శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Jan 04, 2021 , 00:13:33

జలవనరులు మారిన రూపురేఖలు

జలవనరులు మారిన రూపురేఖలు

  • భారీ, మధ్య, చిన్ననీటి పారుదల శాఖలు ఒకే గొడుగు కిందికి ...
  • ఉమ్మడి జిల్లాలో రెండు ప్రాదేశిక ప్రాంతాలు
  • గజ్వేల్‌, సంగారెడ్డిలలో ఏర్పాటు 
  • గజ్వేల్‌లో ఈఎన్సీగా బాధ్యతలు స్వీకరించిన హరిరామ్‌
  • కాళేశ్వరం ప్రాజెక్టు కింద రిజర్వాయర్లు, కెనాల్స్‌ నిర్మాణం

మెతుకు సీమను సస్యశ్యామలం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే నీటివనరుల శాఖ రూపురేఖలు మార్చుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద రిజర్వాయర్లు నిర్మించి రైతులకు సాగునీటిని అందిస్తున్నది. కాగా, పరిపాలనా సౌలభ్యం కోసం సాగునీటి పారుదల శాఖను పునర్‌వ్యవస్థీకరించింది. భారీ ప్రాజెక్టులను మొదలుకుని చిన్నపాటి చెరువుల నిర్వహణ కూడా పకడ్బందీగా ఉండేలా చర్యలు చేపట్టింది. భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి జలవనరుల శాఖగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉన్నతస్థాయి అధికారులు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెండు ప్రాదేశిక ప్రాంతాలుగా గజ్వేల్‌, సంగారెడ్డిలను ఏర్పాటు చేశారు. ఈఎన్సీలు, సీఈలను నియమిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులను జారీ చేయగా, గజ్వేల్‌ ఈఎన్సీగా బి.హరిరామ్‌ను నియమించగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి సీఈగా వి.అజయ్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు. నీటి పారుదలశాఖలోని వివిధ విభాగాలు ఒకే గొడుగు కిందికి రావడంతో ఈఎన్సీలను, చీఫ్‌ ఇంజినీర్ల పర్యవేక్షణలో ఇక పనులు మరింతగా సులువు కానున్నాయి.

- సిద్దిపేట ప్రతినిధి, జనవరి 3 (నమస్తే తెలంగాణ) 

సిద్దిపేట ప్రతినిధి, (జనవరి 3, నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం సాగు నీటిపారుదల శాఖను పునర్‌ వ్యవస్థీకరించింది. సీఎం కేసీఆర్‌ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశమై వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి జలవనరుల శాఖగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఉమ్మడి మెదక్‌ జల్లాలో రెండు ప్రాదేశిక ప్రాంతాలుగా  గజ్వేల్‌, సంగారెడ్డిలను ఏర్పాటు చేశారు. ఈఎన్సీలను, సీఈలను నియమిస్తూ  ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. గజ్వేల్‌ ఈఎన్సీగా బీ. హరీరామ్‌ను నియమించడంతో శనివారం ఈఎన్సీగా  బాధ్యతలను స్వీకరించారు. సంగారెడ్డి సీఈగా వీ.అజయ్‌ కుమార్‌ను నియమించింది. కాగా తోటపల్లి, గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లు కరీంనగర్‌ ప్రాదేశిక ప్రాంతం పరిధిలోకి వెళ్లాయి. యాదాద్రి జిల్లాలోని ఆలేరు, భువనగిరి, మేడ్చల్‌ జిల్లాలోని మేడ్చల్‌ నియోజకవర్గాలు గజ్వేల్‌ ప్రాదేశిక ప్రాంతం పరిధిలోకి వస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా  పెద్ద ఎత్తున రిజర్వాయర్ల నిర్మాణాలు జరిగాయి. కెనాల్స్‌ తవ్వి కాల్వల ద్వారా గోదావరి జలాలతో చెరువులు, కుంటల నింపారు. మిషన్‌కాకతీయలో చెరువుల పూడికతీత పనులను చేపట్టి చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చారు. దీంతో నీటి పారుదల శాఖలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. 

అంతా జలవనరుల శాఖ కిందే..

