శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 28, 2020 , 00:15:44

ఇండ్ల పట్టాలిచ్చి..పట్టుబట్టలు పెట్టి...

ఇండ్ల పట్టాలిచ్చి..పట్టుబట్టలు పెట్టి...

  • 168 మంది లబ్ధ్దిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పట్టాల పంపిణీ
  • సొంతింటి కలను నిజం చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
  • రాజకీయాలకతీతంగా లబ్ధ్దిదారుల ఎంపిక 
  • నాపై సోషల్‌మీడియాలో ఆరోపణలు చేసిన వ్యక్తికీ ఇల్లు కేటాయింపు
  • ఇదీ పారదర్శకతకు నిదర్శనం
  • ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్‌ నగర్‌ కాలనీలోని ఫంక్షన్‌హాల్‌లో నాలుగో విడుతలో 168మంది లబ్ధ్దిదారులకు ఆదివారం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పట్టాలతో పాటు పట్టుబట్టలను కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌తో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైసా ఖర్చు లేకుండా పేదలకు ఇండ్లు కట్టించి ఇస్తున్నట్లు తెలిపారు. పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశామని, సోషల్‌ మీడియాలో తనపై నిత్యం ఆరోపణలు చేస్తున్న ఓ పార్టీ కార్యకర్తకు కూడా ఇంటిని అందించామని, దీనిని బట్టి ఎంత పారదర్శకంగా అర్హులకు ఇండ్లు అందించామో అర్థమవుతుందని మంత్రి అన్నారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ పైప్‌లైన్‌తో కూడిన గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చి మరీ గృహప్రవేశాలు చేయిస్తున్నట్లు  తెలిపారు. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు వస్తాయని, ఎవరూ ఆందోళన చెంద వద్దని మంత్రి భరోసా ఇచ్చారు. 

- సిద్దిపేట రూరల్‌ 

సిద్దిపేట రూరల్‌ : పేద వారి సొంత ఇంటి కలను, ఆశయాన్ని నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణం కేసీఆర్‌ నగర్‌ కాలనీలోని ఫంక్షన్‌హాల్‌లో  నాలుగో విడుతలో 168మంది లబ్ధ్దిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పట్టాలతో పాటు పట్టుబట్టలు జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది ఇల్లు, పెండ్లి. ఇలాంటి రెండు కార్యాలకు తెలంగాణ ప్రభుత్వం సాయం చేస్తున్నదన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా, చాలా డబ్బు ఉన్న వ్యక్తి అయినా ఇల్లు కట్టుకుంటే చివరికి అప్పు ఉంటుందని, కానీ.. పేదవారి కోసం మొత్తం బరువును అధికారులు, కౌన్సిలర్లు మోశారన్నారు. ఒక్క రుపాయి ఖర్చు లేకుండా, ఒక్క చెమట చుక్క పేదవారు చిందించకుండా వారికి పూర్తి ఉచితంగా సకల సౌకర్యాలతో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి అందిస్తున్నట్లు చెప్పారు. లబ్ధ్దిదారులు ఎవరైనా ఒక్క రుపాయి లంచం ఇచ్చినట్లు చెబితే, వారికి రూ.10 వేలు రివార్డు ఇస్తామన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా నిజమైన పేదవారికే ఇండ్లు ఇచ్చాము కాబట్టే, ధైర్యంగా లబ్ధ్దిదారుల లిస్టును ప్రతి వార్డు గోడలపై అతికించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ఇండ్లు నిర్మించి మీకు అందిస్తున్నామని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అన్నారు. మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇండ్లు కిరాయికి ఇచ్చినా, అమ్మినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే బస్తీ దవాఖాన, పోలీస్‌ ఔట్‌ పోస్టుతో పాటు ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఏ ఇంటికీ పైప్‌లైన్‌ గ్యాస్‌ కనెక్షన్‌ లేదన్నారు. కానీ, మీకు పైప్‌డ్‌ గ్యాస్‌ కనెక్షన్‌ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సొంత అన్నదమ్ముల వలే కొత్త బట్టలు పెట్టి మరీ గృహప్రవేశాలు చేయిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కడవేర్గు రాజనర్సు, మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

