శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 13, 2021 , 00:23:09

నాణ్యత, దిగుబడి పెరిగితేనే గిట్టుబాటు

నాణ్యత, దిగుబడి పెరిగితేనే గిట్టుబాటు

సాగుకు సాంకేతికత జోడిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడులు

రైతుకు అగ్నిపరీక్షగా స్వేచ్ఛా మార్కెట్‌ విధానం  

చిన్న, సన్నకారు, సాంప్రదాయ వ్యవసాయంపై పెనుభారం

నూతన సాగు విధానాలకు సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహం  

అనుసరిస్తేనే ఎవుసం నిలదొక్కుకునే అవకాశం

గజ్వేల్‌, జనవరి 3 : ఎవుసం మరోసారి సమస్యల వలయంలోకి నెట్టబడుతుంది. స్వేచ్ఛామార్కెట్‌తో సాంప్రదాయ సాగుకు పెను ముప్పు ఏర్పడనుండగా చిన్న, సన్న కారు రైతాంగంపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం అవుతున్నది. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ పరమైన సహకారం ప్రభుత్వాల నుంచి అందకుంటే గిట్టుబాటుపై తీవ్ర ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. తెలంగాణలో వివిధ పంటలకు అనుకూలమైన భూములు ఉన్నాయి. సాగు నీటి సమస్య తీరింది. అయినా ఇప్పటి వరకు చాలా పంటలను ప్రభుత్వ మద్దతు ధరపైనే ఆశలు పెట్టుకుని రైతు సాగు సాగిస్తున్నాడు. మద్దతు ధర లేకుంటే స్వేచ్ఛా మార్కెట్‌లో నాణ్యమైన, తక్కువ ధరకు దొరికే వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ ఉంటుంది. అంటే తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించిన రైతుకే గిట్టుబాటు లభిస్తుంది.  నూతన సాంకేతిక సాగు విధానాలు తప్పని సరి అవుతోంది. కార్పొరేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్లవుతుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సాగే వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆధునికి పద్ధ్దతులతో తక్కువ సమయం, తక్కువ విస్తీర్ణంలో నాణ్యమైన ఆధిక దిగుబడులు పొందే సాగు విధానాలు రైతులు చేపట్టాలి. ఇది చిన్న,సన్న కారు రైతుకు ఎవుసం మరింత భారంగా మారుతుందని అందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వ కొనుగోళ్లు జరుగక పోతే రైతు పరిస్థితి ఎలా ఉంటుందని రైతులు బెంగ పెట్టుకుంటున్నారు. వివిధ అంశాల్లో వ్యవసాయానికి సీఎం కేసీఆర్‌ అందించిన సహకరం సత్ఫలితాలు ఇవ్వడంతో దారిన పడగా స్వేచ్ఛా మార్కెటింగ్‌ విధానాలు తిరిగి ఎలా ప్రభావం చూపుతాయన్నది చర్ఛనీయంశంగా మారింది. 

 వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరఫై.. 

వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరపై రైతుకు కొంత ధీమా ఉంది. పండిన పంటకు మద్దతు ధర లభిస్తోందని నమ్మకం ఉండేది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడ తెగుళ్లు, నకిలీ విత్తనంతో నష్టాలకు గురైనా పంట దిగుబడి అందిన ఎంతో కొంత ధాన్యానికి మద్దతు ధరతో ప్రతిఫలం చేతికందే ఆశ లేకుండా పోతుంది. వానాకాలంలో పత్తి, వరి, మొక్కజొన్న మూడు ప్రధాన పంటలకు బహిరంగ మార్కెట్‌లో డిమాం డ్‌ లేకుండా పోయింది. వీటిని ప్రభుత్వమే మద్ధ్ద తు ధరకు కొనుగోలు చేయడం జరిగింది. అప్పులిచ్చిన వ్యాపారులు కూడా రైతులనే కొనుగోలు కేంద్రా ల్లో అమ్ముకొమ్మని అప్పు డబ్బులు తీసుకున్నారు. కొనుగోలు కేంద్రాలు లేకుంటే వడ్లు క్వింటాళుకు రూ 300ల నుంచి రూ. 500 వరకు నష్టం వచ్చేది. వానాకాలంలో సాగైన పత్తి చివరలో అధిక వర్షాలకు, వరి కాటుక తెగుళ్లు, దోమ పోటు వల్ల దిగుబడి బాగా తగ్గింది. మొక్కజొన్నకు కూడా ధర లేదు. సర్కారు కొనక పోతే రైతుకు గిట్టుబాటు కాదుకదా పెట్టుబడి కూడా చేతికందే వీలులేకుండేనని రైతులు చెప్పుకుంటున్నారు. యాసంగిలో కందులు, మొక్కజొన్నలు, పొద్దుతిరుడు, శనగల కొనుగోలు కూడా జరిగాయి. ఈ పంటల ఉత్పత్తులకు కూడా బహిరంగ మార్కెట్‌లో ధర లేకనే మద్దతు ధరపై రైతు ఆధార పడక తప్పలేదు. 

