శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 03, 2021 , 00:05:25

పల్లకిలో పెండ్లి కూతురు

పల్లకిలో పెండ్లి కూతురు

వేడుకకు వన్నె తీసుకువచ్చే సాధనం

రాజసం ఉట్టిపడేలా వధువు మండపానికి వచ్చే రథం

ప్రాచీన సంప్రదాయానికి పెద్దపీట 

పల్లకిలకు పెరుగుతున్న ఆదరణ 

వేదమంత్రాలు.., పెద్దల దీవెనలు, బంధుమిత్రుల సందడితో వివాహ మహోత్సవాన్ని ఎంతో గొప్పగా జరుపుకొంటారు. వేడుకకు సిద్ధం చేసే మండపం ఎంతో అందంగా ముత్యాల పందిరి వేస్తారు. ఈ పెండ్లి మండపం వద్దకు నవ వధువును పల్లకిలో మోసుకుంటూ తీసుకువచ్చే సాంప్రదాయం వేడుకలా నిర్వహిస్తుంటారు వధువు తరఫునవారు. పల్లకి ఊరేగింపు కొంతకాలంగా కనుమరుగవగా, ప్రస్తుతం ఇదే ట్రెండింగ్‌గా మారుతున్నది. పల్లకిలో పెండ్లి కూతురును మహరాణిలా తీసుకువచ్చేందుకు రకరకాల పల్లకిలు అందుబాటులో ఉంటున్నాయి. ముత్యాలు, రత్నాలు, రంగురంగుల పూలతో , రకరకాల డిజైన్లతో ఉన్న పల్లకిలు నేటి పెండ్లిళ్లకు కొత్త శోభను తీసుకువస్తున్నాయి. నూతన వధువును పెండ్లి పందిరి వద్దకు తీసుకువచ్చే సాధనమైన పల్లకిలపై ఈ వారం సండే స్పెషల్‌...

- కొండపాక, జనవరి 2

కొండపాక, జనవరి 2: ‘పెళ్లంటే పందిళ్లు.. సం దళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు..’ ఇది వివాహాన్ని ప్రతిబింబించే పాట అయితే, ఇవే కాకుండా పల్లకిలో ఊరేగింపులు కూడా కావాలి అంటున్నారు నేటి యువత. పల్లకిలో పెండ్లికూతురు రాణిలా ఉంది.. మహారాణిలా ఉంది.. అని అంటుంటే సంతోషించని వారు ఎవరుంటారు.  ఆడబిడ్డల తల్లిదండ్రులు ఆ మాట వినేందుకు ఎంతో ఉత్సాహం కనబరుస్తున్నారు. అందుకే ఆ ఆనందాన్ని పొందాలని చాలా మంది తమ కూతురును పల్లకిలో ఊరేగించేందుకు ఆసక్తి చూపుతన్నారు. అందుకు తగ్గట్టుగా నగరాల్లో వివాహ వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

ఊహ లోకంలో విహరింపజేసే పల్లకిలు 

 నవ వధువును పల్లకిలో ఎక్కించి సంబురపడిపోయే వారి సంఖ్య పెరిగిపోయింది. పెం డ్లిల వేళ చాలా చోట్ల రకరకాల పల్లకిలు అందుబాటులో ఉంటున్నాయి. మేనా, డోలి పల్లకి ఇలా.. రకరకాల పేర్లతో అందరి అభిరుచులకు తగినట్టుగా వివాహ వేడుకలకు పల్లకిలు సిద్ధంగా ఉంటున్నాయి. ధగధగలాడే రత్నాలు, మంచుపూలను తలపించే తెల్లని ముత్యాలు, రంగురంగుల పూలతో కూడి ఉన్న రత్నాల పల్లకి, ముత్యాల పల్లకి, పూల పల్లరీ ఇలా రకరకాల డిజైన్లతో పాత కాలపు పల్లకిలు నేటి పెండ్లిలకు కొత్తదనపు శోభను తీసుకువస్తున్నాయి. 

కార్లుపోయి పల్లకి వచ్చే..

గతంలో పల్లకిలు పోయి వాటి స్థానంలో పూలతో అలంకరించిన ఖరీదైన కార్లు వచ్చాయి. అయితే, ఇటీవల కొందరు సంప్రదాయ పద్ధతిని అనుసరిస్తూ పల్లకిల వైపు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో కనుమరుగైపోయిందనుకున్న పల్లకి మళ్లీ కండ్లముందు కదలాడుతున్నది. అవి కేవలం పెండ్లి ఊరేగింపు సమయంలో గాక, వధువు పెండ్లి మండపంలోకి వచ్చే సందర్భంలో సరదాగా పల్లకిలో వధువును మండపంలోకి తీసుకువస్తున్నారు. శోభాయమానంగా రూపుదిద్దుకొని ఉన్న పల్లకిలో నూతన దంపతులను అంగరంగ వైభవంగా ఊరేగిస్తున్నారు. 

అందుబాటులో అనేక హంగులు 

వివాహాది శుభాకార్యాలకు పల్లకిలు మాత్రమే కాకుండా నవరత్నాలు, గంగాళాలు, ముత్యాలు, అంబారిలు, గోల్డ్‌ పల్లకీ, హంస పల్లకి, మహారాజా పల్లకి, బగ్గీ (గుర్రం రథం) మేఘాల్లో పెండ్లి  ఇలా.. రకరకాల హంగులు అందుబాటులో ఉన్నాయి. దీంతో పట్నం.. పల్లె అన్న తేడా లేకుండా సాంప్రదాయాలకు ప్రాణం పోస్తూ ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌' అనే మాటను అక్షరాలా నిజం చేస్తున్నారు. జీవితకాలపు మరుపురాని జ్ఞాపకంగా మదిలో నిలిచిపోయేలా వివాహ వేడుకను జరుపుతున్నారు. 

కొత్త ట్రెండ్‌ 

పల్లకి సాంప్రదాయం పాతదే అయినప్పటికీ, ప్రస్తుతం కొత్త ట్రెండ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఇటీవల జరిగే పెండ్లిల్లో వధూవరులను పల్లకిలో ఊరేగించడం ఫ్యాషన్‌గా మారింది. సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పల్లకిలోనూ ముందుకు తీసుకురావడం శుభపరిణామం. పెండ్లిల సమయంలో పల్లకిలతో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. 

-చింతకింది రాము (దుద్దెడ)  

జీవిత కాల జ్ఞాపకం 

పెండ్లి  పల్లకిలు, గుర్రపుబగ్గీలతో జరిగే ఊరేగింపులు జీవితకాలపు మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ప్రస్తుతం వివాహ సయయంలో పల్లకిలకు గిరాకీ పెరిగింది. వినూత్నంగా ఆలోచిస్తూ శుభాకార్యాలలో పల్లకిలను ఉపయోగిస్తున్నారు. బంధుమిత్రుల మధ్య హుందాతనాన్ని కోరుకుంటున్నారు. అందరి అభిరుచులకు అనుగుణంగా అనేక రకాల్లో పల్లకిలు, గుర్రపు బగ్గీలు అందుబాటులోకి వచ్చాయి. 

-బాయికాడి ధర్మేందర్‌ (ఈవెంట్‌ మేనేజర్‌, సిద్దిపేట) 

VIDEOS

logo