బుధవారం 24 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 05, 2021 , 00:20:15

'పల్లె' వించే 'ప్రగతి'

'పల్లె' వించే 'ప్రగతి'

  • గ్రామాల సమగ్రాభివృద్ధికి నిధులు
  • 16 నెలల్లో పంచాయతీలకు రూ.172.11 కోట్లు
  • మారుతున్న గ్రామాల రూపురేఖలు
  • పరిశుభ్రంగా.. ఆహ్లాదకరంగా మారుతున్న పల్లెలు

పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. సమగ్రాభివృద్ధికి సర్కారు నెలనెలా నిధులు విడుదల చేస్తుండడంతో అందంగా తయారవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని పంచాయతీలకు 16 నెలల్లో రూ.172.11 కోట్ల నిధులు వచ్చాయి. ఇవే కాకుండా గ్రామాలకు ఇతర అభివృద్ధికి నిధులు అదనంగా వస్తున్నాయి. నిధుల వరద పారుతుండడంతో పల్లెలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.

- సిద్దిపేట ప్రతినిధి, జనవరి 4 (నమస్తే తెలంగాణ)

సిద్దిపేట ప్రతినిధి, జనవరి 4, (నమస్తే తెలంగాణ) : ఇదివరకు పల్లెల్లో సమస్యలు రాజ్యమేలివి. ఎక్కడి చెత్త అక్కడే.. ఎక్కడి మురికి నీరు అక్కడే.. అన్న చందంగా ఉండేది. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం అమలు కావడంతో ప్రస్తుతం సమస్యలన్నీ సమసిపోయాయి. గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌ను అందించి, నిత్యం ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. ప్రతి పల్లెలో డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేసి, సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు సేంద్రియ ఎరువు వేసి, నీరు పెట్టడంతో పచ్చగా ఎదుగుతూ కళకళలాడుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా పచ్చనిహారంగా హరితహారం మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలో 499 గ్రామపంచాయతీలు ఉన్నాయి. పల్లెలను పరిశుభ్ర వాతావరణంలో ఉంచేందుకు సీఎం కేసీఆర్‌ ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని 2019 అక్టోబర్‌లో ప్రారంభించారు. ప్రతి నెలా ప్రత్యేక నిధులను విడుదల చేస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామాల్లో జవాబుదారీ తనం పెరిగింది. ప్రతి పని పూర్తి వివరాలను యాప్‌లో పొందుపరుస్తున్నారు.

ప్రతి నెలా నిధులు.. 

ప్రతి నెలా గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నది. టంచన్‌గా నిధులు వస్తుండడంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. 2019 అక్టోబర్‌లో రూ.13.18 కోట్లు, నవంబర్‌లో రూ.13 .18కోట్లు, డిసెంబర్‌లో రూ.12.52 కోట్లు, 2020 జనవరిలో రూ.12.85 కోట్లు, ఫిబ్రవరిలో రూ.13.84కోట్లు, మార్చిలో రూ.12.85కోట్లు, ఏప్రిల్‌లో రూ.11.23 కోట్లు, మేలో రూ.11.23 కోట్లు, జూన్‌లో రూ.11.23 కోట్లు, జూలైలో రూ.10.11కోట్లు, ఆగస్టులో రూ.10.11 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.10.11 కోట్లు, అక్టోబర్‌లో రూ.10.10 కోట్లు, నవంబర్‌లో రూ.10.10కోట్లు, డిసెంబర్‌లో రూ10.10 కోట్లు విడుదలయ్యాయి. మొత్తంగా ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా రూ. 172.11 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటితో ఆయా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు.  

ప్రతి రోజు మానిటరింగ్‌ చేస్తున్నాం.. 

రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా గ్రామపంచాయతీలకు నిధులను విడుదల చేస్తున్నది. పారిశుధ్య కార్యక్రమాలతో పాటు పచ్చదనం తదితర వాటికి నిధులను కేటాయిస్తున్నాం. ప్రతి రోజు మానిటరింగ్‌ చేస్తున్నాం. పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రతి పనిని యాప్‌లో పొందుపర్చడం జరుగుతుంది.  నిత్యం ఇంటింటికి వెళ్లి ట్రాక్టర్లతో చెత్తను సేకరించి, డంపింగ్‌ యార్డులకు తరలించి, సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. అట్టి ఎరువును హరితహారంలో నాటిన మొక్కలకు వేయిస్తున్నాం.

- సురేష్‌బాబు, సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారి 


VIDEOS

logo