గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 20, 2020 , 00:27:02

అన్నలా.. ఆడబిడ్డలకు అండగా..

అన్నలా.. ఆడబిడ్డలకు అండగా..

నిరాశ్రయులైన మహిళా కుటుంబానికి ఇల్లు

కొత్త బట్టలు పెట్టి.., గృహ ప్రవేశం చేయించిన మంత్రి హరీశ్‌రావు 

చిన్నకోడూరు: ఇల్లు కూలి నిలువ నీడలేక నిరాశ్రయులైన ఆడబిడ్డలకు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అండగా నిలిచారు. చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు దొంతరబోయిన బాలమణి ఇల్లు కూలడంతో తల్లి, కూతురు స్రవంతి నిరాశ్రయులయ్యారు. 8 ఏండ్ల కిందటే తండ్రి రాజయ్య గుండెపోటుతో మృతి చెందాడు. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్ల స్రవంతి మేకలు, బర్రెలు కాస్తూ ఇల్లు నెట్టుకొస్తున్నదనే విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు వెంటనే స్పందించారు. పెద్దదిక్కులేని ఆ కుటుంబానికి అన్నలా వ్యవహరించి కూలిన ఇంటి చోటనే మరమ్మతులు చేయించి కొత్త ఇల్లు కట్టించారు. ఈ మేరకు శనివారం జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మతో కలిసి కొత్తగా నిర్మించిన బాలమణి ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొని తల్లి, కూతురుకు కానుకగా కొత్త బట్టలు పెట్టి, మిఠాయిలు తినిపించారు. తల్లీకూతురు కొత్త ఇంటికి పోయిన సంబురాన్ని అందరితో పంచుకుంటూ పది కాలాలు సల్లంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావుకు దీవెనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాముని శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ పాపయ్య, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ మల్లేశంగౌడ్‌, సర్పంచ్‌ సంతోష విక్రమ్‌, ఎంపీటీసీ వెంకటలక్ష్మి యాదవరెడ్డి, నాయకులు శ్రీకాంత్‌, రాజలింగం, ప్రభాకర్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo