సోమవారం 01 మార్చి 2021
Siddipet - Jan 03, 2021 , 00:05:25

చలితో జాగ్రత్త..!

చలితో జాగ్రత్త..!

చలి తీవ్రత వల్ల నారు దెబ్బతినే ప్రమాదం

జాగ్రత్తలు పాటిస్తే చేనుకు చేవ, రైతుకు లాభంఅధికారుల సూచన

నారుమడిలో సస్యరక్షణ చర్యలపై వ్యవసాయ అధికారుల సూచన

నారాయణరావుపేట/సిద్దిపేట అర్బన్‌, జనవరి 2 : అన్నదాతలు యాసంగి సాగులో బిజీబిజీగా గడుపుతున్నారు. నార్లు పోసుకుని, పొలాలను దున్నుకుని సిద్ధం చేస్తున్నారు. నారు మడులను చలి నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల కంటే తగ్గినా, చలి తీవ్రత ఎక్కువైనా, చలి ప్రభావం వల్ల నారు మడుల్లో నారు ఎదుగక పోవడం, ఆకులు పసుపు, ఎరుపు రంగులోకి మారే ప్రమాదం ఉన్నది. కొన్ని సార్లు వరి నారు చనిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తగు జాగ్రత్తలు తీసుకుంటే నారు బాగా ఎదుగుతుందని, దీని వల్ల అధిక పంట దిగుబడిని సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు, శ్రాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నారుమడి సస్యరక్షణ చర్యలు..  

నారుమడిలో సేంద్రియ ఎరువులు వర్మీ కంపోస్ట్‌, గొర్రెలు లేదా పశువుల ఎరువును 2 గుంటల నారుమడికి 2 క్వింటాళ్లు వేసుకుని కలియ దున్నుకోవాలి. దీని వల్ల పైరు త్వరగా ఎదుగుతుంది.

రాత్రి వేళలో నారుమడిలో నీరు నిల్వ ఉంచి తెల్లవారుజామున నీరు తీసివేసి కొత్త నీరు పెట్టాలి.

పగటి పూట వెచ్చటి నీటిని పెట్టి, సాయంత్రం వేళలో  నీరు తీసివేసి పెడుతూ ఉండాలి. 

ఒక అడుగు ఎత్తులో వెదురు బద్దలు లేదా ఇనుప ఊచలు అమర్చి దాని మీద సన్నటి ప్లాస్టిక్‌ షీటు లేదా రైతులు నూర్చిడికి వాడే పట్టాలు సాయంత్రం వేళ మొక్కలపై కప్పి, మరల ఉదయం తీసివేయాలి. 

జింకులోపం వల్ల ఆకులపై తుప్పుమచ్చలు ఏర్పడుతాయి. కావునా జింకు సల్ఫేట్‌ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 

నారు ఆరోగ్యంగా పెరగడానికి యూరియా వేస్తున్నప్పుడు ఒక కిలో యూరియాకి 2 గ్రాముల కార్బెండాజిమ్‌+మాంకోజెబ్‌ మిశ్రమ మందును కలిపి పిచికారీ చేయాలి.

కాండం తొలుచు పురుగు బారి నుంచి కాపాడుకోవడానికి కార్బోపురాన్‌ 3జీ గుళికలు ఎకరాకు సరిపడే నారు మడికి ఒక కిలో చొప్పున చల్లాలి.

చలి తీవ్రత ఎక్కువగా ఉండి మంచుతో కూడిన వాతావరణం ఉన్నచో అగ్గి తెగులు ఆశించకుండా ముందు జాగ్రత్తగా ట్రైసైక్లోజోల్‌ 0.6 గ్రాములు లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలి.

నారు ఆరోగ్యంగా పెరగడానికి యూరియా వేసినప్పుడు ఒక కిలో యూరియాకి 2గ్రా. కార్చెండా జిమ్‌, మాంకోజెబ్‌ మిశ్రమ మందును వేసుకోవాలి. 

నారు ఎదుగుదల తక్కువ.. 

చలి తీవ్రత అధికంగా ఉండడం వల్ల నారు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మంచు ప్రభావంతో నారు చనిపోయే ప్రమాదం ఉన్నందున, నారుమడిపై పాలిథిన్‌ కవర్‌ను ఉంచాలి. జాగ్రత్తలు, మెళకువలు పాటిస్తే నారుమడి దెబ్బతినకుండా, తెగుళ్లు సోకకుండా ఉంటుంది. ఆరోగ్యమైన నారుమడితో అధిక దిగుబడి సాధించవచ్చు. 

- విద్యాకర్‌, నారాయణరావుపేట మండల వ్యవసాయాధికారి 

జాగ్రత్తలు తప్పనిసరి...

వరి నారుపై చలి ప్రభావం పడకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే నారు ఎదుగకపోవడంతోపాటు తెగుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. ఉదయం, సాయంత్రం నీటిని మార్చుతూ ఉండాలి. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించి వరి నారు మడులను ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి.  

- పరుశరాంరెడ్డి, సిద్దిపేట మండల వ్యవసాయ అధికారి 

VIDEOS

logo