దుబ్బాకకు కలిసిరాని 2020

- 2020/ రౌండప్
- చేదు అనుభావాలను మిగిల్చిన 2020 ఏడాది
- మనుషుల మధ్య దూరం పెంచి, దగ్గర చేసిన కొవిడ్-19
- కష్టకాలంలోనూ సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
- దుబ్బాకలో ఎన్నో మార్పులు
దుబ్బాక : 2020 ఏడాది మానవ సమాజానికి ఓ చేదు అనుభవంలా మిగిలిపోనున్నది. కంటికి కనిపించని శత్రువు యావత్ ప్రపంచాన్ని గడగడ వణికించింది. ఇప్పటికీ కొంగొత్త రూపాల్లో పుట్టుకొస్తున్న ఆ వైరస్ మనిషికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. మాయదారి రోగం మానవ సమాజానికి కనీవినీ ఎరుగని అనుభవాలను పంచింది. ఉల్టా పల్టా అన్నట్లు వ్యవస్థలే కుప్పకూలే దుస్థితికి చేరాయంటే అతిశయోక్తి కాదు. కాలు బయట పెట్టడమే ముప్పు అన్నట్లుగా కనోనా వైరస్ తీసుకొచ్చిన సరికొత్త పాఠమై నిలిచింది. ముఖాలకు మాస్క్‌లు ధరించుకుని, మనిషి.. మనిషికి భౌతిక దూరం పెంచింది. లాక్డౌన్ వంటి గడ్డు కాలాన్ని అనుభవించిన ప్రజలు అనేక గుణపాఠాలను నేర్చుకున్నారు. ఇంతటి విపత్కర దుస్థితిలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. సామన్య, పేద ప్రజలకు గడ్డుకాలంలోనూ అండగా నిలిచింది. దుబ్బాక నియోజకవర్గంలో ‘2020’ ఏడాది వికారాన్ని మిగిల్చింది. కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. రాజకీయంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. దుబ్బాక ఉద్యమ నేత సోలిపేటతో పాటు ఇతర నాయకులు మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబ్బాక శాసనసభ ఉప ఎన్నిక..
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉప ఎన్నికలలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించి పోటీలో దింపారు. నవంబరు 3న జరిగిన శాసనసభ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఉద్యమనేత సోలిపేటతో పాటుపలువురు మృతి..
దుబ్బాక ఉద్యమనేత, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యం బారిన పడి హైదరాబాద్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆగస్టు 6వ తేదీన మృతి చెందాడు. దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో నిర్వహించిన సోలిపేట అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితర మంత్రులతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ సూచనలు తూచ తప్పకుండా పాటించి ఉద్యమాన్ని ఉగ్రరూపం దాల్చటంలో సోలిపేటకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దుబ్బాక (దొమ్మట) శాసనసభ ఎన్నికలలో రామలింగారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా పదవిని అలంకరించారు. ఆ పదవిలో కొనసాగుతూనే ఆయన కన్నుమూశారు.
కాలేశ్వర ముక్తేశ్వర చైర్మన్ వెంకటేశం
కాలేశ్వర ముక్తేశ్వర దేవాలయ చైర్మన్ బొమ్మెర వెంకటేశం సెప్టెంబర్ 9న కరోనాతో మృతిచెందాడు. దుబ్బాక మండలం చెల్లాపూర్‌కు చెందిన వెంకటేశం సీఎం కేసీఆర్‌కు బాల్యమిత్రుడు. వరుసగా రెండోసారి కాలేశ్వర ముక్తేశ్వర దేవాలయ చైర్మన్‌గా నియమితులయ్యారు. పదవిలో కొనసాగుతుండగా, కరోనాతో అతడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
బండి నర్సాగౌడ్..
ఆగస్టు 31న ఆంధ్రప్రదేశ్ గీత పారిశ్రామిక సంఘం మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండి నర్సాగౌడ్ అనారోగ్యంతో మృతిచెందాడు. దుబ్బాక మండలం పోతారెడ్డిపేటకు చెందిన బండి నర్సాగౌడ్ మృతి గీత కార్మికులకు తీరని లోటని చెప్పాలి.
