బుధవారం 24 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 23, 2020 , 00:23:21

రైతు బీమాతో కొండంత అండ

రైతు బీమాతో కొండంత అండ

భూమి పోలేదు.. అప్పుల బాధ లేదు.. బిడ్డ పెండ్లి రందీ లేదు..

రైతు బీమాతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న బాధిత కుటుంబాలు

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అమలు

రైతు ఏ కారణం చేతనైనా మృతి చెందినా బీమా వర్తింపు

అన్నదాత తరఫున ప్రీమియం చెల్లిస్తున్న సర్కారు

వారం రోజుల్లోనే నామిని ఖాతాలో రూ.5లక్షలు

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబీమా బాధిత కుటుంబాలకు కొండంత ఆసరాగా నిలబడ్డాయి.. బీమా సాయంతో పాత అప్పులు తీర్చి, ఆడ బిడ్డల పెండ్లిండ్లు చేయడమే కాకుండా పైసలను డిపాజిట్‌ చేసుకొని ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. పాపన్నపేట మండలం అరికెల గిరిజన తండాకు చెందిన ఓ గిరిజన కుటుంబం బీమా సాయంతో మినీ డెయిరీ ఫాం ఏర్పాటు చేసుకొని, ఆర్థికంగా ఎదుగుతున్నది.. కొల్చారం మండలం కొంగోడ్‌ గ్రామంలో ఓ దళిత కుటుంబం అప్పులు తీర్చి, ఏడో తరగతి చదువుతున్న బిడ్డ చదువు, పెండ్లి కోసం రూ.3లక్షలు డిపాజిట్‌ చేసింది. ఆ మూడు లక్షలు ఆరేండ్లకు రెట్టింపు కానున్నది. ఇలా బీమా సొమ్ము పొంది అన్ని కుటుంబాలు  ఆర్థికంగా నిలదొక్కుకొని, సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్నాయి. భూమి పోలేదు.. అప్పుల బాధ లేదు.. బిడ్డ పెండ్లి రందీ లేదు.. అని సర్కారుకు దండం పెట్టుకుంటున్నాయి.

- సిద్దిపేట, నమస్తే తెలంగాణ/మెదక్‌/అందోల్‌

సీకటైనా బతుకులో ఎలుగు వచ్చింది...

భర్త పోయిన దుఃఖంలో ఉంటే, మా కుటుంబానికి సుట్టాలు ఎవరూ దగ్గరికి తీయలేదు. నేను, నా పిల్లలు దిక్కులేని పక్షులమయ్యాం. నా భర్త చనిపోయి వారం సుతా గడువలె.. సార్లు వచ్చి ఐదు లచ్చల కాయిదం ఇచ్చిండ్రు. నా బ్యాంకు ఖాతలో ఆ పైసలు జమా అయ్యాయి. ముందుగల్ల నమ్మలేదు. పక్కింటోళ్లూ వచ్చి రైతుబీమా పైసలరి చెప్పిన్రు. అప్పటి వరకు సీకటైనా మా బతుకులో ఎలుగు వచ్చింది. సీఎం కేసీఆర్‌ సారు పుణ్యంతోనే ఇవాళ మేం ధైర్యంగా ఉన్నాం. 

- నిమ్మ లత, రామక్కపేట, దుబ్బాక మండలం

అప్పులు కట్టి, 

కూతురు పేరిట డిపాజిట్‌ చేసిన

నా భర్త బాలేశ ఆరోగ్యం కోసం రూ.లక్ష అప్పు చేసి, ప్రైవేటులో చేయించిన. నాకు కొడుకు, ఆడపిల్ల ఉంది. నా భర్త చనిపోగా, రూ.5లక్షల బీమా వచ్చింది. రూ.లక్ష అప్పులు కట్టి, మిగతా రూ.3లక్షలు బిడ్డ పేరిట పోస్టాఫీసులో డిపాజిటు చేసిన. అవి ఆరేండ్ల తర్వాత రూ.6లక్షలు వస్తాయి. వాటిని మళ్లీ డిపాజిటు చేస్తే తర్వాత రూ.12లక్షలు వస్తాయి. బిడ్డ ఏడో తరగతి చదువుతున్నది. నేను రెండెకరాల పొలం వ్యవసాయం చేసుకుంటున్న.

