కొమురవెల్లిలో.. పెళ్లిసందడి

నేడు మల్లన్న కల్యాణం
మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో వేడుక
ఏర్పాటు పూర్తిచేసిన ఆలయ వర్గాలు
కల్యాణానికి వేలాదిగా తరలిరానున్న భక్తులు
పట్టువస్ర్తాలు సమర్పించనున్న మంత్రి హరీశ్‌రావు
హాజరుకానున్న మంత్రితలసాని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, మండలి చీఫ్‌విప్ బొడెకుంటి వెంకటేశ్వర్లు
చేర్యాల, జనవరి 9 :
తెలంగాణ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం ఆదివారం (నేడు) కొమురవెల్లి క్షేత్రంలో వైభవంగా నిర్వహించనున్నారు. స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఆలయవర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా భార్సి మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో మల్లన్న కల్యాణాన్ని నిర్వహించనున్నారు. కల్యాణోత్సవానికి మంత్రి హరీశ్‌రావు హాజరై స్వామి వారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. కల్యాణానికి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, శాసన మండలి చీఫ్‌విప్ బొడెకుంటి వెంకటేశ్వర్లు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. స్వామి వారి క్షేత్రంలోని సీసీరోడ్లను శుభ్రం చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక పార్కింగ్ సదుపాయం..
హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో భక్తుల కోసం వరంగల్, హైదరాబాద్ నుంచే వచ్చే భక్తులకు వైశ్య సత్రం వద్ద, కరీంనగర్, సిద్దిపేట జిల్లా నుంచి వచ్చే భక్తులకు బతుకమ్మ చెరువు వద్ద, వీఐపీలకు తోటబావి వద్ద, చేర్యాల నుంచి వచ్చే వారికి బస్‌స్టేషన్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు స్వామి వారి క్షేత్రంలో రెండు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. స్వామి వారి క్షేత్రంలో దాతలు నిర్మించిన 150 కాటేజీలు సిద్ధ్దంగా ఉన్నాయి. దాతలు రాని పక్షంలో వాటిని భక్తులకు కేటాయించనున్నారు. భక్తుల కోసం 60వేల లడ్డూలు, 20వేల పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వామి వారి క్షేత్రంలో భక్తుల రక్షణ కోసం 60 సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్వామి వారి మొదటి ఆదివారం (పట్నంవారం) వరకు మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆలయవర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలోని కార్యాలయాలు, స్వాగత తోరణాలు తదితర వాటికి రంగులు వేయించారు. స్వామి వారి కల్యాణం సందర్భంగా పోలీస్‌శాఖ 260 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఇద్దరు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, 14 మంది ఎస్సైలు, 30 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 150 మంది కానిస్టేబుళ్లు, 31 మంది మహిళా కానిస్టేబుళ్లు, మహిళా హోం గార్డులు 31, బీడీ టీమ్స్‌తో పాటు రోప్ పార్టీల ఏర్పాటు చేసినట్లు ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
వేలాదిగా తరలి రానున్న భక్తులు..
స్వామి వారి కల్యాణమహోత్సవానికి వేలాదిగా భక్తులు హాజరుకానుండడంతో ఆలయ ఈవో బాలాజీ ఆధ్వర్యంలోఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగా శ్రీనివాసులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కల్యాణ వేదిక తోటబావి ప్రాంతంలో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక వద్ద బారికేడ్లు, పచ్చదనం ఉట్టిపడే విధంగా పలు ఏర్పాట్లు చేశారు. ప్రసాదాల విక్రయ కౌంటర్ల వద్ద తాగునీటి వసతితో పాటు ఆలయ వర్గాలకు చెందిన 12బోర్లు, 15నీటి ట్యాంకులు, 70కుళాయిలు, విద్యుత్ సరఫరాతో పాటు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేసేందుకు అన్ని పనులను పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో 5 టాయిలెట్లతో పాటు స్వామి వారి క్షేత్రంలో 3 సులబ్ కాంప్లెక్స్‌లు, బస్‌స్టేషన్ వద్ద తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులే కాకుండా సిద్దిపేట, జనగామ జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారి వాహనాలను నిలిపేందుకు మూడు ప్రాంతాల్లో పార్కింగ్‌కు స్థలాలను గుర్తించారు. కొవిడ్ నేపథ్యంలో 25వేల మాస్కులు, శానిటైజర్లను సైతం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
