బుధవారం 03 మార్చి 2021
Siddipet - Dec 24, 2020 , 00:06:38

బాతాక్‌ బ్రహ్మ బాలయ్య ఇక లేరు

బాతాక్‌ బ్రహ్మ బాలయ్య ఇక లేరు

అనారోగ్యంతో కన్నుమూత 

చివరి శ్వాస వరకు చిత్రకళకే అంకితం 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి 

తెలంగాణ చిత్రాలకు ప్రాణం 

చివరి చూపునకు తరలివచ్చిన కళాభిమానులు.. 

ఆత్మీయులు.. ప్రముఖులు 

సిద్దిపేట టౌన్‌ :  కళ ఏ ఒక్కరికీ సొంతం కాదు.. కానీ కొందరు జీవితాన్ని కళకే అంకితం చేస్తారు.. అలాంటి వారిలో యాసాల బాలయ్య ఒకరు.. తెలుగుజాతి గర్వపడే కళాకారుడు బాతిక్‌ చిత్రాలనే ఇంటి పేరుగా మలుచుకొని అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన కళాదిగ్గజం బాలయ్య(82) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. చివరి క్షణం వరకు చిత్రకళకే తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి. కొంత కాలంగా అనారోగ్యం బారిన పడి హైదరాబాద్‌ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గొప్పచిత్రకారుడిని కోల్పోయిన విషయాన్ని తెలుసుకున్న కళాభిమానులు, కళాకారులు, ఆత్మీయులు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

మధ్యతరగతి కుటుంబం నుంచి.. 

మధ్యతరగతి కుటుంబానికి చెందిన బాలయ్యది నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌ గ్రామం. చిన్నప్పుడే వంటింట్లో గోడలపై కట్టెపుల్లలతో చిత్రాలను గీసేవారు. ఆనాటి నుంచే చిత్రకళపై ఆయన మక్కువ పెంచుకున్నారు. సిద్దిపేటకు వచ్చి విద్యను అభ్యసించాడు. ఎంఏబీఈడీ పూర్తి చేసి డ్రాయింగ్‌ హయ్యర్‌లో శిక్షణ పొందాడు. ప్రభుత్వ టీచరుగా సిద్దిపేట మండలం బూరుగుపల్లిలో నియామకమయ్యాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రవృత్తిగా చిత్రకళను ఎంచుకున్నారు. డా.కాపు రాజయ్య శిష్యుడిగా లలితా కళా అకాడమీ ఆర్థిక సాయంతో విద్యాభూషణ్‌ వద్ద చిత్రకళను అభ్యసించాడు. సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన లక్ష్మాగౌడ్‌ వద్ద బాతిక్‌ చిత్రకళను నేర్చుకున్నారు. దినదిన ప్రవర్తమానంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని తన చిత్రాల ద్వారా చాటారు. 

ప్రదర్శనలు.. అందుకున్న అవార్డులు 

బాతిక్‌ కళతో అందరినీ కట్టిపడేసిన బాలయ్య తెలంగాణ బతుకు చిత్రాలను గీసి సిద్దిపేట ఖ్యాతిని ప్రపంచస్థాయిలో చాటిచెప్పారు. ఆయన గీసిన చిత్రాలు సాలర్‌జంగ్‌ మ్యూజియం, స్టేట్‌ మ్యూజియం, లలితా కళా అకాడమీ, కేంద్ర లలితా కళా అకాడమీలో పొందుపర్చారు. లేపాక్షి ఎంపోరియం, ఇతర రాష్ట్రాల్లోనూ బాతిక్‌ చిత్రాలను ప్రదర్శించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాలయ్య 50 కళాచిత్రాల ప్రదర్శన నిర్వహించారు. అమెరికా తదితర దేశాల్లోనూ బాలయ్య చిత్రాలు అక్కడి ప్రజలను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఆయన గీసిన చిత్రాలకు ప్రశంసలు, 50 వరకు అవార్డులు వరించాయి. అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు, 2016లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. అదే విధంగా న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ర్టాల్లోనూ ఆయన గీసిన చిత్రాలకు అవార్డులు పొందారు. యాసాల బాలయ్యకు నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉంది. చిన్నకొడుకు ప్రకాశ్‌ బాలయ్య బాటలోనే నడుస్తూ డ్రాయింగ్‌ టీచరుగా పని చేస్తున్నారు. అదే విధంగా ఆయన వద్ద నేర్చుకున్న శిష్యులు చాలా మంది బాతిక్‌ చిత్రాల్లో తమదైన ప్రతిభతో రాణిస్తున్నారు. 

ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేసిన బాలయ్య 

కవులు, కళాకారుల నిలయంగా సిద్దిపేట గడ్డ విరాజిల్లుతుంది. బాలయ్య ఉద్యోగ విరమణ తరువాత  ఆర్ట్‌ గ్యాలరీని ఏర్పాటు చేసుకున్నారు. విద్యార్థులకు, శిష్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా చిత్రాలను గీశారు. ప్రధానంగా పల్లె చిత్రాలు గీసి అబ్బురపర్చారు.

రాష్ట్రం గొప్ప చిత్రకారున్ని కోల్పోయింది

 మంత్రి హరీశ్‌రావు సంతాపం

 బాలయ్య మృతితో రాష్ట్రం ఒక గొప్ప చిత్రకారుడిని కోల్పోయిందని, చిత్రకళారంగానికి బాలయ్య మృతి తీరని లోటని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట కీర్తిని తన బాతిక్‌ చిత్రకళా ద్వారా ఖండంతరాలను దాటించిన గొప్ప కళాకారుడు బాలయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. జాతీయ స్థాయిలో బాతిక్‌ చిత్రకారుడిగా పల్లె జీవకళను ఉట్టిపడేలా చిత్రాలను గీసి అంతర్జాతీయంగా తెలంగాణ పల్లె సంస్కృతికి వన్నె తెచ్చారని  కొనియాడారు. బాలయ్యకు, సీఎం కేసీఆర్‌కు, తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాలయ్య సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్‌ 2016లో రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సం దర్భంగా ఉత్తమ అవార్డును అందజేశారన్నారు. బాతిక్‌ చిత్రకారుడిగా రాష్ట్రపతి అవార్డు అందుకున్నారన్నారు.  కుటుంబీకులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  

గొప్ప కళాకారుడిని కోల్పోయాం.. 

 మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు 

బాతిక్‌ చిత్రకారుడు యాసాల బాలయ్య మృతితో సిద్దిపేట ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందని, తన  చిత్రాలతో సిద్దిపేట పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టిన బాలయ్య మృతి, కళారంగానికి తీరని లోటని మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు అన్నారు. బాలయ్య భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  

మంజీర రచయితల సంఘం సంతాపం... 

 బాతిక్‌ చిత్రకారుడు బాలయ్య మృతిపై ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, మంజీర రచయితల సంఘం, టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షుడు కె.రంగాచారి, మంజీర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి సిద్దంకి యాదగిరి, ప్రెస్‌ అకాడమీ సభ్యుడు కొమురవెల్లి అంజయ్య, ఎలక్ట్రానిక్‌ మీడియా విభాగం అధ్యక్షుడు పెద్ది సుభాష్‌లు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ చిత్రకారుడు బాతిక్‌ బ్రహ్మ బాలయ్య చిత్రాలు అజరామరమని ప్రముఖ చిత్రకారుడు రుస్తుం, కవులు అయిత చంద్రయ్య, ఉండ్రాల రాజేశం అన్నారు.  

VIDEOS

logo