న్యూ ఇయర్ జోష్

కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
కిటకిటలాడిన ఆలయాలు
సందడిగా పర్యాటక ప్రాంతాలు
ప్రముఖులకు శుభాకాంక్షల వెల్లువ
తీపి,చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2020 సంవత్సరానికి వీడ్కోలు పలికిన ప్రజలు, కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. 2021 సంవత్సరం అన్నివిధాలుగా కలిసి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆలయాలు, ప్రార్థనా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలను దర్శించుకున్న భక్తులు, కొత్త ఏడాది అన్నివిధాలుగా అనుకూలంగా ఉండాలని దేవుడిని వేడుకున్నారు. కొత్త ఏడాది తొలిరోజును సరదాగా గడిపేందుకు జనం ఉత్సాహం చూపడంతో పర్యాటక ప్రాంతాలు సందడిగా మారాయి. ప్రముఖులను పలువురు కలిసి కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. -నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 01
కొత్త ఏడాది కలిసి రావాలి..
ఆలయాలను దర్శించుకున్న భక్తులు
జనసంద్రంగా ఏడుపాయల..
పాపన్నపేట,జనవరి 1 : నూతన సంవత్సరం వేల శుక్రవారం ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని రీతిలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఏడుపాయల ఒక చిన్న పాటి జాతరను తలపించింది. వీఐపీ లైన్ ద్వారానే అమ్మవారిని దర్శించుకోవడానికి సుమారు రెండు నుంచి మూడు గంటల టైం పట్టింది. ఈ సందర్భంగా వనదుర్గాభవానీమాతను సైతం అరటి ఆకులతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటించేలాగా ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్, ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి , ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ ఏర్పాటు చేయగా వేద బ్రాహ్మణులు నరసింహాచారి, శంకరశర్మ,పార్థివశర్మ, రాజశేఖర్‌శర్మ, రామశర్మ ప్రత్యేక ప్రజలు నిర్వహించారు. మెదక్ ఆర్డీవో సాయిరాం సకుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై సురేశ్ తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.
కేతకీలో పూజలు..
ఝరాసంగం, జనవరి 1 : ఝరాసంగంలో అష్టతీర్థాలకు నిలయమైన పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో నూతన సంవత్సరం మొదటి రోజు భక్తులు పోటెత్తారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయం గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వరస్వామికి దంపతులు అభిషేకాలు, అర్చనలు, కుంకుమ, ఆకు పూజలు చేశారు. దర్శనం తర్వాత భక్తులు ఆలయ ప్రాంగణం చుట్టూ గడ్డ జ్యోతితో తలపై పెట్టుకుని ప్రదక్షణలు చేశారు.
వర్గల్, నాచగిరి ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
వర్గల్ , జనవరి 1 : గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్ మండల కేంద్రంలోని విద్యాసరస్వతీ ఆలయం, నాచారం లక్ష్మీనరసింహ్మస్వామి దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి పూజలు నిర్వహించారు.
కొండపోచమ్మ ఆలయంలో ..
జగదేవ్‌పూర్ జనవరి 1 : మండలంలోని తీగుల్ నర్సాపూర్ కొండపోచమ్మ దేవాలయం శుక్రవారం భక్తులతో సందడిగా కనిపించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ జంటనగరాలతో పాటు సిద్దిపేట వరంగల్ జనగామ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొని కొండపోచమ్మకు చేరుకున్నారు. బోనంతో ఊరేగింపుగా నృత్యాలు చేస్తూ వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో వంటావార్పులో పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్త్తూ ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు.
మెదక్ చర్చిలో ప్రార్థనలు
మెదక్ టౌన్, జనవరి 1 : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి నుంచే పర్యాటకులు, భక్తులతో సందడిగా మరింది. చర్చి ప్రాగంణం ఏసు నామస్మరణతో మార్మోగింది. నూతన శోభ సంతరించుకున్నది. మెదక్ బిషఫ్ రైట్రెవరెండ్ సాల్మన్ రాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేకప్రార్థనలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు, సందర్శకులు కుటుంబ సభ్యులు యువతీ, యువకులు విద్యార్థులు చర్చి ఎదుట ఉత్సాహంగా సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సంబురపడ్డారు. చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి రెవరెండ్ అండ్రూస్ ప్రేమ్‌సుకుమార్, మత గురువులు విజయ్ కుమార్, దయానంద్, రాజశేఖర్, ఐవన్ అనుగ్రహం పాల్గొన్నారు.
కోమటి చెరువుకు.. కొత్త శోభ
నూతన సంవత్సరం 2021 తొలిరోజున సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు సందర్శకులతో కళకళలాడింది. పట్టణ ప్రజలతోపాటు పర్యాటకులు అత్యధికంగా రావడంతో ఈ మినీ ట్యాంక్‌బండ్‌కు కొత్త ఏడాది శోభ సంతరించుకున్నది. చెరువు పరిసరాల్లోని పార్కులో చిన్నాపెద్ద అంతా సందడి చేశారు. ఎంతో ఆకట్టుకుంటున్న తీగల వంతెనపై సెల్ఫీలు తీసుకున్నారు. చెరువులో ఏర్పాటు చేసిన బోట్, స్టీమర్‌పై వెళ్తూ షికారు చేశారు. హాలీడే స్పాట్‌గా మారిన ఈ ప్రాంతంలో ప్రజలు సరదాగా గడుపుతూ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు. చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ పర్యాటకులు సందడి చేశారు.
తాజావార్తలు
- మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు
- దేశీ వ్యాక్సిన్ : బీజేపీ ఆరోపణలు తోసిపుచ్చిన పంజాబ్ సీఎం
- ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. పరిటాల శ్రీరామ్‌పై కేసు
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు.. ఒకరు మృతి
- శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన ఇద్దరికి యూకే స్ట్రెయిన్
- తాత అదుర్స్.. వందేళ్ల వయసులోనూ పని మీదే ధ్యాస
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం