బుధవారం 27 జనవరి 2021
Siddipet - Jan 14, 2021 , 00:03:12

ఘనంగా ‘భోగి’

ఘనంగా ‘భోగి’

చేర్యాల, జనవరి 13 :  చేర్యాల పట్టణంతోపాటు కొమురవెల్లి, ధూళిమిట్ట, మద్దూరు మండలాల్లోని గ్రామాల్లో బుధవారం భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.   మహిళలు   కొత్త బట్టలు వేసుకొని ఇంటి ముందు వాకిళ్లలో రంగు రంగుల రంగవల్లులు వేశారు. భోగి సందర్భంగా ఆడపడుచులు వేసిన ముత్యాల ముగ్గులు ఎంతో చూడ ముచ్చటగా ఉన్నాయి.  

హుస్నాబాద్‌/హుస్నాబాద్‌టౌన్‌, జనవరి 13: పట్టణంతో పాటు డివిజన్‌లోని అన్ని మండలాల్లో   భోగి వేడుకలు  ఘనంగా జరిగాయి. మహిళలు, యువతులు తమ తమ ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులతో అలరింపజేశారు. పలు గ్రామాల్లో గంగిరెద్దుల ఆటలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు, యువత గాలిపటాలు ఎగురశారు. పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బోగి పండుగను పురస్కరించుకుని  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత వెంకన్న దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్పస్వాములు బోగిమంటలు నిర్వహించారు.  

మద్దూరు, జనవరి13: గాగిళ్లాపూర్‌లో  పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు.  పోటీల్లో గెలుపొందిన విజేతలకు  సర్పంచ్‌ బొల్లు కృష్ణవేణిచంద్రమౌళి, కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్‌ మేక సంతోష్‌కుమార్‌ బహుమతులు అందజేశారు. పీఏసీఎస్‌ డైరక్టర్‌ మేక మల్లేశం, పంచాయతీ కార్యదర్శి కందకట్ల శ్రీధర్‌, కారోబార్‌ బోయిని శ్రీకాంత్‌, వార్డు సభ్యులు గుడిసె నీల, బండి నర్సింహులు, కోఆప్షన్‌ సభ్యలు మహ్మద్‌ అలీ, పుప్పల బాలస్వామి, పంచాయతీ సిబ్బంది,  పాల్గొన్నారు.


logo