గరీబోళ్లకే గూడు

మీరే నా కుటుంబం.. నేను మీ కుటుంబ సభ్యుడిని..
ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీశ్‌రావు
కేసీఆర్‌నగర్ డబుల్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
లింగారెడ్డిపల్లిలో 25మంది లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణా కేంద్రం ప్రారంభం
సిద్దిపేట మరో హైదరాబాద్ కానున్నది : ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్
గూడు లేని గరీబోళ్లకే డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం సిద్దిపేట కేసీఆర్‌నగర్‌లో మూడో దఫా 216 మంది లబ్ధిదారులకు మంత్రి సతీసమేతంగా పట్టాలు, నూతన వస్ర్తాలు అందజేశారు. లింగారెడ్డిపల్లిలో 25మందితో డబుల్ బెడ్రూం ఇండ్లలో ప్రవేశాలు చేయించారు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ తొలిసారిగా ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌తో కలిసి ప్రారంభించారు. నిజమైన నిరుపేదలకు ఇల్లు దక్కాలని ఆరునెలలు కష్టపడి, జల్లెడ పట్టి, ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా, పేదరికమే ప్రామాణికంగా అర్హులను ఎంపిక చేసినట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, 200మంది అధికారులు అహర్నిశలు శ్రమించారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా నిరుద్యోగ యువత, ప్రజాప్రతినిధులకు ఉపయోగంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. - సిద్దిపేట, నెట్వర్క్
సిద్దిపేట కలెక్టరేట్: ‘ఎన్నో ఏండ్ల పేదల కల నెరవేరినందుకు నాకు సంతోషంగా ఉంది.. మీ పెదాలపై ఆనందం చూస్తే బిర్యాని తిన్న ఆనందం నాకు కలిగింది.. మీరే నా కుటుంబం.. నేను మీ కుటుంబ సభ్యుడిని.. పెద్దల గేటెడ్ కమ్యూనిటీ ఇండ్ల మాదిరి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను గూడులేని గరీబొళ్లకే కేటాయించామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట కేసీఆర్‌నగర్‌లో మూడో దఫా 216 మంది లబ్ధిదారులకు మంత్రి సతీసమేతంగా పట్టాలు, నూతన వస్ర్తాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పేదల సొంతింటి కల నిజమైనందున ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నర్సపురంలో 2460 డబుల్ బెడ్రూం ఇండ్లను సకల సౌకర్యాలతో పూర్తి చేశామన్నారు. పదికాలాల పాటు ఇండ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులదేనని మంత్రి అన్నారు. కిరాయి ఇచ్చినా, అమ్మినా నేరమన్నారు. కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సిద్దిపేట నడిబొడ్డున నాణ్యతతో 2460 ఇండ్లను నిర్మించామన్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధతో ఇండ్లు నిర్మించారన్నారు. లబ్ధిదారులు అదృష్టవంతులన్నారు.
కలెక్టర్‌కు ప్రశంసలు.. సన్మానం
కేసీఆర్‌నగర్‌లో ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంలో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి కృషి అసామాన్యమైనదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇండ్ల కేటాయింపులో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపారన్నారు. ఓపిగ్గా నిజాయితీగా పనిచేసి ఇండ్ల నిర్మాణం అయ్యేలా చూశారన్నారు. శాలువా, ప్రత్యేక జ్ఞాపికతో కలెక్టర్‌ను మంత్రి సత్కరించారు. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ సీనియర్ ఫ్యాకల్టీ అసోసియేట్ డాక్టర్ ఉషారాణి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్‌పటేల్, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, ఆర్డీవో జయచంద్రారెడ్డి, సుడా వైస్ చైర్మన్ రమణాచారి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
లింగారెడ్డిపల్లిలో గృహప్రవేశాలు..
సిద్దిపేట రూరల్: పేదలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిపల్లిలో నిర్మించిన 25 డబుల్ బెడ్రూం ఇండ్లను సోమవారం మంత్రి ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రూ.30 కోట్లతో స్థానిక ఎల్లమ్మ గుడి నుంచి రామంచ వరకు నాలుగు లెన్ రోడ్డుతో పాటు బట్టర్ ఫ్లై లైట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. లింగారెడ్డిపల్లి యువత కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్ మల్లికార్జున్, మాజీ సర్పంచ్ రామస్వామి, మాజీ ఎంపీటీసీ బాలయ్య, పీఆర్ శాఖ అధికారులు పాల్గొన్నారు.