గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 01, 2021 , 01:14:36

అభివృద్ధిలో సిద్దిపేట దూకుడు

అభివృద్ధిలో సిద్దిపేట దూకుడు

  • రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాకు ప్రత్యేక స్థానం 
  • కాళేశ్వరంతో జిల్లాకు గోదావరి జలాలు
  • పర్యాటక ప్రాంతాలుగా కొండపోచమ్మ, రంగనాయక సాగర్
  • ‌కొత్త సంవత్సరంలో మల్లన్నసాగర్‌లోకి గోదారమ్మ
  • ఐటీ టవర్లతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు
  • సరికొత్త హంగులతో సమీకృత కలెక్టరేట్‌ భవనం
  • 24వ మండలంగా ధూళిమిట్ట మండలం ఆవిర్భావం

సిద్దిపేట, డిసెంబర్‌ 31, నమస్తే తెలంగాణ ప్రతినిధి: 2020 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. 2021 సంవత్సరానికి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. 2020 ఏడాది అనేక ఆటుపోట్లను అన్నివర్గాల ప్రజలు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది జిల్లాకు ఉజ్వల భవిష్యత్‌ ఉండాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. జిల్లా నుంచి సీఎం కేసీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక, కొండపోచమ్మ రిజర్వాయర్లను పూర్తి చేసుకోవడంతో 2020లో గోదావరి జలాలు జిల్లాను ముద్దాడాయి. మార్చిలో అన్నపూర్ణకు, ఏప్రిల్‌లో రంగనాయక సాగర్‌కు, మేలో కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి  గోదావరి జలాలు వచ్చాయి. కొండపోచమ్మ రిజర్వాయర్‌లో పంప్‌లను సీఎం కేసీఆర్‌, త్రిదండి చినజీయర్‌ స్వామి, మంత్రి హరీశ్‌రావుతో కలిసి ప్రారంభించారు. రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ పంప్‌లను ఏప్రిల్‌ 23న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి హరీశ్‌రావుతో కలిసి ప్రారంభించారు. గతేడాది ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దుంకాయి. పిల్ల కాల్వల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూ గర్భజలాలు గణనీయంగా పెరగడంతో పంటల దిగుబడి భారీగా వచ్చింది. ఈ ఏడాది మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. దీంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాను గోదావరి జలాలు ముద్దాడనున్నాయి. కొండపోచమ్మ ముంపు గ్రామాల ప్రజలకు తున్కిబొల్లారం వద్ద ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మించి అందజేశారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలకు గజ్వేల్‌ పట్టణం ముట్రాజ్‌పల్లి వద్ద ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 10న సిద్దిపేటలో మెడికల్‌ కళాశాల భవనంతోపాటు సిద్దిపేట కేసీఆర్‌ నగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. దుద్దెడ శివారులో ఐటీ హబ్‌కు భూమి పూజచేశారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌, పోలీస్‌ కమిషనర్‌ భవనాలను ప్రారంభించుకోనున్నాం. కొత్త సంవత్సరంలో సిద్దిపేట జిల్లా మరింతగా అభివృద్ధి చెందనున్నది.

ఈ ఏడాది పూర్తికానున్న మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ 

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. కొత్త సంవత్సరంలో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను తీసుకువచ్చేందుకు ముమ్మరంగా పనులు చేపట్టనున్నారు. ఈ రిజర్వాయర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ముంపు గ్రామాల ప్రజలకు ఇవ్వాల్సిన పరిహారాన్ని గ్రామాల్లోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి అందజేశారు. ముంపు గ్రామాల కోసం గజ్వేల్‌ పట్టణం ఆనుకొని ముట్రాజ్‌పల్లి వద్ద ఆర్‌అండ్‌ కాలనీలను నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా పూర్తి కావచ్చాయి. త్వరలోనే ముంపు గ్రామాల ప్రజలకు వీటిని అందించనున్నారు.

రంగనాయక సాగర్‌ అద్భుత పర్యాటక ప్రాంతం 

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకంగా నిర్మించిన రంగనాయక్‌ సాగర్‌ ప్రాజెక్టు అద్భుత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందనున్నది. మూడు టీఎంసీల సామర్థ్యంలో ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. డిసెంబర్‌ 10న సీఎం కేసీఆర్‌ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ ప్రాజెక్టు మధ్యలో రూ.8కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం గెస్ట్‌హౌస్‌ నిర్మించారు. గెస్ట్‌హౌస్‌ను సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. రంగనాయక్‌ సాగర్‌ ప్రాంతం రానున్న రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందనున్నదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. వేలాది మంది పర్యాటలకు వస్తారని ఈ క్రమంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా దీనిని తీర్చిదిద్దాలని సీఎం అధికారులకు సూచించారు. మధ్యలో మరో 45 ఎకరాల వరకు భూమి ఉన్నది. అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్‌ రూ. 100 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే రోజు వారీగా వేలాది మంది రిజర్వాయర్‌ వద్దకు వస్తున్నారు. ఉదయం పట్టణ ప్రజలు వాకింగ్‌ చేస్తున్నారు.

24వ మండలం ధూళిమిట్ట

సిద్దిపేట జిల్లాలో కొత్తగా ధూళిమిట్ట మండలం ఏర్పటైంది. దీంతో జిల్లాలో మండలాల సంఖ్య 24కు చేరింది. సిద్దిపేట జిల్లా 22 మండలాలతో ఏర్పాటైంది. తర్వాత నారాయణరావుపేట మం డలం ఏర్పటైంది. 2020లో ధూళిమిట్ట మండలంతో ఏర్పాటుతో మొత్తం 24కు చేరాయి. మద్దూరు మండలంలోని ధూళిమిట్ట, జాలపల్లి, కొండాపూర్‌, భైరాన్‌పల్లి, బెక్కల్‌, కూటిగల్‌, తోర్నాల, లింగాపూర్‌ 8 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ కొత్త మండలంగా ఏర్పాటు చేశారు. డిసెంబర్‌ 17న మండలం ఆవిర్భవించింది. ఆర్థిక శాక మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శాసనమండలి చీప్‌విప్‌ బోడెకుంటి వెంకటేశ్వర్లు ఆవిర్భావ సభకు హాజరై తాత్కాలిక భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించారు. మద్దూరు మండలంలోని అర్జున్‌పట్ల, కమలాయపల్లి గ్రామాలను చేర్యాల మండలంలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ రెండు గ్రామాలు చేర్యాల మండలంలో కలిసిపోయాయి.

సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ భవనం


సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. సుమారుగా 20 ఎకరాల విస్తీర్ణంలో 58,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కమిషనరేట్‌ కార్యాలయ భవన నిర్మాణాన్ని జీప్లస్‌-2 పద్ధతిలో పూర్తి చేశారు. అత్యాధునికమైన టెక్నాలజీ నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణ పనులు జరిగాయి. 6 ఎకరాల విస్తీర్ణంలో కమిషనర్‌ రెసిడెన్స్‌, క్యాంపు కార్యాలయం, క్వార్టర్స్‌ తదితర వాటిని నిర్మిస్తున్నారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయ భవనం అన్ని హంగులతో రూపుదిద్దుకుంది. గజ్వేల్‌ నియోజకవర్గంలో మర్కూక్‌ మండల కేంద్రంలో  నిర్మించిన మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ను డిసెంబర్‌ 11న హోం మంత్రి మహమూద్‌ అలీ, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