- దుబ్బగల్ల ప్రమీల, కొంగోడు గ్రామం, కొల్చారం మండలం

ఆఆరుగాలం కష్టపడి పంటలను సాగుచేసి దేశానికే పట్టెడన్నం పెట్టే రైతు.. కాలం కలిసి రాక తానూ పస్తులుంటూ కుటుంబాన్ని అర్థాకలితో ఉంచిన సందర్భాలేన్నో.. ఇలాంటి సమయంలో అప్పుల బాధతోనో.. అనారోగ్యంతోనో అతడు మృతి చెందితే అతడిపైనే ఆధారపడి జీవిస్తున్న ఆ కుటుంబం రోడ్డునపడి అష్టకష్టాలు పడిన ఘటనలు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో చూశాం. ఇలాంటి ఘటనలు స్వయంగా చూసిన రైతుబిడ్డ సీఎం కేసీఆర్‌ స్వరాష్ట్రంలో రైతుల బతుకులు అలా కాకూడదని నిశ్చయించారు. ఇంటి పెద్దని కోల్పోయిన ఏ కుటుంబం కూడా ఆగం కావొద్దంటూ సంకల్పించారు. కుటుంబ పెద్ద అకాల మరణం పొందింతే ఆ కుటుంబానికి అండగా ఉండి ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం రైతుల కుంటుంబాలకు కొండంత అండగా మారింది. రైతు మృతి చెందిన రోజుల వ్యవధిలోనే నామినీ ఖాతాలోకి బీమా డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో రైతుల కుటుంబాలు రైతుబీమా డబ్బులతో కూతుళ్ల పెండ్లిళ్లు చేసి, కూరగాయల సాగు, బర్రెల పెంపకం ఇలా చిన్న.. చిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇంటిపెద ్దలేని బాధ ఎవ్వరూ తీర్చలేనిది.. కానీ తమ కుటుంబం రోడ్డున పడకుండా రైతుబీమా అందజేసి మాకు పెద్దదిక్కుగా మారిన సీఎం కేసీఆర్‌ మేలు మరువలేనిదంటూ పలు రైతు కుటుంబాలు అంటున్నాయి.

మెదక్‌ జిల్లాల్లో మూడేండ్లలో 1830మంది రైతులకు రూ.91కోట్ల 5లక్షల పంపిణీ

మెదక్‌ : దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం  నిరుపేద రైతు కుంటుబాలకు అండగా నిలుస్తున్నది. 2018 ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభం కాగా, పాస్‌పుస్తకమున్న ప్రతి రైతుకు వర్తిస్తున్నది. బీమా పాలసీ డబ్బులు ఎల్‌ఐసీకి రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లించి బీమా చేయిస్తున్నది. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ ఎవరూ తీర్చనప్పటికీ, ఆ కుటుంబాలు కష్టాల పాలు కాకుండా, ఆ కుటుంబం సమాజంలో నిలదొక్కుకోవడానికి రైతుబీమా దోహదపడుతున్నది. రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే, బాధిత కుటుంబంలోని నామినికి ఎల్‌ఐసీ ద్వారా రూ.5లక్షలు అందిస్తోంది. ఈ సాయంతో ఆ కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. పాత అప్పులు, పిల్లల చదువులు, వ్యవసాయానికి పెట్టుబడి, ఆడ పిల్లల పెండ్లిలకు పోస్టాఫీస్‌ ఇతర బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకొని, ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి.

మెదక్‌ జిల్లాలో ..