కూరగాయల పరిస్థితే..

స్వేచ్ఛా మార్కెట్‌తో ధాన్యం క్రయ విక్రయాల్లో కూరగాయల మాదిరిగానే సమస్యలు ఎదుర్కోక తప్పవని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. సీజన్‌లో ఉత్పత్తులు పెరిగితే కొనేవారు లేక రోడ్లపై పారపోసిన సందర్భాలు గుర్తుకు వస్తున్నాయని రైతులు చెప్తున్నారు. టమాట, వంకాయ, గుమ్మడి, కీర, తదితర కూరగాయలు ట్రాన్స్‌పోర్టు ఖర్చులు రాక పోవడంతో చేన్లలోనే తెంపకుండా వదిలివేసి పశువులను మేపి ఉచితంగా పంచిపెట్టిన రైతుల బాధలు చెప్పలేనివి. కూరగాయలు తెంపుకొని మార్కెట్‌కు వెళ్లాక అమ్మకం జరిగి చేతికి డబ్బు అందే వరకు ఎంత వస్తుందో రైతుకు తెలియని దుస్థితి. కూరగాయలు ఒకే పంటకు పలు సార్లు కోతలు రావడంతో ఒకసారి కాకపోతే మరోసారి ధర రావొచ్చని ఆశ ఉంటుంది, ధాన్యం ఒకే సారి తనకు పండినది మార్కెట్‌కు తీసుకపోవడంతో ఆరు నెలల కష్టం ఆయోమయంలో పడుతోంది.

అధిక దిగుబడులంధించే 

మేలురకమైన విత్తనాలు రావాలి

ఈ విపత్కర పరిస్థితుల్లో విత్తన విషయంలో విప్లవాత్మక మార్పు రావాలి. ప్రాంతాలు, స్థానిక వాతావరణ పరిస్థితుల కనుగుణంగా అధిక దిగుబడులిచ్చే కొత్త నూతన వంగడాలు రూపొందించడం జరుగాలి. పలు రకాలు విడుదలైన కొన్ని సంవత్సరాల వరకు దిగుబడి బాగా వచ్చిన తర్వాత వివిధ తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం కోల్పోయి పంట దిగుబడి తగ్గి పోతుంది. గతంలో తెల్లహంస ( ఆర్‌ఎన్‌ఆర్‌ 10754) వరి సాగు దిగుబడిలో కొత్త మార్పును తీసుకువచ్చింది. దశాబ్దాల పాటు నాటు రకాల స్థానంలో తెల్లహంస మంచి దిగుబడులు చేతికందాయి. సన్న రకాల్లో బీపీటీ 5204 రకం బాగా దిగుబడులు రాగ వినియోగదారులను మొప్పించి రైతులకు గిట్టుబాటు అందిచాయి. ఇప్పడు ఈ రకాల దిగుబడులు తగ్గడంతో కొత్త రకాల వైపు రైతులు చూస్తున్నారు. ఇటీవల వచ్చిన పలు రకాలు దిగుబడులు పెరిగినా మరింత పెంచే విధంగా విత్తనం రూపొందాలి. పెట్టుబడులు పెరుగుతున్న క్రమంలో దిగుబడులు పెరుగాలి. అందుకు విత్తనం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

