శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 31, 2020 , 00:05:06

పల్లెలకు విస్తరిస్తున్నఆన్‌లైన్‌ షాపింగ్‌

పల్లెలకు విస్తరిస్తున్నఆన్‌లైన్‌ షాపింగ్‌

  • పల్లెలకు పాకిన ఆన్‌లైన్‌ షాపింగ్‌
  • జోరుగా విస్తరిస్తున్న వ్యాపారం
  • మంచి బ్రాండ్ల కొనుగోలుకు ఆసక్తి గ్రామీణుల ఆసక్తి
  • క్యాష్‌ అండ్‌ డెలివరీ...ఇంటి వద్దకే కోరుకున్న వస్తువు 
  • ఆన్‌లైన్‌ షాపింగ్‌కే యువత మొగ్గు
  • ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్న సంస్థలు 

ఆన్‌లైన్‌ వ్యాపారం రోజురోజుకూ విస్తరిస్తూ పల్లెలకు పాకుతున్నది. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆన్‌లైన్‌ షాపింగ్‌పై మక్కువ చూపుతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్‌ అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్‌ వ్యాపారం జోరందుకుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో జోరుగా విస్తరిస్తున్నది. ఇంటి నుంచి కదలకుండానే నచ్చిన వస్తువు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఆఫర్లు, తక్కువ ధరలు చూసి వస్తువులు బుక్‌ చేసుకుంటున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు సైతం ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుని తెప్పించుకుంటున్నారు. యువత ఆసక్తి చూపుతున్నది. కాగా, ఆన్‌లైన్‌ వ్యాపారంతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని సంప్రదాయ వ్యాపార వర్గాలు వాపోతున్నాయి. - దుబ్బాక టౌన్‌

దుబ్బాక టౌన్‌ : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆన్‌లైన్‌ షాపింగ్‌పై రోజు రోజుకు క్రేజు పెరుగుతున్నది. కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఆన్‌లైన్‌ కొనుగోళ్లు..నేడు మారుమూల పల్లెలకు సైతం విస్తరించాయి. ప్రజలు ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు అమితాసక్తిని కనబరుస్తున్నారు. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌లో కోరుకున్న వస్తువును బుక్‌ చేస్తున్నారు. ఇంటి నుంచి కదలకుండానే నచ్చిన వస్తువు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఆఫర్లు, తక్కువ ధరలు చూసి వస్తువులు బుక్‌చేసుకుంటున్నారు. నిత్యావసర సరుకులు మొదలుకొని అవసరాలకు అనుగుణంగా నచ్చిన బ్రాండ్‌తో ఉన్న వస్తువులను ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలు అందించడంతో ప్రజల వద్దకు చేరుతున్నాయి. ఈ ఏడాది కరోనా-లాక్‌డౌన్‌తో చాలామంది దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసేందుకు ఇష్టపడలేదు. కొద్దిరోజులుగా సాధారణ పరిస్థితులు వస్తుండడంతో దుకాణాలకు వెళ్తున్నారు. అయినా ఆన్‌లైన్‌లోనే షాపింగ్‌ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రముఖ ఆన్‌లైన్‌ కంపెనీలైన అమెజాన్‌, ప్లిప్‌కార్డు, ఆజీయో, స్నాప్‌డీల్‌, మింత్రా తదితర కంపెనీలు తాము అమ్మే వస్తువులను ఆన్‌లైన్‌లో ఉంచి, పలు సందర్భాల్లో కొనుగోలుదార్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో వినియోగదార్లు పెద్ద ఎత్తున ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బట్టలు మొదలుకొని ఏ వస్తువు ఎంత ధరలో.. ఎంత నాణ్యతతో ఉందో వివరంగా తమ సైట్లలో అందుబాటులో ఉంచుతుండడంతో కొనుగోలుదారులు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తున్నారు. 

కరోనా ప్రభావంతో పెరిగిన ఆన్‌లైన్‌ కొనుగోళ్లు

కరోనా కారణంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తువులను కొనుగోలు చేయడానికి బయపడుతున్న సమయంలో, ఆన్‌లైన్‌ వ్యాపారానికి మంచి రోజులు వచ్చాయి. ప్రజలు నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేందుకు సైతం మొగ్గు చూపుతున్నారు. ఇంటి వద్ద నుంచే తమకు నచ్చిన వస్తువులను మొబైల్‌ ఫోన్‌లో ఎంపిక చేసుకొని ఆర్డరు చేస్తున్నారు. ప్రజలకు అవసరమయ్యే అన్నిరకాల వస్తువులను ఆన్‌లైన్‌ సంస్థలు అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నాయి. తాము ఆర్డరు చేసే వస్తువు వచ్చిన తర్వాత డబ్బులు చెల్లించి తీసుకునే క్యాష్‌ అండ్‌ క్యారీ సదుపాయం అన్ని ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలు కల్పిస్తున్నాయి. దీంతో తీసుకున్న వస్తువులు తమకు నచ్చకుంటే తిరిగి ఇచ్చే సదుపాయాన్ని కొనుగోలుదార్లకు కల్పిస్తుండడంతో ఆన్‌లైన్‌ బిజినెస్‌ జోరుందుకుంది. అంతే కాకుండా బ్యాంక్‌ల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై ఆన్‌లైన్‌ సంస్థలు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లతో పాటు ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తుండడంతో ప్రజలు ఆన్‌లైన్‌ షాపింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. 

