ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 14, 2021 , 00:03:10

మహమ్మారి ఇక మటాష్‌

మహమ్మారి ఇక మటాష్‌

జిల్లాలో వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం

సిద్దిపేట కలెక్టరేట్‌, జనవరి 13 : కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ చేస్తున్నది. మొదటి విడుతగా జిల్లాలో 8001 మంది టీకా వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా వ్యాక్సిన్‌ ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకోగా, బుధవారం రాత్రి జిల్లాకు వచ్చింది. వాటిని డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిల్వ చేశారు. సిద్దిపేట జిల్లాలో మొదటగా మూడు చోట్ల టీకాను వేయనున్నారు. జిల్లాకు 17,500 డోస్‌ల వ్యాక్సిన్లు అవసరమని ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపారు. బుధవారం వ్యాక్సిన్‌ సిద్దిపేటకు చేరగా, ఈ నెల 16న సిద్దిపేట జిల్లా దవాఖాన, గజ్వేల్‌ జిల్లా దవాఖాన, నంగునూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)లో టీకాను వేయనున్నారు. ఈ సెంటర్ల పరిధిలో 1790 మంది వ్యాక్సి న్‌ వేసుకునేవారున్నారు. ఇందులో  తొలిరోజు ఒక్కొక్క దవాఖానలో 30మంది చొప్పు న వ్యాక్సి న్‌ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు చోట్ల టీకా ప్రారంభమైన తర్వాత, రెండో రోజూ నుంచి జిల్లాలోని 43 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రోజుకు ఒక సెషన్‌ చొప్పున ఒక్కో సెషన్‌కు 100 మందికి టీకాను వేయనున్నారు. జిల్లా లో ప్రభుత్వ వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతరులు 5472మంది ఉండగా, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది, ఇతరులు 2529 మందికి టీకా వేయనున్నారు. టీకాలు వేసే సెంటర్లకు ప్రత్యేక పర్యవేక్షకులను కలెక్టర్‌ నియమించారు. సిద్దిపేటలో అడిషనల్‌ కలెక్టర్‌ ముజమ్మీల్‌ఖాన్‌, నంగునూరుకు సీహెచ్‌సీలో అడిషనల్‌ కలెక్టర్‌ పద్మాకర్‌, గజ్వేల్‌లో డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు పర్యవేక్షించనున్నారు.

  టీకా వేసే విధానం

వ్యాక్సిన్‌ వేసుకునేందుకు పేరు నమోదు చేసుకున్న వారికి ఎక్కడ టీకా వేస్తారనేది ఫోన్‌కు మెస్సేజ్‌ వస్తుంది. దీంతో వారు సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్‌ చేయించుకోవాలి. టీకా వేసుకునే వెళ్లేవారు వివరాలు సేకరించేటప్పుడు ఇచ్చిన ఐడీ, ఆధార్‌కార్డును తప్పకుండా తీసుకెళ్లాలి.

ఒక్కో వ్యక్తికి 0.5 ఎంఎల్‌ టీకా ఇస్తారు. ఒక్కో వాయిల్‌లో 5 ఎంఎల్‌ లిక్విడ్‌ ఉంటుంది. ఒక్కో వాయిల్‌లోని మందును 10మందికి వేస్తారు. 

వ్యాక్సిన్‌ వేసేటప్పుడు వాయిల్‌ ఇవ్వడానికి ముందే 5-6గురిని సెంటర్‌లో సిద్ధంగా ఉంచాలి.

ఒక వ్యక్తికి వ్యాక్సిన్‌ వేసిన తర్వాత అరగంట పాటు ఆతని ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తారు.

లిక్విడ్‌ మందు కావడంతో ఏడీ సిరంజీల సహాయంతో టీకా వేయనున్నారు.

VIDEOS

logo