మెదక్‌ జిల్లాలో 2018లో 1,08,982 మంది రైతులకు రూ.24 కోట్ల 74 లక్షలు రైతు బీమా కోసం ప్రీమియం కింద ప్రభుత్వం ఎల్‌ఐసీకి చెల్లించింది. గత సంవత్సరంలో 706 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబాలకు రూ.35 కోట్ల 30 లక్షలు చెల్లించింది. 2019 సంవత్సరంలో 839 రైతులు మృతి చెందగా, నామినీల ఖాతాల్లో రూ.41 కోట్ల 95 లక్షలు జమ అయ్యాయి. 2020 సంవత్సరంలో ఇప్పటి వరకు 285 మంది రైతులకు రూ.14 కోట్ల 25 లక్షలు ప్రభుత్వం చెల్లించింది. జిల్లా మొత్తంగా మూడేండ్లలో రైతుబీమా ద్వారా1830 మంది రైతులకు రూ.91 కోట్ల 5 లక్షలు బాధిత కుటుంబాలకు అందించి ఆ కుంటుంబాలలో వెలుగులు నింపింది.

అన్నదాతకు అభయం

అందోల్‌ : అందోల్‌, వట్‌పల్లి మండల్లాలో 18,134 మంది రైతులుండగా.. వీరిలో 10,212 మంది రైతులు రైతుబీమాకు అర్హులుగా గుర్తించిన అధికారులు వారికి బీమాబాండ్లను అందజేశారు. కాగా, ఇప్పటివరకు వట్‌పల్లి మండలంలో 61, అందోల్‌లో 108 మంది రైతులు అనారోగ్య కారణాలతో మృతిచెందగా వారి నామినీల ఖాతాల్లో రైతుబీమా డబ్బులను జమ చేశారు. వట్‌పల్లి మండల పరిధిలోని కేరూర్‌ గ్రామానికి చెందిన మంగలి శంకరయ్య గతేడాది అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో శంకరయ్య భార్య అమృతమ్మ రావాల్సిన బీమాడబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఆ డబ్బుతో శంకరయ్య వైద్య ఖర్చులకు చేసిన అప్పులను తీర్చారు. మిగతా డబ్బులను మృతుడి కుమారుడు కృష్ణ గ్రామంలో హేర్‌కటింగ్‌ షాప్‌ను ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదేవిధంగా వట్‌పల్లికి చెందిన తలారి రఘు అనారోగ్యంతో మృతి చెందగా అతడి భార్య(నామినీ) జ్యోతి ఖాతాలోకి రూ.5లక్షలు బీమా డబ్బులు జమ చేశారు. ఇంటి పెద్దను కోల్పోయి బిడ్డలను (ఇద్దరు కొడుకులు, ఒక కూతురు)ని ఎలా సాదాలో తెలియని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయంతో తమకు ఎంతో ఆసరా దొరికిందని మృతుడి భార్య జ్యోతి తెలిపారు. 

‘రైతుబీమా’ గొప్ప పథకం 

ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం రైతుల కుటుంబాలకు గొప్పవరం. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో.. సీఎం కేసీఆర్‌కు తెలుసు. అందుకే వారికి అండగా ఉండడం కోసమే రైతుబీమాను తీసుకువచ్చారు. ఎవరి ప్రమేయం లేకుండానే రైతులు మరణించినా రోజుల వ్యవధిలోనే రైతుల నామినీల బ్యాంకు ఖాతాలోకి నేరుగా డబ్బులు చేరుతున్నాయి.  

- చంటి క్రాంతికిరణ్‌, 

అందోల్‌ ఎమ్మెల్యే రైతులకు  భరోసా..

దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో అమలు 

ఒక్కో రైతుకు రూ.3486.90 ప్రీమియం చెల్లించిన ప్రభుత్వం

రైతు ఏ కారణం చేత చనిపోయినా బీమా వర్తింపు 

1,677 మంది రైతుల కుటుంబాలకు రూ.83.85 కోట్లు చెల్లింపు

రైతు నామినీ ఖాతాలో వారం రోజుల్లోనే రూ.5లక్షలు జమ

సిద్దిపేట, నమస్తే తెలంగాణ :

రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్‌ రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారు. ఎవరైన పట్టాదారు రైతులు మరణించినట్లయితే వారి వారసులకు ఆర్థిక ఉమశమనాన్ని కలిగించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తోంది. సిద్దిపేట జిల్లాలోని 1,61,065 మంది రైతులకు గాను, ఒక్కో రైతుకు రూ.3486.90 ప్రీమియం చొప్పున ప్రభుత్వం భారత జీవిత బీమా సంస్థకు చెల్లించింది. ఈ పథకాన్ని 2018 ఆగస్టు 15న ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లాలో వివిధ కారణాలతో 1,677 మంది రైతులు మృతి చెందారు. వారం రోజుల్లోనే రూ.5లక్షల చొప్పున మొత్తం  రూ.83.85కోట్లను మరణించిన రైతు కుటుంబాల నామినీ ఖాతాలో జమ చేశారు. సిద్దిపేట జిల్లాలో 24 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 383 రెవెన్యూ గ్రామాలు ఉండగా, 127 రెవెన్యూ క్లస్టర్లున్నాయి. 05 ఏడీఏ డివిజన్ల పరిధిలో మొత్తం 2,84,580 మంది రైతులున్నారు.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం కింద 2020-21 సంవత్సరానికి గాను (18-59 ఏండ్ల వయస్సు గల వారు) 1,61,065 అర్హత కలిగి ఉన్నారు. వీరిలో ఒక్కో రైతుకు రూ.3486.90 చొప్పున రూ.56.16కోట్ల ప్రీమియం మొత్తాన్ని బీమా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఏ కారణం చేతనైన రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5లక్షలను వారం రోజుల్లో సంబంధిత బీమా సంస్థ చెల్లిస్తోంది. వచ్చిన డబ్బులతో రైతు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. వచ్చిన డబ్బులతో  అప్పులను తీర్చుకోవడంతో పాటు మిగిలిన డబ్బులతో చిరు వ్యాపారం లేదా వ్యవసాయ పనిముట్లు  ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. రైతుబీమా ఎంతో ఆదుకుందని మరణించిన రైతు కుటింబీకులు చెబుతున్నాయి. జిల్లాలో 2018 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో 1,677 మంది రైతులు చనిపోయారు. వీరిలో కొన్ని కుటుంబాలను ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది.  

సీఎం కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటాం..

దుబ్బాక : 

మా లాంటి పేద రైతులకు సీఎం కేసీఆర్‌ నిజంగా దేవుడే..  నా భర్త చనిపోయి వారం సుతా కాలే.. అధికారులు వచ్చి ఐదు లక్షల రూపాయల కాగితం ఇచ్చారు. నా బ్యాంకు ఖాతాలో ఆ పైసలు జమయ్యాయి. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే మా కుటుంబానికి చుట్టాలు (బంధువులు) ఎవరూ దగ్గరికి తీయలేదు (ఆదుకోలేదు). నేను, నా పిల్లలు దిక్కులేని పక్షులమయ్యాం. ప్రభుత్వ అధికారులు మా ఇంటికి వచ్చి, నీకు రూ.5లక్షల బీమా మంజూరైందని చెప్పారు. నేను నమ్మలేదు. మా మా ఇంటి పక్కన వాళ్లు వచ్చి రైతుబీమానే అని చెప్పారు. అప్పుడు నమ్మాను. సీఎం కేసీఆర్‌ పుణ్యంతోనే ఇవాళ మేము ధైర్యంగా ఉన్నామని దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన నిమ్మ లత ‘నమస్తే తెలంగాణ’కు  తెలిపింది. 

వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన నిమ్మ అర్జున్‌ తనకున్న రెండెకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు.  గత యేడాది కిందట నిమ్మ అర్జున్‌ అనారోగ్యంతో మంచాన పడి,  నాలుగు నెలల కిందట మృతి చెందాడు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో అయోమయంలో ఉన్న ఆ కుటుంబానికి రైతుబీమా అండగా నిలిచింది. అర్జున్‌ భార్య లత, ఇద్దరు పిల్లలకు రైతుబీమా డబ్బులు ఆసరాగా మారాయి. అర్జున్‌ మృతి చెందిన వారం రోజుల్లో వ్యవసాయ అధికారులు లత ఇంటికి వచ్చి  రైతుబీమా చెక్కు ప్రొసీడింగ్‌ పత్రాన్ని అందజేశారు. వెంటనే లత బ్యాంకు ఖాతలోకి బీమా రూ.5 లక్షలు జమయ్యాయి. ఆ డబ్బుల నుంచి ఒక లక్ష రూపాయలు తన భర్త వైద్యానికి చేసినా అప్పులు తీర్చింది. మిగిలిన రూ.4లక్షలు తన కూతురు అఖిల పేరిట బ్యాంకులో ఫిక్స్‌ డిపాజిట్‌ చేసింది. భర్త చనిపోవటంతో రైతుబీమా రూ.5 లక్షలతో పాటు, వితంతు పింఛన్‌ ద్వారా నెలకు రూ.2016 వస్తున్నాయి. 

ఇక  తనకున్న భూమిలో పంట సాగు చేసుకుంటూ లత సంతోషంగా తన పిల్లలను సాదుకుంటుంది. కూతురు అఖిలను ఇంటర్మీడియట్‌, కుమారుడు శివశంకర్‌ 8వతరగతి చదువుకుంటున్నారు. ఇప్పుడు మా భూమి మాకుంది. బిడ్డకు పెండ్లి చేయాలనుకుంటే  పైసలకు రంది లేకుండా పోయింది. ‘రైతుబీమా’ పథకం మా వంటి పేద రైతులకు వరంగా మారిందని.. ఈ పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని కృతజ్ఞతభావంతో చెప్పింది. 

1830 మంది రైతు కుటుంబాలకు రూ.91.05కోట్లు

మెదక్‌ జిల్లాలో రెండేండ్లలో రైతుబీమా ద్వారా 1830 మంది రైతు కుటుంబాలకు రూ.91 కోట్ల 5 లక్షలు బాధిత కుటుంబాల ఖాతాల్లో వేశాం. మెదక్‌ జిల్లాలో 2018లో 1,08,982 మంది రైతులకు రూ.24 కోట్ల 74 లక్షలు ప్రీమియం కింద ప్రభుత్వం ఎల్‌ఐసీకి చెల్లించింది. గత సంవత్సరంలో 706 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబాలకు రూ.35 కోట్ల 30 లక్షలు చెల్లించింది. 2019లో 839 రైతులు మృతి చెందగా, వారి కుటుంబాలకు 41 కోట్ల 95 లక్షలు చెల్లించింది. 2020 సంవత్సరంలో ఇప్పటి వరకు 285 మంది రైతులకు రూ.14 కోట్ల 25 లక్షలు ప్రభుత్వం చెల్లించింది. జిల్లా మొత్తంగా మూడు సంవత్సరాల్లో రైతు బీమా ద్వారా 1830 మంది రైతులకు 91 కోట్ల 5 లక్షల రూపాయలు బాధిత కుటుంబాలకు చెల్లించింది.

