భగవన్నామస్మరణతో మనశ్శాంతి

దుబ్బాక టౌన్, జనవరి7 : భగవన్నామస్మరణతో ఆందోళనలు వీడి మానసిక ప్రశాంతత, ధైర్యం కలుగుతుందని రాంపూర్ శారదా క్షేత్రం పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. దుబ్బాక పెద్దమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవంలో భాగంగా గురువారం మాధవానంద సరస్వతీ అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ ..దేవాలయం అంటే ఒక సామాజిక కళావికాస కేంద్రమని, ప్రతి ఒక్కరూ దైవభక్తితో మెలగాలన్నారు. నరుడిని నమ్మే బదులు నారాయణుడిని నమ్మాలని భక్తులకు సూచించారు. ముగ్గురు అమ్మల కన్నతల్లి పెద్దమ్మ తల్లికి కొడుకులు, కూతుర్లుగా మెలిగితేనే భక్తులమవుతామన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన వారందరికీ మంచి జరుగుతుందని మాధవానంద సరస్వతీ అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా యంత్రస్పర్శ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్ సంఘ కార్యవర్గ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.