గురువారం 04 మార్చి 2021
Siddipet - Jan 13, 2021 , 00:23:23

కొండపోచమ్మకు కోటి దండాలు..

కొండపోచమ్మకు కోటి దండాలు..

కొంగుబంగారం కొండపోచమ్మ ఆలయం

ఉత్సవాలకు ముస్తాబైన అమ్మవారి క్షేత్రం

రేపు దేవాలయంలో సదరు పటం

18 నుంచి జాతర ప్రారంభం

జగదేవ్‌పూర్‌, జనవరి 12 : 

పచ్చని పంటపొలాలు.. ఎత్తయిన నల్లసరం కొండలు.. పచ్చని చెట్లు.. ఆహ్లాదకర వాతావరణంలో వెలసిన కొండపోచమ్మ దేవాలయం జాతర ఉత్సవాలకు ముస్తాబైంది. కొమురెల్లి మల్లన్నకు కోటిదండాలు.. కొండపోచమ్మకు ముక్కోటి దండాలు.. కరుణించి కాపాడే తల్లి పోచమ్మకు శతకోటి దండాలు.. అంటు భక్తులు అమ్మవారిని ఇష్టంగా కొలుచుకుంటారు. కోరిన కోర్కేలు తీర్చే కొండపోచమ్మ తల్లి జాతరకు బయలుదేరుదాం.. అంటూ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలిరానున్నారు. ఈ నెల 13న సంక్రాంతి భోగి పండుగ నాడు సదరు పటం వేయనున్నారు. సోమవారం 18వ తేదీ నుంచి జాతర ప్రారంభమై, ఉగాది వరకు మూడు నెలల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. 

చెల్లి పోచమ్మకు అన్న మల్లన్న వరం..

తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన కొమురవెల్లి మల్లన్నకు కొండపోచమ్మ స్వయాన చెల్లి అని ప్రతీతి. వందల ఏండ్ల క్రితం పోచమ్మ తల్లి అన్న మల్లన్నతో కొమురవెల్లి గుట్టలపై ఉండేదని భక్తుల విశ్వాసం. ఒకానొక సందర్భంలో చెల్లి పోచమ్మను మల్లన్న కోప్పడ్డాడనీ, దీంతో అన్న మల్లన్నపై పోచమ్మ అలకబూని తీగుల్‌నర్సాపూర్‌ దట్టమైన అడవుల్లో స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు. చెల్లి జాడ తెలుసుకొని, ఆమె దగ్గరికి వెళ్లి ఇంటికెళ్దామని కోరాడు. తాను రానని మొండికేయగా, ఏం వరం కావాలో కోరుకోవాలని చెప్పగా, కొమురవెల్లికి వచ్చిన ప్రతీ భక్తుడు తన వద్దకు వచ్చి దర్శనం చేసుకోవాలని కోరిందట. నాటి నుంచి పోచమ్మ తీగుల్‌నర్సాపూర్‌ కొండపై పోచమ్మ స్థిరపడింది. అప్పటి నుంచి జగదేవపూర్‌ మండలం తీగుల్‌నర్సాపూర్‌లో భక్తుల ఇలవేల్పుగా, కోరిన కోరికలు తీర్చే కొండపోచమ్మగా విరాజిల్లుతున్నది. కొండపోచమ్మను దర్శించుకుంటే సంతానం కలుగుతుందన్న నమ్మకంతో హైదరాబాద్‌ జంటనగరాలతో పాటు చుట్టూ పక్కల జిల్లాల నుంచి ఏటా జరిగే జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.

ఆకట్టుకునే బోనాలు.. 

కొండపోచమ్మ జాతరకు వచ్చే భక్తులు తాము కోరిన కోర్కేలు తీరడంతో ముందుగా ఆలయం ముందున్న చెరువులో స్నానం చేసి,ఆలయ పరిసరాల్లో అమ్మవారికి నైవేద్యం వండి, రంగురంగులు పూలతో అలంకరించిన ఎత్తయిన బోనాల్లో ఉంచి డప్పుచప్పుళ్లు, శివసతుల పూనకాలు, యువతీ యువకుల నృత్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి ఒడిబియ్యం పోసి నైవేద్యం సమర్పిస్తారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారి ప్రతిమలను అందంగా అలంకరించి, ధూంధాంగా డీజే సౌండ్స్‌తో సందడి చేస్తూ వచ్చి ఆలయ ప్రాంగణంలో చెట్టుకు ముడుపులు కడుతారు. ఈ జాతరలో జోగినీ శ్యామల బృందం ఎత్తయిన బోనం ఎత్తుకొని చేసే నృత్యాలు, వారితో పాటు యువతీ యువకులు డ్యాన్సులు పూనకాలు ఆకట్టుకుంటాయి.

ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు..

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్‌ రజితారమేశ్‌, ఈవో మోహన్‌రెడ్డి తెలిపారు. ఆలయానికి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి, పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలకు మంత్రిహరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ అధ్యక్షురాలికి ఆహ్వానం అందించారన్నారు. అలాగే, జాతరకు కుషాయిగూడ, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, సిద్దిపేట, జేబీఎస్‌ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారన్నారు. జాతరలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, ఎక్కడికక్కడ రూట్‌ మ్యాప్‌లు వేసి, పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేశారన్నారు. జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై పరమేశ్వర్‌ తెలిపారు.

VIDEOS

logo