కల్యాణోత్సవ ఏర్పాట్లు పరిశీలన
చేర్యాల, జనవరి 9 :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొమురవెల్లి మల్లన్న క్షేత్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించడంతో భక్తులకు అన్ని వసతులు సమకూరుతున్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం మల్లన్న క్షేత్రంలో ఎమ్మెల్యే పర్యటించి ఆదివారం నిర్వహించే కల్యాణ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కల్యాణ వేదిక, రాజగోపురం, ఆలయ ప్రధాన వీధులు, రాతీ గీరలు, తోటబావి ప్రాంతాల్లో పర్యటించి ఆలయ అధికారులతో పాటు పోలీస్‌శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొమురవెల్లి మల్లన్న కల్యామహోత్సవానికి మంత్రి హరీశ్‌రావు పట్టువస్ర్తాలను సమర్పించనున్నారని తెలిపారు. రూ.3కోట్లు ఉన్న మల్లన్న ఆలయ ఆదాయం ప్రస్తుతం రూ.13కోట్లకు చేరుకుందని, రానున్న రోజుల్లో ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. ఇటీవల హుండీ లెక్కింపులు జరిపితే 55రోజుల్లో రూ.56లక్షల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు. స్వామి వారి కల్యాణం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే వెంట ఆలయ ఈవో బాలాజీ, ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగా శ్రీనివాస్, మల్లన్న ఆలయ డైరెక్టర్లు ఉత్కూరి అమర్, వజ్రోజు శంకరాచారి, కొమురవెల్లి, చేర్యాల మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
‘మల్లన్న’ దర్శనం టికెట్ ధర పెంపు
చేర్యాల, జనవరి 9 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దర్శనం టికెట్ ధరలను పెంచుతూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ఇటీవల స్వామి వారి లడ్డూ, పులిహోర ప్రసాదాలను పెంచిన దేవాదా య శాఖ అధికారులు దర్శనం టికెట్ ధరలను కూడా పెంచారు. స్వామి వారి బ్రహ్మోత్సవా ల పై జరిగిన సమీక్ష సమావేశంలో దర్శనం టికెట్ల ధరలను పెంచాలని కోరుతూ మల్లన్న ఆలయ ఈవో కమిషనర్‌కు లేఖ రాశారు. ధరల పెంపు పై ఏవైనా ఉంటే వారం రోజుల్లో కార్యాలయంలో తెలియజేయాలని నోటీస్ బోర్డు పై ప్రకటన పొందుపరిచారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆలయ ఈవో వినతి మేరకు టికెట్ల ధరలను పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.
టికెట్ల ధరలు..
దర్శనం గతంలో ప్రస్తుతం
(ధర) (ధర)
వీవీఐపీ 300 500
విశిష్ట 100 150
శీఘ్ర దర్శనం 50 100
కల్యాణ వేడుక ఇలా..
వరుడు : శ్రీ మల్లికార్జున స్వామి
వధువులు : శ్రీ మేడలాదేవి, శ్రీకేతమ్మ దేవి
సుముహూర్తం : స్వస్తిశ్రీ శార్వరీనామ సంవత్సరం మార్గశిర మాసం ద్వాదశి ఆదివారం, ఉదయం 10.45 గంటలకు
కల్యాణ వేదిక : కొమురవెల్లి పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణములోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక
కన్యాదాతలు : మహాదేవుని వంశస్తులు
స్వీకర్తలు : పడిగన్నగారి వంశస్తులు
వేడుక పర్యవేక్షణ : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా భార్సీ మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణ
పురోహితులు : నడిపుడి మఠం భవానయ్య స్వామి, భద్రయ్యస్వామి, జ్ఞానశ్వర్ శాస్త్రి, చంద్రశేఖర్ స్వామి, ఆనందయ్య, భువనేశ్వర స్వామి, విశ్వనాథశాస్త్రి
వ్యాఖ్యాతలు : డాక్టర్ మహంతయ్య, నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి స్వామిజీలు
ముఖ్య అతిథులు : స్వామి వారి భక్తులు
ఆహ్వానితులు : ఆలయ కార్యనిర్వహణాధికారి, వీరశైవ అర్చక, ఒగ్గు పూజారుల బృందం, ఆలయ సిబ్బంది
తాజావార్తలు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్‌లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!