాన, గజ్వేల్ జిల్లా దవాఖాన, నంగునూరు కమ్యునిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో తొలిరోజు టీకా వేస్తారు. జిల్లాకు ఇప్పటికే 1,790 డోసుల టీకా చేరుకున్నది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
జిల్లాలో కరోనా టీకా పంపిణీకి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నది. టీకా కేంద్రాల్లో అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునేజేషన్(ఏఈఎఫ్ఐ) కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు. టీకా వేసిన తర్వాత ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని ఎదుర్కొనేందుకు వీటిని ఉపయోగించనున్నారు. ప్రతీ వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సెంటర్‌కు ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేసథ్యంలో వ్యాక్సినేషన్ వేసే సమయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని వైద్యఆరోగ్యశాఖ సూచించింది. కొవిడ్ -19 వ్యాక్సిన్లను మార్చుకునేందుకు వీలు లేదు. తొలి డోసు ఏ సంస్థకు చెందిన టీకా తీసుకుంటారో రెండో డోసు కూడా అదే సంస్థకు చెందిన టీకా తీసుకోవాల్సి ఉంటుంది. యాంటీ బాడీలు లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్న కరోనా రోగులు ఇతర జబ్బుల కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి, దవాఖానలో చికిత్స పొందే రోగులు, వారు కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాతే వారికి టీకా తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ప్రస్తుతం టీకా ఇవ్వడం లేదు. కచ్చితంగా 18 ఏండ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇస్తారు. ఇతర టీకాలు ఇవ్వాల్సి వస్తే కొవిడ్ టీకాకు, ఇతర టీకాలకు కనీసం 14 రోజు వ్యవధి ఉండాలి. టీకా తీసుకునే వ్యక్తులకు మందులు, టీకా, ఆహార పదార్థాల అలర్జి ఉందేమో తెలుసుకొని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. టీకా తీసుకున్న తర్వాత ఏదైనా నొప్పి లేదా బాధ అనిపిస్తే పారాసిటమల్ తీసుకోవచ్చు అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు పేరు నమోదు చేసుకున్న వారికి ఎక్కడ టీకా వేస్తారనేది ఫోన్‌కు మెస్సేజ్ వస్తుంది. దీంతో వారు సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్ చేయించుకోవాలి. టీకా వేసుకునేందుకు వెళ్లేవారు వివరాలు సేకరించేటప్పుడు ఇచ్చిన ఐడీ కార్డు, ఆధార్‌కార్డును తప్పకుండా తీసుకవెళ్లాలి. ఒక వ్యక్తికి వ్యాక్సిన్ వేసిన తర్వాత అరగంట పాటు అతని ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తారు.
నేడు మూడు చోట్ల..
జిల్లాలో నేడు మూడు చోట్ల కరోనా టీకాను వేయనున్నారు. సిద్దిపేట జనరల్ దవాఖాన, గజ్వేల్ జిల్లా దవాఖాన, నంగునూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో టీకాలు వేయనున్నారు. జిల్లాకు 1790 డోసుల టీకా వచ్చింది. ఒక్కో దానిలో 10 డోసులు ఉంటాయి. ప్రతి కేంద్రంలో నేడు 30మందికి టీకా వేస్తారు. తర్వాత జిల్లాలో అన్ని కేంద్రాల్లో వేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. టీకా వేసుకున్న 23రోజుల తర్వాత మరో డోసు వేసుకోవాల్సి ఉంటుంది. టీకా తీసుకున్న వ్యక్తికి సమయానికి తన సెల్‌కు మెస్సేజ్ వస్తుంది. ఆ వెంటనే తన రెండో డోసు సదరు వ్యక్తి తీసుకోవాలి. ఇది తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో తొలివిడుతలో 8001మందికి కరోనా టీకాను ఇవ్వనున్నారు. వీరిలో ప్రభుత్వ రంగంలోని 3,312 మంది వైద్యులు, సిబ్బంది, ప్రైవేటు రంగంలో పని చేస్తున్న 2,529 మంది వైద్యులు, సిబ్బంది, ఐసీడీఎస్‌కు చెందిన 2,160 మందికి తొలి విడుతలో టీకాను వేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలోని 43 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రోజుకు ఒక సెషన్ చొప్పున ఒక్కో సెషన్‌కు 100 మందికి టీకాను వేస్తారు. టీకాలు వేసే సెంటర్లకు ప్రత్యేక పర్యవేక్షకులను కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి నియమించారు.
ప్రతీ సెంటర్లో 30మందికి టీకా...
కరోనా టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో నేడు మూడు చోట్ల టీకా వేయనున్నాం. సిద్దిపేట జనరల్ దవాఖాన-1లో 117 మందికి, గజ్వేల్ జిల్లా దవాఖానలో 226 మందికి, నంగునూరు సీహెచ్‌సీ పరిధిలో 214 మందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రతి సెంటర్ నుంచి 30మంది చొప్పున తొలి రోజు 90 మందికి టీకా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. వీళ్లలో ముఖ్యంగా శానిటైజర్ వర్కర్స్, వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు.. ఇలా అన్ని కేటగిరిల నుంచి ఎంపిక చేశాం. జిల్లాలో 1790 డోసుల టీకా వ్యాక్సిన్ వచ్చింది. సిరంజీలు 17500 సిద్ధంగా ఉన్నాయి.
- మనోహర్, జిల్లా వైద్యాధికారి, సిద్దిపేట
తాజావార్తలు
- ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్ వెంకన్న బ్రహ్మోత్సవాలు
- ఆమె రాజకీయ ఆటలోపడి లక్ష్యాలు మరిచారు: దినేశ్ త్రివేది
- తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులకు హత్రాస్ యువతి విజ్ఞప్తి
- భారీ మెజారిటీతో ‘పల్లా’ను ఎమ్మెల్సీగా గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి
- కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. రంజీ మాజీ క్రికెటర్ అరెస్ట్
- రష్మీ హాట్ అందాలకు యువత దాసోహం
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