ఆన్‌లైన్‌ షాపింగ్‌ పై యువత ఆసక్తి 

ముఖ్యంగా ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసేందుకు యువతే ఎక్కువ శాతం ఆసక్తి చూపుతున్నారు. తమకు కావాల్సిన వస్తువులను వివిధ ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థల యాప్‌ల ద్వారా మొబైల్‌ ఫోన్‌లో ఎంపిక చేసుకొని కొనుగోలు చేస్తున్నారు. నచ్చిన బ్రాండెడ్‌ వస్తువుల్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆట వస్తువులు, పుస్తకాలు, బట్టలు, షూలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొనుగోలు చేసిన వస్తువులు కేవలం రెండు, మూడు రోజుల్లో ఇంటి వద్దకు చేరవేస్తున్నారు. ఆన్‌లైన్‌ సంస్థలు ఎంపిక చేసుకున్న కేంద్రాల ద్వారా వినియోగదార్లకు అనుకున్న సమయానికి దేశంలోని నలుమూలల నుంచి వస్తువులను చేరవేస్తున్నాయి. ఆర్డరు చేసిన వస్తువుల సరఫరా పై మొబైల్‌కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. 

స్థానిక వ్యాపారులకు నష్టం

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థలు తమ వస్తువులను మారుమూల గ్రామీణ ప్రాంతాలకు అందిస్తుండడంతో స్థానిక వ్యాపారులకు శాపంగా మారింది. నచ్చిన వస్తువును మొబైల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం, అనుకున్న సమయానికి ఇంటి వద్దకు రావడంతో స్థానిక వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుండడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. టూత్‌బ్రష్‌లు మొదలుకొని టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మిషిన్లు, టూవీలర్‌ వరకు కొనుగోలు చేస్తుండడంతో గిరాకీ లేక దుకాణాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలోనే కరోనా వైరస్‌ కారణంగా దుకాణాల కొనుగోళ్లు చాలా తగ్గిపోయాయి. చిన్న చిన్న మండల కేంద్రాల్లో ఉన్న వ్యాపారం పూర్తిగా తగ్గిపోగా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ప్రాంతానికి సిద్దిపేట, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి రోజు వందల సంఖ్యలో ఆర్డరు చేసుకున్న వస్తువులను వివిధ కంపెనీలలు డెలవరీ బాయ్స్‌ ద్వారా అందజేస్తున్నారు. దుబ్బాక ప్రాంతం నుంచి చుట్టుపక్కల ఉన్న మండల్లాలోని గ్రామాల్లో ఆర్డర్‌ చేసిన వారికి డెలవరీ చేసేందుకు 10 మందికి పైగా పార్సిల్‌ బాయ్స్‌ పని చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్‌లో ఆర్డర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని వారంటున్నారు.

ఇలా బుక్‌ చేస్తే.. అలా ఇంటికే

మునిపల్లి : కాలంతో పాటు రోజులు ఎంత లా మారిపోయాయి. ఒకప్పుడు ఏది కావాలన్నా పట్టాణలకు వెళ్లి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం కూర్చున్న దగ్గరే నుంచే మనకు అవసరమైన వస్తువును అన్‌లైన్‌లో షాపింగ్‌ చేసి బుక్‌చేస్తే, నేరుగా హోం డెలివరీ చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ అరచేతిలో ఉంటే చాలు కావాల్సిన వస్తువులు నేరుగా ఇంటికి వచ్చేస్తున్నాయి. కొన్ని రోజులుగా మునిపల్లి మండలంలో ఆన్‌లైన్‌ హోం డెలవరీ ఊపందకుంది. మునిపల్లి మండలంలో అమెజాన్‌, ప్ల్లిప్‌కార్ట్‌,మింత్ర, స్నాప్‌డీల్‌ వాంటి యాప్‌ల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకుంటూ, మండల వాసు లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వస్తువులను నేరుగా ఇంటికి తెచ్చి అందిస్తున్నారు. మునిపల్లి మండలంలో ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా షాపింగ్‌ చేస్తున్న వారు ప్రతి రోజు లక్షల రూపాయలకు సంబంధించిన వస్తువులు హోం డెలవరీ చేస్తున్నట్లు సమాచారం. మండలంలో ఆన్‌లైన్‌ షాపిం గ్‌ చేస్తున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది.   

నచ్చిన వస్తువులు ఇంటి వద్దకే వస్తున్నాయి  

ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసిన వస్తువులు ఇంటి వద్దకే వస్తున్నాయి. దీంతో కొనుగోలు చేయడంలో సమయం ఆదాతో పాటు నాణ్యమైనవిగా ఉంటున్నాయి. ఆర్డర్‌ చేసిన వస్తువులు నచ్చకుంటే తిరిగి ఇచ్చేసి మరో రకమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. పండుగలకు ఆఫర్లు ప్రకటిస్తుండటంతో కొన్ని వస్తువులు తక్కువ ధరకే దొరుకుతున్నాయి. అవసరమున్న అన్ని రకాల వస్తువులు మొబైల్‌ ద్వారానే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నాను. 

-వెంకటేశ్‌, వినియోగదారుడు (దుబ్బాక)

VIDEOS

logo