ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 22, 2020 , 00:03:38

ఎల్‌ఐసీ ఏజెంట్ల సంక్షేమం మా బాధ్యత

ఎల్‌ఐసీ ఏజెంట్ల సంక్షేమం మా బాధ్యత

- ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌ :  పాలసీలు ఇచ్చి ప్రజల జీవితాలకు భద్రత కల్పిస్తున్న ఎల్‌ఐసీ ఏజెంట్ల సంక్షేమం మా బాధ్యత అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మైత్రివనంలో ఎల్‌ఐఎఫ్‌ఐ -ఎల్‌ఐసీ ఏజెంట్ల యూనియన్‌ భవనాన్ని ప్రారంభించి, రంగధాంపల్లిలో రూ.56 లక్షలతో నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దేశంలోనే ఎల్‌ఐసీ ఏజెంట్లకు తొలి భవనం సిద్దిపేటలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఏజెంట్లు కష్టాన్ని నమ్ముకుని ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. ప్రజలకు పాలసీలు ఇచ్చి ఏజెంట్లు భద్రంగా జీవనం సాగిస్తున్నారన్నారు. ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ ఆందోళనకర అంశమన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 శాతం వాటా ప్రైవేటీకరణ పెట్టడం దురదృష్టకరమన్నారు. కేంద్ర నిర్ణయంతో పాలసీదారులు, ఉద్యోగుల్లోనే కాదు. ప్రజల్లో ఆందోళన నెలకొన్నదన్నారు.  బంగారు బాతులాంటి ఎల్‌ఐసీ పై కేంద్రం మొండి చూపు చూస్తున్నదన్నారు. డివిడెంట్‌, టాక్స్‌,   రుణాల రూపంలో ఎల్‌ఐసీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బును ఇస్తుందన్నారు. దేశానికి సహకరిస్తున్నదన్నారు. అలాంటి ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేసే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎల్‌ఐసీని కాపాడేలా తెలంగాణ రాష్ట్ర ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని హామీ ఇచ్చారు. ఎల్‌ఐసీని కాపాడేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి వెల్లడించారు. సిద్దిపేటలో ఎల్‌ఐసీ ఆఫీసు కార్యాలయం కల నిజమైందని, గజ్వేల్‌లోనూ ఎల్‌ఐసీ కార్యాలయంతో పాటు ఏజెంట్లకు భవన నిర్మాణం చేసేందుకు నూతన సంవత్సర కానుకగా అందిస్తామన్నారు. అంతకు ముందు మూడు రాష్ర్టాల ఎల్‌ఐసీ ఏజెంట్ల జోనల్‌ అధ్యక్షుడు జనగామ రవీందర్‌రెడ్డి, ఎల్‌ఐసీ సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఉషశ్రీలు మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  

VIDEOS

logo