ఐటీ హబ్

‌ సిద్దిపేట రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నది. నాగులబండ వద్ద రాజీవ్‌ రహదారిని ఆనుకొని ఉన్న 668 సర్వే నంబరులోని మూడెకరాల సువిశాల 60 వేల చదరపు అడుగుల వైశాల్యంలో రూ.45 కోట్లతో జీప్లస్‌-5 అంతస్తులతో ఐటీ టవర్లు రూపుదిద్దుకోనున్నాయి. ఈ పనులకు సీఎం కేసీఆర్‌ డిసెంబర్‌ 10న శంకుస్థాపన చేశారు. పలు కంపెనీలతో ఒప్పందాలపై ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ సంతకాలు చేశారు. ఇందులో జోలాన్‌ టెక్నాలజీ, విసాన్‌ టెక్‌, ఎంబ్రోడ్స్‌ టెక్నాలజీ, సెట్విన్‌ కంపెనీలు ఉన్నాయి. వెయ్యి మంది నిరుద్యోగులకు అవకాశాలు కల్పించేందుకు ఈ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ ఐటీ టవర్లు సిద్దిపేటకు ఐకాన్‌గా మారనున్నాయి. ప్రపంచం ఐటీ వైపు పరుగుతీస్తున్న సమయంలో సిద్దిపేట ఐటీ పార్కు మంజూరు కావడంతో సిద్దిపేట పట్టణం ఐటీ రంగంలో దూసుకుపోనుంది. ఐటీ టవర్ల ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. 

సరికొత్త హంగులతో సమీకృత కలెక్టరేట్‌ భవనం

 

సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులు పూర్తి చేశారు. కొత్త సంవత్సరంలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించేందుకు  ఏర్పాట్లు చేపడుతున్నారు. సుమారుగా 50ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఆధునిక వసతులతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పూర్తయ్యింది. 1, 61,220 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీప్లస్‌ - 2 పద్ధతిలో సుమారు 46 శాఖలకు సరిపడే విధంగా భవన నిర్మాణం జరిగింది. 3 సెమినార్‌ హాళ్లు, ఆధునిక వీడియో కాన్ఫరెన్స్‌ హాళ్లను ఏర్పాటు చేశారు. 500 మంది కూర్చొని సమావేశం నిర్వహించుకునేలా ఆడిటోరియం నిర్మించారు. మొదటి, రెండో అంతస్తులు ఒక్కోటి 53,740 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణాలు పూర్తిచేశారు.మండు వేసవిలో

మత్తళ్లు దుంకిన చెరువులు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయక, కొండపోచమ్మ రిజర్వాయర్లకు గోదావరి జలాలు రావడంతో రైతులు 2020 సంవత్సరంలో సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్లు బోరుబావులు, వర్షాధారంపై ఆధారపడి పంటలు పండించిన రైతులకు మంచి రోజులు వచ్చాయి. బీడు భూముల్లో గోదావరి జలాలు పారించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పం నెరవేరింది. ఏప్రిల్‌ 23న  పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్యేలు రంగనాయక సాగర్‌ పంప్‌హౌజ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి పంప్‌లు ఆన్‌ చేశారు. రంగనాయక సాగర్‌లోకి గోదారమ్మ పరుగులు పెట్టగానే జలసవ్వడులను చూసి మంత్రులు సంబురాలు చేశారు. మండు వేసవిలో సిద్దిపేట, మానకొండూరు నియోజకవర్గంలో చెరువులను నింపి జలహారతులు ఇచ్చారు.

కొండపోచమ్మ రిజర్వాయర్‌


మే 29న కొండపోచమ్మ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్‌, త్రిదండి చినజీయర్‌ స్వామి, మంత్రి హరీశ్‌రావుతో కలిసి మర్కూక్‌ పంప్‌హౌస్‌లో సుదర్శన యాగం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడే పంప్‌హౌస్‌ వద్ద ప్రత్యేక పూజలు చేసి సీఎం కేసీఆర్‌, చినజీయర్‌ స్వామితో కలిసి స్విచ్‌ ఆన్‌ చేసి మోటర్లను ఆన్‌ చేశారు. దీంతో కొండపోచమ్మలోకి గోదావరి జలాలు ఎగిసిపడ్డాయి. గంగమ్మ తల్లికి పూజలు చేశారు. కొండపోచమ్మ దేవాలయ ఆవరణలో నిర్వహించిన చండీయాగం పూర్ణ్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారికి పూజలు నిర్వహించారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ పర్యాటక కేంద్రంగా మారింది. వీకెండ్‌లో హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. 

VIDEOS

logo