సోమవారం 08 మార్చి 2021
Siddipet - Dec 25, 2020 , 00:22:12

కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యితో కొత్త ఇంట్లోకి..

కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యితో కొత్త ఇంట్లోకి..

  • జోర్దార్‌ వసతులు.. కొత్తింట్లో అడుగులు
  • నయా పైసా ఖర్చు లేకుండా గూడు లేని పేదలకు ఇండ్లు
  • దశల వారీగా అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం
  • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
  • కేసీఆర్‌ నగర్‌లో 216 మంది లబ్ధిదారుల గృహ ప్రవేశాలు

సిద్దిపేట రూరల్‌ : లబ్ధిదారులకు నయా పైసా ఖర్చు లేకుండా కొత్త బట్టలతో కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యితో పేదలను కొత్తిండ్లకు తోలుతున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్దింటి గృహాలకు దీటుగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్‌నగర్‌ కాలనీలో 216 మంది లబ్ధిదారుల గృహ ప్రవేశాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. దీంతో మహిళలు మంగళహారతులతో మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం పలికారు. లబ్ధిదారులతో మంత్రి గృహప్రవేశాలు చేయించి, వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. మంత్రి అన్ని ఇండ్లు తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి, శుభాకాంక్షలు తెలిపి, మిఠాయిలు తినిపించారు. కొత్త బట్టలు కట్టుకొని, సంబురంగా ఇండ్లలోకి వచ్చామని పలువులు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. అర్హులైన నిరుపేదలకే ఇల్లు దక్కడం చాలా సంతోషంగా ఉందని, సీఎం ఆశీస్సులతోనే నర్సాపూర్‌లో 2460 ఇండ్లు నిర్మించడమే కాకుండా హైదరాబాద్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీ తరహా సకల సౌకర్యాలు కల్పించామన్నారు. మొదటి, రెండు దశల్లో లబ్ధిదారులు ఇండ్లకు చేరగా, ఇప్పుడు 216మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారన్నారు. జోర్దార్‌ వసతులతో నయా పైసా ఖర్చు లేకుండా బహిరంగ మార్కెట్‌లో రూ.15లక్షలు విలువ చేయగల ఇండ్లను పేదలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. మిగిలిన వెయ్యి ఇండ్లకు సంబంధించి పునఃపరిశీలన ప్రక్రియ జరిపి, అర్హులైన వారికి తప్పకుండా ఇండ్లు కేటాయిస్తామన్నారు. కేటాయించిన ఇండ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులదన్నారు. ఇండ్లను కిరాయికి ఇచ్చినా, అమ్ముకున్నా తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, సుడా వైస్‌ చైర్మన్‌ రమణాచారి, మున్సిపల్‌ కౌన్సిలర్లు గ్యాదరి రవీందర్‌, దీప్తి నాగరాజు, నర్సింహులు, లక్ష్మీ శ్రీనివాస్‌గౌడ్‌, గడ్డం విజయరాణి పాల్గొన్నారు.


VIDEOS

logo