సోమవారం 01 మార్చి 2021
Siddipet - Jan 13, 2021 , 00:23:25

రహదారుల పనులు వేగవంతం చేయండి

రహదారుల పనులు వేగవంతం చేయండి

మెదక్‌-రామాయంపేట, సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి హైవే పనులు త్వరగా ప్రారంభించండి

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ డిపో నిర్మాణం మార్చి తొలి వారంలో పూర్తి చేయాలి 

సిద్దిపేట పొన్నాల వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం వేగంగా చేపట్టాలి 

సిద్దిపేట కేసీఆర్‌ నగర్‌ వద్ద సర్వీస్‌ రోడ్డు, అనంతసాగర్‌ వద్ద ట్రక్‌ పార్కింగ్‌ పనులు పూర్తి చేయాలి 

మూడు జిల్లాకేంద్రాల్లో డ్రైవింగ్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలి 

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

రాజీవ్‌ రహదారి, జాతీయ రహదారి, ఆర్టీసీ పనులపై అరణ్య భవన్‌లో అధికారులతో మంత్రి పమీక్ష

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రహదారులు, సర్వీసు రోడ్లు, వంతెనలు, జంక్షన్ల అభివృద్ధి, పెండింగ్‌ పనులు వేగంగా పూర్తి చేయాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో మంగళవారం ఆయా శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మెదక్‌, రామాయంపేట, సిద్దిపేట, హుస్నాబాద్‌ మీదుగా వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిని అనుసంధానం చేసే జాతీయ రహదారి పనులు, సిద్దిపేట-కరీంనగర్‌ వెళ్లే రాజీవ్‌ రహదారి పెండింగ్‌ పనులు వేగంగా పూర్తిచేయాలన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఆర్టీసీ డిపో నిర్మాణాన్ని మార్చి మొదటి వారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పలుచోట్ల పనులు నెమ్మదిగా సాగడంపై మంత్రి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. 

- సిద్దిపేట ప్రతినిధి, జనవరి 12 (నమస్తే తెలంగాణ)

సిద్దిపేట ప్రతినిధి, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : మెదక్‌, రామాయంపేట, సిద్దిపేట, హుస్నాబాద్‌ మీదుగా వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిని అనుసంధానం చేసే జాతీయ రహదారి పనులపై, సిద్దిపేట- కరీంనగర్‌ వెళ్లే రాజీవ్‌ రహదారి పెండింగ్‌ పనులపై ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హైదరాబాద్‌ అరణ్య భవన్‌లో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. సిద్దిపేటలో ఇటీవల ప్రారంభమైన కేసీఆర్‌నగర్‌ 2,460 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల దగ్గర రూ.10 కోట్లతో 2 కి.మీ సర్వీసు రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను మంత్రి ఆదేశించారు. చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌ వద్ద చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ గ్రామం వద్ద సర్వీసు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. డ్రైనేజీ కూడా నిర్మించాలని సూచించారు. అనంతసాగర్‌ వద్ద 9 ఎకరాల విస్తీర్ణంలో రూ.2 కోట్లతో ట్రక్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్‌ రాజీవ్హ్రదారిపై నర్సాపూర్‌ చౌరస్తా వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అక్కడి జంక్షన్‌ వద్ద సర్కిల్‌ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పొన్నాల, సిద్దిపేట ఫ్లైఓవర్‌ పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. సిద్దిపేట పొన్నాల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రమాదాలను నివారించేందుకు రూ.30 కోట్ల అంచనాతో ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. కుకునూరుపల్లి వద్ద కొత్తపల్లి మనోహరాబాద్‌ రైల్వేలైన్‌లో భాగంగా పక్క నుంచి రెండు వైపుల నిర్మించే సర్వీస్‌ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని, అందుకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డిని ఫోన్‌లో మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మెదక్‌, రామాయంపేట, సిద్దిపేట నుంచి వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిని అనుసంధానం చేసే జాతీయ రహదారి పనులు వెంటనే ప్రారంభించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మెదక్‌ -సిద్దిపేట - ఎల్కతుర్తి జాతీయ రహదారికి నంబర్‌ కేటాయించాలని కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కార్యదర్శి గిరిధర్‌, ఎన్‌హెచ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రవిని ఫోన్‌లో కోరారు. ఈ జాతీయ రహదారి రూ. 1200 కోట్లతో 133 కి.మీ నిర్మించేందుకు డీపీఆర్‌ సైతం సమర్పించామని అధికారులు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించాలని ఎన్‌హెచ్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట, రామాయంపేట, మీదుగా మెదక్‌ వరకు ఈ జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఇందులో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు. 

నర్సాపూర్‌ డిపో నిర్మాణం మార్చిలోగా పూర్తి చేయాలి... 

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఆర్టీసీ డిపో నిర్మాణ పనుల జాప్యంపై అధికారులపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి మొదటి వారం కల్లా డిపో నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. కొమురవెల్లి, సదాశివపేట బస్టాండ్‌ నిర్మాణ పనులు నెమ్మదిగా జరగడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. చేర్యాల బస్టాండ్‌ నిర్మాణం పూర్తయిందని, దీన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవింగ్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువతకు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా డ్రైవింగ్‌ నేర్పించి సర్టిఫికెట్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్‌ను ఆనుకొని ఉండే రోడ్డు చిన్నదిగా ఉండడంతో రోడ్డు విస్తరణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అయితే ఈ కొత్త బస్టాండ్‌ 438 మీటర్ల ప్రహరీ తీసివేసి రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుతో నాలుగు ఫీట్ల వరకు ఉంటే బస్సు తిప్పలేమని, ఆరు ఫీట్ల వరకు అతి కష్టం మీద పెంచగలుగుతామని అధికారులు తెలిపారు. 292 గజాల స్థలం, ప్రహరీ తొలగించి, కొత్తది నిర్మించడానికి, ప్రహరీకి ఉన్న టాయిలెట్లు కొత్తగా ఏర్పాటు చేయడానికి కోటి రూపాయల వరకు మున్సిపాలిటీ నుంచి ఆర్టీసీకి చెల్లించాలని ఇప్పటికే కోరడం జరిగిందని మంత్రి చెప్పారు. ఈ సమీక్షలో రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయేందర్‌ , ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజినీర్‌ మధుసూదన్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ సర్కిల్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌, సంగారెడ్డి ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ రాజశేఖర్‌, టీఎస్‌ఆర్టీసీ చీఫ్‌ ఇంజినీర్‌ రాంప్రసాద్‌, ఆర్టీసీ ఈఈ రాంబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.  

VIDEOS

logo