శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Jan 05, 2021 , 00:20:09

రారండోయ్‌.. వేడుక చూద్దాం

రారండోయ్‌.. వేడుక చూద్దాం

  • ఈ నెల 10న కొమురవెల్లి మల్లన్న కల్యాణం
  • రెండు రోజుల పాటు మహోత్సవం
  • ఏర్పాట్లు పూర్తి చేసిన పాలకవర్గం
  • పలువురికి ఆహ్వానం
  • బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

చేర్యాల, జనవరి 4 : భక్తుల కొంగు బంగారం కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి కల్యాణ మహోత్సవం జనవరి 10వ తేదీన (ఆదివారం) నిర్వహించనున్నారు. ఈ కల్యాణోత్సవానికి తెలంగాణ రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. ఆలయవర్గాలు స్వామి వారి కల్యాణ ఆహ్వాన పత్రికలను మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, దాతలు, భక్తులకు అందజేస్తున్నారు. స్వామివారి క్షేత్రంలో నిర్వహించే ఈ మహోత్సవాన్ని కనులారా చూసి తరలించాలని ఆలయవర్గాలు కోరుతున్నాయి.

రెండు రోజుల పాటు పెళ్లి వేడుకలు

స్వామి వారి కల్యాణోత్సవ వేడుకలను ఆలయవర్గాలు రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 10న (ఆదివారం) ఉదయం 5 గంటలకు స్వామి వారికి దృష్టి కుంభం (బలిహరణం), 10-45 గంటలకు స్వామి వారి కల్యాణం, మధ్యాహ్నం 12గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 7 గంటలకు రథోత్సవం (బండ్లు తిరుగుట). 11వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్షభిల్వార్చన, అనంతరం మహ మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, మహ మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు ఆహ్వాన ప్రతిక..

చేర్యాల, జనవరి 4 : జనవరి 10న నిర్వహించే కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ ఈవో ఏ.బాలాజీ సోమవారం ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ సభ్యుడు విద్యాసాగర్‌, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజుచందు తదితరులున్నారు.

బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం

  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల, జనవరి 4 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే సోమవారం మల్లన్న క్షేత్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన నిర్వహించే మల్లికార్జునస్వామి వారి కల్యాణానికి తరలివచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. మల్లన్న క్షేత్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉన్నదని, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లల్లో ఒక్కదానికి మల్లన్న సాగర్‌గా నామకరణం చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలపై ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు శ్రద్ధ వహించాలని కోరారు. మల్లన్న కల్యాణోత్సవం అనంతరం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం (పట్నం వారం) సందర్భంగా వేలాదిగా భక్తులు తరలివస్తారని, అందుకోసం భక్తులకు సేవలందించేందుకు ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పోలీస్‌ బొమ్మ నుంచి మల్లన్న చెరువు వరకు రోడ్డు వెడల్పు చేయాలని, రథోత్సవం నిర్వహించేందుకు వీలుగా సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ తలారి కీర్తనకిషన్‌, జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, కొమురవెల్లి సర్పంచ్‌ సార్ల లతకిష్టయ్య, ఆలయ మాజీ డైరెక్టర్‌ ముత్యం నర్సింహులు, మాజీ ఎంపీటీసీ మెరుగు కృష్ణ, రాంసాగర్‌ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo