న్యూ ఇయర్ కానుక

- ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
- ఉద్యోగుల వేతనాలు పెంపు
- ఉద్యోగ విరమణ వయస్సును పెంచిన సర్కారు
- ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపు
- ఉమ్మడి జిల్లాలో 30వేలమంది వరకు ఉద్యోగులకు లబ్ధి
- సీఎం నిర్ణయంతో ఉద్యోగుల్లో హర్షం
- త్వరలో ఉద్యోగాల భర్తీ.. నిరుద్యోగులకు శుభవార్త
సిద్దిపేట, నమస్తే తెలంగాణ/ మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించారు. అంతేకాకుండా ఉద్యోగ విరమణ వయస్సును కూడా పెంచాలని నిర్ణయించారు. మెదక్ జిల్లాలో అన్ని రకాల ఉద్యోగులు కలిపి 7వేల మంది వరకు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో వివిధ శాఖల్లో సుమారుగా 13 వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సుమారుగా 3 వేల మంది వరకు పింఛన్దారులుంటారు. వీరందరికీ వేతనాల పెంపు వర్తిస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సు కూడా వర్తింపజేయనున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల పెంపుతో ఆర్టీసీ సంస్థపై పడే భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలోనే ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్, ఆ మాటకు కట్టుబడి ఉండి ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతున్నట్టు నిర్ణయించారు.
సీఎం నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆనందం..
ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్లో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, సెర్ఫ్, హోంగార్డులు, ఇతర శాఖల్లోని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వీరందరికీ...
ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, పార్ట్‌టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులతోపాటు హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ , ఆశవర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ప్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు పొందుతున్న వారితో పాటు, పింఛనుదారులు, ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆయా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఙతలను తెలుపుతున్నారు. ఉద్యోగుల వేతనాలను పెంచడంతో పాటు ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆయా శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి నియామకాలు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇటీవలనే ఉపాధ్యాయ పోస్టులతో పాటు ఇతర ఉద్యోగాలను నింపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఉద్యోగాల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే ప్రిపేరేషన్ సైతం మొదలు పెట్టారు.
మెదక్ జిల్లాలో 7 వేల ఉద్యోగులకు లబ్ధి..
మెదక్ జిల్లాలో అన్ని రకాల ఉద్యోగులు 6వేల నుంచి 7 వేల వరకు ఉంటారని జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్వాడీ వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు గౌరవ వేతనాలు తీసుకుంటున్న వారితో పాటు పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలగనుంది. మెదక్ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులు 2900 మంది ఉన్నారు. వీరికి లబ్ధి చేకూరనుంది.