ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Jan 06, 2021 , 00:17:16

కలెక్టరేట్‌, కమిషనరేట్‌ రెడీ

కలెక్టరేట్‌, కమిషనరేట్‌ రెడీ

  • రూ.54 కోట్లతో సిద్దిపేట సమీకృత భవన సముదాయం
  • 20 ఎకరాల విస్తీర్ణంలో పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం
  • త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభోత్సవం
  • ఏర్పాట్లు చేస్తున్నజిల్లా అధికార యంత్రాంగం

సరికొత్త హంగులతో సిద్దిపేట సమీకృత కలెక్టరేట్‌ భవనం రెడీ అయ్యింది. సుడా పరిధి కొండపాక మండలం దుద్దెడ, మర్పడగ గ్రామాల శివారులో సమీకృత కలెక్టరేట్‌ పూర్తయ్యింది. భవన నిర్మాణ స్థలాన్ని స్వయంగా ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌,  అక్టోబర్‌ 11న సమీకృత కలెక్టరేట్‌, పోలీసు కమిషనరేట్‌ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 50 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.54 కోట్లతో జీ+2 పద్ధతిలో కలెక్టరేట్‌ సముదాయాన్ని, సుమారు 20ఎకరాల్లో రూ.15కోట్లతో పోలీస్‌ కమిషనరేట్‌, క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించేందుకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సన్నాహాలు చేస్తున్నారు.

సుడా పరిధిలోని కొండపాక మండలంలోని దుద్దెడ, మర్పడగ గ్రామాల శివారులో సమీకృత కలెక్టరేట్‌  భవన నిర్మాణ స్థలాన్ని స్వయంగా సీఎం కేసీఆర్‌ పరిశీలించి ఎంపిక చేశారు.  2017 అక్టోబర్‌ 11న సమీకృత కలెక్టరేట్‌ భవనం, పోలీస్‌ కమిషనరేట్‌ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.  సుమారు 50 ఎకరాల విస్తీర్ణం లో రూ.54 కోట్ల వ్యయంతో సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని జీప్లస్‌ -2 పద్ధతిలో నిర్మించారు. 

- సిద్దిపేట ప్రతినిధి, జనవరి 5 (నమస్తే తెలంగాణ)

సిద్దిపేట ప్రతినిధి, జనవరి 5 (నమస్తే తెలంగాణ ) : సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనం సిద్ధమైంది. త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించడానికి రాష్ట్ర ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సన్నాహాలు చేస్తున్నారు. ఆ దిశగానే.. జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సుడా (సిద్దిపేట అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ) పరిధిలోని కొండపాక మండలంలోని దుద్దెడ, మర్పడగ గ్రా మాల శివారులో సమీకృత కలెక్టరేట్‌  భవన నిర్మాణ స్థలాన్ని స్వ యంగా సీఎం కేసీఆర్‌ పరిశీలించి ఎంపిక చేశారు. 2017 అక్టోబర్‌ 11న సమీకృత కలెక్టరేట్‌ భవనం, పోలీసు కమిషనరేట్‌ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. 50 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.54 కోట్లతో సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని జీప్లస్‌ -2 పద్ధతిలో నిర్మించారు. ఇదే సముదాయంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్‌వోల కుటుంబాలు నివసించడానికి జీప్లస్‌ -1 పద్ధతిలో రూ. 7.9 కోట్లతో భవనాలు సిద్ధమయ్యాయి. సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయ భవనాన్ని, క్యాంపు ఆఫీస్‌ను సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.15 కోట్లతో నిర్మించారు. 

సరికొత్త హంగులతో సమీకృత కలెక్టరేట్‌ భవనం.. 

సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులు పూర్తి చేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రా రంభించడానికి మిగిలిన చిన్నచిన్న పనులను పూర్తి చేయడానికి అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. సుమారుగా 50 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఆధునిక వసతులతో ప్రభుత్వ కార్యాలయాల సమాహారంతో భవనాన్ని పూర్తి చేశారు. లక్షా 61 వేలు, 220 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీప్లస్‌ - 2 పద్ధతి లో సుమారు 46 శాఖలకు సరిపడే విధంగా సమీకృత భవనా న్ని నిర్మిస్తున్నారు. 3 సెమినార్‌ హాళ్లు, ఆధునిక వీడియో కాన్ఫరెన్స్‌ హాళ్లను ఏర్పాటు చేశారు. 500 మంది అనువుగా  సమావేశం నిర్వహించుకునేలా అడిటోరియాన్ని నిర్మించారు.

 మొదటి, రెండో అంతస్తులు ఒక్కొక్కటి 53 వేల 740 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణాలు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్‌ పర్యటన ఉన్న నేపథ్యంలో ఎక్కడ పనులు పెండింగ్‌లో ఉండవద్దు అని చెప్పడంతో ఆదిశగా అధికారులు సంబంధిత ఎజెన్సీతో వేగంగా పనులను పూర్తి చేయిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసిన గదులకు పర్నిచర్‌ తదితర సామగ్రిని చేరవేస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్ల కా ర్యాలయాలతోపాటు సమావేశ మందిరాలకు కేటాయించారు. మొదటి, రెండో అంతస్తులలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ప్రధాన కార్యాలయాలకు గదులను కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలోని 34 శాఖలకు పైగా  గదులను కేటాయించారు. మంత్రి కోసం ప్రత్యేకంగా ఒక మీటింగ్‌ హాల్‌తో పాటు ప్రత్యేక ఛాంబర్‌ను కేటాయించారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్ల కోసం జీప్లస్‌ - 1 భవనాలను నిర్మించారు. కలెక్టర్‌ భవనం  6,006 చదరపు అడుగుల విస్తీర్ణంలో, జాయింట్‌  కలెక్టర్ల భవనం 2,877చదరపు అడుగుల విస్తీర్ణంలో,  అదనపు కలెక్టర్‌ భవనం 2,129 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. జిల్లాలోని ముఖ్యమైన 8 శాఖల జిల్లా అధికారులకు  6,434 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీప్లస్‌ -1 పద్ధ్దతిలో నాలుగు భవనాలను  ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. కార్యాలయాల్లో సిబ్బందితో పాటు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుం డా ఉండేందుకు ప్రత్యేక లిఫ్టులను ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రజలు, సందర్శకులకు వేర్వేరుగా వాహనాలు నిలుపు స్థలాలను(పార్కింగ్‌) కేటాయిస్తున్నారు. పచ్చదనంతోపాటు ఆహ్లాదభరితంగా ఉండే విధంగా ఉద్యానవనాలను పెంచుతు న్నారు. హైవేను తలపించేలా అంతర్గత రోడ్లను నిర్మించారు. పచ్చని పార్కులను ఏర్పాటు చేశారు. నీటి వసతి కోసం ఎక్కడి కక్కడ డ్రిప్‌ సౌకర్యం ఏర్పాటు చేసి నీటిని అందిస్తున్నారు. 

సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ భవనం..


సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. చిన్నచిన్న మిగిలిన పనులను పూర్తి చేసే పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. సుమారు 20 ఎకరాల్లో 58,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కమిషనరేట్‌ భవనాన్ని జీప్లస్‌-2 పద్ధ్దతిలో పూర్తి చేశారు. అత్యాధునికమైన టెక్నాలజీ, నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణ పనులు జరిగాయి. 6 ఎకరాల విస్తీర్ణంలో కమిషనర్‌ రెసిడెన్సీ, క్యాంపు కార్యాలయం, క్వార్టర్స్‌ తదితర వాటిని నిర్మిస్తున్నారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌  భవనం అన్ని హంగులతో రూపుదిద్దుకుంది.  

VIDEOS

logo