సాగులో శాస్త్రీయత పెరుగాలి

సాంప్రదాయ, ప్రాచీన సాగు పద్ధ్దతల స్థానంలో నూతన శాస్త్రీయ సాగు విధానాలు రైతుకు అందుబాటులోకి రావాలి. యంత్ర పరికరాల వాడకం బాగా పెరుగాలి. ఆధునిక యంత్రా లు వ్యవసాయానిక వినియోగం జరుగాలి. వీటితో పాటు రైతుకు పంటల సాగుపై పూర్తి పరిజ్ఞానం రావాలి. మార్కెటింగ్‌ వ్యవస్థ ఉత్పత్తుల డిమాండ్‌పై రైతుకు అవగాహన పెరుగాలి ఏ పంట ఎప్పుడు సాగు చేయాలి, మార్కెటింగ్‌ మెళకువలపై అనుభవం అవగాహన అవసరం. హైబ్రిడ్‌ రకాలు ఎన్నో ఉన్న వాటి దిగుబడి, మార్కెట్‌లో ఆరకం డిమాండ్‌పైనే రైతుకు గిట్టుబాటు అందివస్తోంది. 


తెలంగాణ సర్కారు

 ముందస్తుగానే సహకారం

సీఎం కేసీఆర్‌ వ్యవసాయంపై అనుభవంతో రైతుకు అనేక రకాల సౌకర్యాలు రాయితీల రూపంలో అందుబాటులోకి తీసుకవచ్చారు. కూరగాయల సాగులో సూక్ష్మ సేథ్యాన్ని విస్తరించారు. యాంత్రీకీకరణలో స్పేర్లు, ట్రాక్టర్లు, వరికోత మిషన్లు, వ్యవసాయ యంత్ర పనిముట్లకు రాయితీ ఇచ్చి యంత్రాల వాడకాన్ని ప్రోత్సహించారు. ప్రాజెక్టులు నిర్మించి ప్రధాన సమస్య సాగునీటి ఇబ్బంది లేకుండా చేశారు. వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఏడాది పాటు పంటలు పండించడం అధిక దిగుబడుల కోసం పందిరి, షేర్‌నెట్‌, పాలీ హౌస్‌ సాగుకు పెద్ద మొత్తంలో రాయితీలందిస్తున్నారు. శాస్త్రీయ పద్ధ్దతుల్లో సమష్టి సాగును ప్రోత్సహిస్తున్నారు. విత్తన సాగుకు రైతులకు అనుకూలంగా వనరులను కల్పిస్తున్నారు. విద్యుత్‌ సమస్య పూర్తిగా తొలిగిపోగా ఇష్టమైన వృత్తిగా మారడంతో రాష్ట్రంలో చదువుకున్న వారు కూడా వ్యవసాయం చేయాలని ఉత్సాహం చూపుతున్న సమయమిది.

మద్దతు లేకుంటే రైతుకు నష్టం 

పండించిన పంటకు రైతుకు గిట్టుబాటు అందాలి. ఓపెన్‌ మార్కెట్‌లో రైతు పండించిన ఉత్పత్తులను స్థానిక మార్కెట్‌కు తప్ప దూరం పోడు. ఎక్కువ కాలం నిల్వ ఉంచే చిన్న సన్నకారు రైతుకు వీలుండదు. పండు పండగానే అమ్మకొని అప్పు తీర్చుకునే రైతుకు తిరిగి దళారులను ఆశ్రయించే పరిస్థితులు తప్పవు. ఎటొచ్చి కేంద్రం విధానాల వల్ల కార్పొరేటు వ్యవస్థకు మేలు జరుగుతుంది.

-దేవీ రవిందర్‌, రైతు నాయకుడు  

పంట పండాలే ధర పల్కాలే..  

పంటలు బాగా పండాలే. పండిన పంటకు మంచి ధర పల్కాలే. సర్కారు ధర చెప్తేనే ప్రైవేటోళ్లు ధరకు కొంటరు. సర్కారు ధర గింతని లేక పోతే వాళ్ల ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటరు. మోసాలు పెరుగుతయి. రైతుకు అన్ని ముచ్చట్లు తెల్వయి. తెల్సుకునే లోపే నష్టపోతం. సర్కారు కొంటుం టే గంతకంటే ఎక్కువ ధర వస్తే బయట అమ్ముకునేటోళ్లు గిప్పుడు ఎైట్లెతదో ఎమో..

-లింగ కృష్ణ, రైతు

VIDEOS

logo