- పరశురాం నాయక్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

అప్పులు కట్టినం.. ఇల్లుకు మరమ్మతులు చేసినం

కొల్చారం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మా నాన్న ఎల్లయ్యకు గాయాలైనయి. నాన్నను బతికించుకుందామని రూ.3లక్షలు అప్పులు చేసి, హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానలో వైద్యం చేయించినా, బతుకలె. అమ్మ నాగమణి కరెంట్‌ షాక్‌తో గతంలో చనిపోయింది. నేను, మా చెల్లి జ్యోతి ఉన్నాం. నాన్న పేరు మీద అర ఎకరం ఉండడంతో రైతు బీమా కింద రూ.5లక్షలు వచ్చినయి. వాటితో అప్పులు కట్టినం.. మిగిలిన డబ్బులతో ఇల్లుకు మరమ్మతులు చేయించిన. ఎల్లుండే నా పెండ్లి. అన్ని అప్పులు తీరిపోవడంతో ఎలాంటి చీకూ చింత లేకుండా ఉన్నాం.

- కన్నెబోయిన కుమార్‌, అప్పాజిపల్లి గ్రామం, కొల్చారం మండలం

బోర్ల కోసం చేసిన అప్పులు కట్టినం..

మా ఆయన కాదూరి నర్సింహులు. 2018 నవంబర్‌ 20న అనారోగ్యంతో చనిపోయిండు. మాకు ఉన్న ఎకరంన్నర భూమిలో రూ.3లక్షలు అప్పులు చేసి, మూడు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. దీంతో గుండెపోటుతో నా భర్త చనిపోయిండు. రైతుబీమా కింద రూ.5లక్షలు వచ్చినయి. రూ.3 లక్షల అప్పు తీర్చిన. నా ఒక్కగానొక్క కొడుకు కుమార్‌ ఇంటర్‌ దాక చదివిండు. పోలీస్‌ కొలువు కోసం హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంటుండు. కోచింగ్‌కు రూ.లక్ష కట్టిండు. నాకు ఇప్పుడు నడవడం చేతకావడం లేదు. అందుకే మిగిలిన పైసలు నా ఆరోగ్యం కోసం బ్యాంకులో డిపాజిట్‌ చేసుకున్నా. నా కొడుకుకు పొలీసు కొలువు వస్తే నా కష్టాలు తీరినట్లే.

- బూదెమ్మ, అప్పాజిపలి ్లగ్రామం, కొల్చారం మండలం

మా కొడుకుకు డెయిరీ ఫాం పెట్టించిన..

నా భర్త దేవుల నాయక్‌కు పక్షవాతం వచ్చి ఏడాది కింద చనిపోయాడు. రైతు బీమా కింద రూ.5 లక్షలు వచ్చినయి. ఆ డబ్బులతో పెద్ద బిడ్డ పెండ్లి చేసిన. మిగిలిన పైసలతో కొడుకుకు  డెయిరీ ఫాం పెట్టించిన. అందులో 16బర్రెలు ఉన్నాయి. మా ఇంటిల్లిపాది కలిసి పని చేసుకుంటున్నాం. నెలకు రూ.20వేలు సంపాదిస్తున్నం. ఇప్పుడు చిన్న బిడ్డ పెండ్లి చేయాలని అనుకుంటున్నం. మాలాంటోళ్లకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.

- దేవాసోత్‌ శాంతిభాయ్‌.

దిక్కులేని సమయంల పెద్ద దిక్కు అయ్యింది..

నా భర్త దుర్గయ్య అనారోగ్యాంతో చనిపోయిండు. ఇంటి పెద్ద దిక్కు పోవడంతో కష్టాలు పెరిగినయి. రూ.2లక్షల అప్పులు ఎలా తీర్చాలని అనుకున్నాం. ఎవరూ సాయం చేయలేదు. రైతుబీమా కింద నాకు రూ.5లక్షలు వచ్చినయి. అప్పులు కట్టుకొని, రూ.3 లక్షలు దాచుకున్నం. దిక్కలేని సమయంలో పెద్ద దిక్కుగా సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన రైతు బీమా మాకు అండగా నిలిచింది.

- బుచ్చ సావిత్రి నందిగామ,నిజాంపేట మండలం

మాకు కేసీఆరే పెద్ద నాయన

మాకు కేసీఆర్‌ సార్‌ దేవుడు. మా అత్త మల్లవ్వ అనారోగ్యంతో సచ్చిపోయింది. మామ ఎప్పుడో సచ్చిపోయిండు. ఉన్న ఇద్దరు కొడుకులు ఉపాధి కోసం దుబాయి పోయిన్రు. మేము తోడికోడళ్లం బాగా ఇబ్బంది పడ్డం. మా చేతుల్లో పైసలు లేవు. అత్త సచ్చిపోయింది. అప్పులు బాగా అయినయి .కేసీఆర్‌ సార్‌ రైతు బీమాతో సావుకు చేసిన అప్పులు, బాగాలేనప్పుడు అయిన అప్పులన్నీ కట్టినం. మాకు కేసీఆర్‌ సారే పెద్దబాపు.

- కాసు లక్ష్మి, కాట్రియాల, రామాయంపేట

రైతుబీమా ఎంతో ఉపయోగపడింది..

ప్రభుత్వం అందజేసిన రైతుబీమా మా కుటుంబానికి ఎంతగానో ఉపయోగపడింది. ఇంటిపెద్దను కోల్పోయిన బాధలో ఉన్న తమకు సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ఎంతో ఊరటనిచ్చింది. ఎవరిని కలవకుండానే అధికారులే తమవద్దకు వచ్చి పూర్తి వివరాలు తీసుకుని వెళ్లారు. వారు వచ్చి వెళ్లిన కొద్ది రోజుల్లో నా బ్యాంకు ఖాతాలో రూ.5లక్షలు జమయ్యాయి. దీంతో కొంత అప్పు చెల్లించా.. మరికొంత డబ్బుతో నా కొడుకు కటింగ్‌షాప్‌ ఏర్పాటు చేసుకున్నాడు. 

- అమృతమ్మ, మృతుడి భార్య, కేరూర్‌. 

అర్హులందరికీ రైతుబీమా అందజేస్తున్నాం..

మండలంలో అర్హులైన ప్రతి రైతుకు  రైతుబీమా అందించేందుకు కృషి చేస్తున్నాం. రైతు మృతి చెందిన వారంరోజుల్లోనే నామినీకి డబ్బులు మంజూరు అవుతున్నాయి. రైతు మృతి చెందిన వెంటనే రైతుల పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపిస్తున్నాం. వారు అందజేసిన బ్యాంక్‌ ఖాతాలో ప్రభుత్వం అందజేసిన రూ. 5లక్షలు నేరుగా ఖాతాలో జమచేస్తున్నాం.

- మహేశ్‌ చౌహాన్‌. మండల వ్యవసాయ అధికారి

రైతుబీమా లేకుంటే ఆగమయ్యేటోళ్లం

మా నాన్న బ్రతికున్నప్పుడే నా పెండ్లి చెసిండు. తరువాత నాన్న కాలం చేయడంతో అమ్మ అనారోగ్యానికి గురయ్యింది. దీంతో దవాఖానల చుట్టూ తిప్పడంతో పాటు  చెల్లె పెండ్లి చేసిన మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మ 6 నెలల క్రితం కాలం చేసింది. అమ్మ, నాన్న చనిపోవడంతో పాటు చెల్లె పెండ్లికి, అమ్మ వైద్యానికి తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. దీంతో చిన్న వయస్సులోనే మానసికంగా, ఆర్థికంగా కుమిలిపోతున్న నాకు రైతుబీమా రూ.5లక్షలు రావడంతో చేసిన అప్పులు మొత్తం తీరిపోయాయి. నా కూతురు ఆరాధ్య పేరు మీద బ్యాంకులో రూ.1లక్ష పిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడంతో పాటు రూ.50వేలు పెట్టి ఒక పాడిబర్రెను కొన్నాను. ఇప్పుడు పాలతో పాటు అదనంగా వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం.  

- ఓరుగంటి గణేశ్‌, గురువన్నపేట, కొమురవెల్లి మండలం


VIDEOS

logo