శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 09, 2021 , 00:22:35

రైతు ఆదాయం పెంచేందుకే పశువుల హాస్టళ్లు

రైతు ఆదాయం పెంచేందుకే పశువుల హాస్టళ్లు

  • రాష్ట్రంలో తొలి పశువుల హాస్టల్‌ ప్రారంభం
  • సిద్దిపేట అర్బన్‌ మండల పొన్నాలలో నిర్మాణం
  • స్వచ్ఛ గ్రామాలు, రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం
  • త్వరలోనే పాడి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి 
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట రూరల్‌, జనవరి 8: రైతుల ఆదాయం పెంచడంతో పాటు, గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చే లక్ష్యంతోనే పాడి పశువులకు హాస్టల్‌లు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్‌ మండల పరిధిలోని పొన్నాల గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సామూహిక పాడి పశువుల సముదాయాన్ని సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. పశువుల సమూదాయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్యశిబిరం, చాప్‌ కటింగ్‌ షెడ్‌, పిడకల తయారీ కేంద్రం, పాల సేకరణ కేంద్రం, కమ్యూనిటీ హాల్‌, ప్రసూతి శాల తదితర వాటిని ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. రైతుల ఆదాయం, స్వచ్ఛ గ్రామాలు, ప్రజల ఆరోగ్యం ఈ మూడు లక్ష్యాలతోనే పశువుల హాస్టల్‌లను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే దేశంలో తొలిసారిగా గొర్రెల హాస్టల్‌ను సిద్దిపేట నియోజకవర్గంలో నిర్మించి ఆదర్శంగా నిలిచామని, నేడు అదే స్ఫూర్తితో పొన్నాలలో పశువుల హాస్టల్‌ నిర్మించామన్నారు. అయితే ప్రారంభంలో కొన్ని సమస్యలుంటాయని, వాటిని అధిగమించేందుకు త్వరలోనే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. విజయ డెయిరీ పాల ధరలు పెంచేందుకు సైతం కృషి చేస్తామన్నారు. పశువుల హాస్టల్‌ నిర్మాణానికి సహకరించిన బాలవికాస సంస్థ, ఇతర ప్రతినిధులను మంత్రి అభినందించారు. పశుసంవర్ధక శాఖ సంచాలకులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో గుజరాత్‌ రాష్ట్రంలోనే ఈ హాస్టల్‌లు ఉండేవని, ఆ తరువాత సిద్దిపేటలోనే పశువులకు హాస్టల్‌లు ఉన్నాయన్నారు. అన్ని వసతులతో కూడిన   పశువుల హాస్టల్‌ సిద్దిపేటలో మొదటిసారిగా ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.     రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు కృషితో రాష్ట్రంలో హరిత విప్లవం, బ్లూ, పింక్‌ రెవెల్యూషన్‌ వచ్చాయని, పశువుల హాస్టల్‌ల          నిర్మాణంతో రెండో శ్వేత విప్లవం రానున్నదన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సురేష్‌బాబు, ఈజీఎస్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ తుపాకుల బాల్‌రంగం, డీఆర్‌డీఓ గోపాల్‌రావు, డీపీఓ సురేష్‌బాబు, సర్పంచ్‌ రేణుక, బాలవికాస కార్యనిర్వాహక డైరెక్టర్‌   శౌరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo