మంగళవారం 09 మార్చి 2021
Siddipet - Dec 27, 2020 , 00:09:34

మల్లన్న బ్రహ్మోత్సవాలకు.. ముమ్మర ఏర్పాట్లు

మల్లన్న బ్రహ్మోత్సవాలకు.. ముమ్మర ఏర్పాట్లు

వాల్‌పోస్టర్లతో విస్తృత ప్రచారం

ప్రచారానికి తరలిన 5 బృందాలు

కల్యాణవేదిక, పార్కింగ్‌ స్థలాల చదును

రథోత్సవానికి ఏర్పాట్లు పరిశీలించిన ఈవో, ట్రాన్స్‌కో ఏఈలు

వాల్‌పోస్టర్లతో విస్తృత ప్రచారం

ప్రచారానికి తరలిన 5 బృందాలు

కల్యాణ వేదిక, పార్కింగ్‌ స్థలాల చదును

రథోత్సవానికి ఏర్పాట్లను పరిశీలించిన ఈవో, ట్రాన్స్‌కో ఏఈలు 

చేర్యాల : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు చర్యలు చేపట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖలతో ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆలయ ఈవో బాలాజీ పనులను ప్రారంభించారు. స్వామివారి కల్యాణంతోపాటు 13 వారాలపాటు నిర్వహించే ఉత్సవాలకు సంబంధించిన వివరాలతో ప్రింట్‌ చేసిన వాల్‌పోస్టర్లను ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తోపాటు సిద్దిపేట, హుస్నాబాద్‌, గజ్వేల్‌, జనగామ తదితర ప్రాంతాలకు పంపించారు. ఆయా ఉమ్మడి జిల్లాలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్య కూడళ్లు, కార్యాలయాలు, ప్రధాన ప్రాంతాల్లో నాలుగు రోజులుగా వాల్‌పోస్టర్లు అంటిస్తున్నారు. వాల్‌పోస్టర్లను అంటించేందుకు కొమురవెల్లి మల్లన్న ఆలయం నుంచి ఐదు బృందాలు తరలివెళ్లాయి. ఆలయ ఏఈవో గంగా శ్రీనివాస్‌ కల్యాణ వేదిక, పార్కింగ్‌ స్థలాలను చదును చేయించడంతోపాటు టీటీడీ ధర్మశాలలను శుభ్రం చేయించి, టీటీడీ కల్యాణ వేదిక పరిసరాలను శుభ్రం చేయించారు.

రథోత్సవ ఏర్పాట్లపై పరిశీలన..

కొమురవెల్లి మల్లన్న స్వామివారి కల్యాణోత్సవం అనంతరం రాత్రి రథోత్సవం నిర్వహించేందుకు ఆలయ ఆవరణలో ఉన్న విద్యుత్‌ స్తంభాలు తొలిగింపు, వైర్ల బిగింపు తదితర సమస్యలను తెలుసుకునేందుకు ఆలయ ఈవో, ఏఈవోలు ట్రాన్స్‌కో ఏఈ సత్యం, సిబ్బందితో కలిసి శనివారం పర్యటించారు. వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రథోత్సవం విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఆలయ ఉద్యోగులు, తాత్కాలిక సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

పంపిణీకి శుభలేఖలు సిద్ధం...

స్వామివారి కల్యాణోత్సవానికి సంబంధించిన శుభ లేఖలను పంపిణీ చేసేందుకు ఆలయ వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. 6 వేల శుభలేఖలు ప్రింట్‌ చేయించారు. అందులో 4 వేల మంది దాతలు, భక్తులతోపాటు మిగిలిన వెడ్డింగ్‌ కార్డులను వీఐపీలు, అధికారులకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి దాతలు నిర్మించిన ధర్మశాలలను మరమ్మతులు చేయించే పనులు ప్రారంభించడంతోపాటు ప్రతి గదిలో విద్యుత్‌ దీపాలు, భక్తుల అవసరాలకు ఉపయోగించే నీటి సరఫరా నల్లాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

కమిషనర్‌ ఆమోదానికి టెండర్లు...

ఆన్‌లైన్‌ విధానంలో ప్రారంభించిన టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో వాటిని ఆమోదించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కు నివేదిక పంపిస్తున్నట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు. ఆలయంలో విద్యుత్‌ దీపాలతోపాటు స్వాగత తోరణాలు, కల్యాణ వేదిక వద్ద సుందరీకరణ, తడ్కల పందిర్లు తదితర వాటికి కమిషనర్‌ నుంచి ఆమోదం రాగానే పనులు ప్రారంభించనున్నట్లు ఈవో తెలిపారు.

నో మాస్క్‌.. నో పర్మిషన్‌... 

కొవిడ్‌ నిబంధనల మేరకు స్వామి వారి కల్యాణోత్సవం, ఉత్సవాలు నిర్వహిస్తాం. మాస్క్‌ లేకుండా భక్తులు స్వామివారి దర్శనానికి రావద్దు, మాస్క్‌ లేకుండా వచ్చే వారికి దర్శనానికి అనుమతించం. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డితోపాటు అధికారులు చేసిన సూచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపడుతున్నాం. స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

- బాలాజీ, ఆలయ ఈవో 

VIDEOS

తాజావార్తలు


logo