ఆరోపణలు చేసినా ఇల్లు.. ఇది పారదర్శకతకు నిదర్శనం

సోషల్‌ మీడియాలో తనపై ఎన్నో ఆరోపణలు చేసిన ఓ పార్టీకి చెందిన వ్యక్తికి సైతం ఇల్లు వచ్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. స్వయంగా అతనే వచ్చి నన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపాడన్నారు. పార్టీలకు అతీతంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చామని చెప్పడానికి ఇదే నిదర్శమని మంత్రి అన్నారు. ప్రతిరోజు తనని సోషల్‌ మీడియాలో రాజకీయ ఆరోపణలు చేస్తూ ఉంటానని, డబుల్‌ బెడ్‌రూం ఇల్లుకు దరఖాస్తు చేసుకుంటే ఇల్లు రాదనుకున్నానని, కానీ.. నాకు ఇల్లు వచ్చిందని అతనే చెప్పాడని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అతను పేదవాడు కాబట్టే రాజకీయాలకు అతీతంగా అధికారులు క్షేత్ర పరిశీలన చేసి అర్హుడని తేల్చి ఇల్లు కేటాయించారని గుర్తుచేశారు. ఇల్లు కేటాయించినందుకు అతనే వచ్చి తనకు ధన్యవాదాలు తెలియజేశాడని, నేను ఓ పార్టీకి చెందిన వాడినని చెప్పాడని తెలిపారు. ఇంత పారదర్శకంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రక్రియ చేపట్టామో ఇదే నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 

హరీశ్‌రావు సాబ్‌ ఏక్‌ సెల్ఫీ..

తన సొంతింటి ఆశయాన్ని నెరవేర్చిన ఆత్మీయ అన్న మీరని మంత్రి హరీశ్‌రావుతో లబ్ధ్దిదారులు సెల్ఫీలు దిగారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో.. ఈ జన్మలో సొంతింటిలో ఉంటామా.. ఆ కల సాకారం అవుతుందా.. ఇంట్లో ఎవరైనా చనిపోతే రోడ్డు మీద పడేసే పరిస్థితి నుంచి బయట పడతామా... అనే ఈ కాలంలో మంత్రి హరీశ్‌రావు సొంత అన్నలా మాకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇచ్చి మా కలను నెరవేర్చారని ఓ లబ్ధ్దిదారుడు తెలిపారు. ఇలాంటి ఆనందం ఎన్ని జన్మలు ఎత్తినా దొరకదని, పేద ముస్లిం కుటుంబం వారి ఆనందాన్ని మంత్రి హరీశ్‌రావుతో పంచుకుంటూ... హరీశ్‌రావు సాబ్‌ ఏక్‌ సెల్పీ అంటూ ఆత్మీయ స్వాగతం పలికి ఫొటోలు దిగారు. 

దేశంలో ఎక్కడా ఇలాంటి ఇండ్లు లేవు  :  కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 

దేశంలోని 718 జిల్లాల్లో పేదలకు ఇలాంటి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఎక్కడా లేవని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఆలోచనలకు అనుగుణంగా నర్సపురం కేసీఆర్‌ నగర్‌లో ఇండ్లు నిర్మించామన్నారు. ఇలాంటి డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో నేను భాగస్వామ్యం అయినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్క లబ్ధ్దిదారుడు గర్వపడాల్సిన విషయమని, పూర్తి పారదర్శకంగా ఇండ్ల ఎంపిక జరిగిందన్నారు. మొత్తం 11,506 దరఖాస్తులు రాగా, ఎవరి జోక్యం లేకుండా పూర్తి స్వేచ్ఛతో అత్యంత పారదర్శకంగా అధికారులు చాలా సార్లు తిరిగి లబ్ధ్దిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. 


VIDEOS

logo