కరోనా కష్టాలు..
కరోనా నివారణ కోసం చేసిన యుద్ధంలో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నియోజకవర్గంలో వైరస్ బారినపడి సూమారు 50 మందికి పైగా మృతి చెందారు. మార్చి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్ నివారణకు ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. ఈ యుద్ధంలో లాక్డౌన్లు, భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్లు, ఐసొలేషన్లు, క్వారంటైన్లు ఎన్నో కొనసాగాయి. పక్క గ్రామాలకు కాదు.. పక్కింటికి కూడా వెళ్లలేని దుస్థితి తీసుకొచ్చింది. తుమ్మినా.. దగ్గినా... భయంతో దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకునే పరిస్థితి నెలకొంది. కరోనాతో మృతి చెందిన పలువురి మృతదేహాలను సైతం తమ కుటుంబీకులు చివరి చూపుకు నోచుకోలేకుండా చేసింది. ఉపాధికోసం పట్టణాలకు వెళ్లిన వారిని సైతం తమ సొంత గ్రామాలకు రప్పించేలా చేసింది. నెలల తరబడి పని లేకుండా చేసి ఆర్థిక ఇబ్బందులకు గురి చేసింది.
విస్తారంగా వర్షాలు..
దుబ్బాక నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చెరువు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టడంతో ప్రయోజనకరంగా మారాయి. నియోజకవర్గంలో కూడవెళ్లి వాగుతో పాటు ప్రతి చెరువు, కుంటల్లో జలకళ సంతరించుకున్నాయి. ఓ పక్క సమృద్ధి వర్షాలు, మరోపక్క మల్లన్నసాగర్ కాల్వల నిర్మాణం తుది దవలో ఉండటంతో రైతులకు సాగు నీటి కష్టాలు తీరాయి.
కరోనా కష్టకాలంలో.. కేసీఆర్ సర్కారు అండ
కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా కేసీఆర్ సర్కారు నిలిచింది. ఉచిత బియ్యంతో పాటు నెలకు రూ.1500 అందజేసి పేదలకు అండగా మారింది. ఇంతటి కష్టకాలంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు. పింఛన్లతో పాటు అన్ని పథకాలు కొనసాగించింది. వలస కార్మికులను కడుపులో పెట్టుకుని నగదుతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసింది. ఇందులో ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసి పేదలకు నిత్యావసర వస్తువులు, తదితర సామగ్రిని అందించి మనోధైర్యన్ని కల్పించింది. గ్రామాల్లో వ్యాపారులు, ఉద్యోగులు సైతం తమవంతు సేవలను కొనసాగించి మానవత్వాన్ని చాటుకున్నారు. మనిషి మనిషికి మధ్యలో దూరం పెంచడమే గాక మనస్సులను దగ్గర చేసిన ఘనత కూడా కరోనాకే దక్కింది.
ఎన్నికలు.. రాజకీయ మార్పులు..
- దుబ్బాక మున్సిపల్ ఎన్నికలు..
దుబ్బాక నియోజకవర్గంలో 2020 సంవత్సరంలో రాజకీయ మార్పులను తీసుకొచ్చింది. దుబ్బాక నగర పంచాయతీలో విలీనమైన దుబ్బాక, లచ్చపేట, ధర్మాజీపేట, చేర్వాపూర్, దుంపలపల్లి, చెల్లాపూర్, మల్లాయిపల్లి గ్రామాల్లో పదేండ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. దుబ్బాక నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడి జనవరి 22న తొలిసారి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మున్సిపల్ పీఠం మహిళకే రిజర్వు కావడంతో.. ఎన్నెన్నో మలుపులు తిరిగి ఊహించని కౌన్సిలర్‌కే చైర్పర్సన్ పట్టం దక్కడం విశేషం.
వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల
- (పీఏసీఎస్) ఎన్నికలు..
దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్ నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఎన్నికలు జరిగాయి. 15 ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో మొత్తం 52 డైరెక్టర్ల పదవులకు గాను 45 టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నాలుగు సహకార సంఘాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుని గులాబీ జెండాను ఎగురవేశారు.