ఇదివరకు చిన్న, మధ్యతరహా, భారీ నీటిపారుదల శాఖలుగా ఉన్నాయి. అధికారులు వివిధ విభాగాల కింద పనులు చేశారు. చెరువులు ఒకరు చూస్తే... ప్రాజెక్టులు మరొకరు చూశారు. ఫలితంగా పనుల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకవచ్చి ప్రాదేశిక ప్రాంతాలుగా చేసి ఈఎన్సీలను, చీఫ్‌ ఇంజినీర్ల పర్యవేక్షణలో పనులు జరిగేటట్లు చేయడంతో పనులు మరింతగా సులువు కానున్నాయి. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు, ప్రాజెక్టులు ఇలా అన్ని పనులు చీఫ్‌ఇంజినీర్‌ పరిధిలో ఉంటాయి. వీరి పర్యవేక్షణలో అన్ని పనులు జరుగుతాయి. ఇంతకు ముందు నిధులు మంజారు చేయాలంటే మూడు వివిధ విభాగాల కింద ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉండవు. అంతా జలవనరుల శాఖ కిందనే పనిచేస్తారు. 

గజ్వేల్‌ ప్రాదేశిక ప్రాంతం

గజ్వేల్‌  ప్రాదేశిక ప్రాంతంలోకి  1) సిద్దిపేట, 2) దుబ్బాక, 3) మెదక్‌, 4) నర్సాపూర్‌, 5) గజ్వేల్‌ 6) మేడ్చల్‌, 7) జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలు, 8) భువనగిరి, 9) ఆలేరు  శాసనసభ నియోజకవర్గాలు వస్తాయి. దీని పరిధిలో అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, కొమురవెల్లి మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్లతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు (ప్యాకేజీ 10 నుంచి 14) కెనాల్‌తో పాటు రామాయంపేట కెనాల్‌ సంగారెడ్డి కెనాల్‌ 0-73 కి.మీ వరకు ఉంటుంది. మొత్తంగా అన్ని కలిపి దీని కింద 5.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గంధమల్ల రిజర్వాయర్‌ (ప్యాకేజీ 15) ఆయకట్టు 63 వేల ఎకరాలు, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ (ప్యాకేజీ 16) 1.89 లక్షల ఎకరాలు, జనగామ నియోజకవర్గంలోని కొమురవెల్లి మండలం తపాస్‌పల్లి రిజర్వాయర్‌ కింద 10 వేల ఎకరాలు, హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని కోహెడ మండలం శనిగరం ప్రాజెక్టు, శామీర్‌పేట చెరువుల కింద 12 వేల ఎకరాలు, మెదక్‌ జిల్లా వనదుర్గా ప్రాజెక్టు (ఘనపూర్‌) 22 వేల ఎకరాల ఆయకట్టు వస్తుంది. ఇవి కాకుండా హల్దీవాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్స్‌, మంజీరా నది, చెరువులు, చెక్‌డ్యాంల కింద ఆయకట్టు అంతా వస్తుంది. ఈ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో అన్నీ కలుపుకొని  సుమారుగా 10  లక్ష ల ఎకరాల ఆయకట్టు ఉండనున్నది. 

సంగారెడ్డి ప్రాదేశిక ప్రాంతం

సంగారెడ్డి ప్రాదేశిక ప్రాంతంలోకి 1) నారాయణఖేడ్‌, 2) ఆందోల్‌ ,3) జహీరాబాద్‌, 4) సంగారెడ్డి, 5) నర్సాపూర్‌ నియోజకవర్గంలోని హత్నూర్‌, 6) పటాన్‌చెరువు శాసనసభ నియోజకవర్గాలు వస్తాయి. సింగూరు రిజర్వాయర్‌ కింద 40 వేల ఎకరాలు, నల్లవాగు ప్రాజెక్టు కింద 06 వేల ఎకరాలు, సంగమేశ్వర లిప్టు, బసవేశ్వర లిప్టుల కింద 2.40 లక్షల ఎకరాలు,  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్‌ కెనాల్స్‌ (ప్యాకేజీ 17,18,19) కింద 1.32 లక్షల ఎకరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు సంగారెడ్డి కెనాల్‌ 73వ కి.మీ నుంచి చివరి వరకు. దీనికింద 39వేల ఎకరాలు, హల్దీవాగుపై నిర్మించిన చెక్‌డ్యాములు, మంజీరానది నుంచి మెదక్‌ జిల్లా సరిహద్దు వరకు. దీని కింద 07వేల ఎకరాలు, ఐడీసీ లిప్టు 14 వీటి కింద 11 వేల ఎకరాలు, 3,140 చెరువుల దీనికింద 1.4 2 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ ప్రాదేశిక ప్రాంతం కింద సుమారుగా 6 లక్షల ఎకరాల ఆయకట్టుపైనే ఉండనున్నది.

VIDEOS

logo