గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 20, 2020 , 00:27:00

అర్హులకే డబుల్‌ ఇండ్లు

అర్హులకే డబుల్‌ ఇండ్లు

తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే బేడ, బుడగ జంగాలకు గుర్తింపు 

ప్రజలపై భారం వేయకుండా దాదాపు రూ.8 కోట్లు వెచ్చిస్తాం..

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఆదర్శ ఎస్సీ, బేడ బుడగజంగాల, వడ్డెర భవనాలు ప్రారంభం

సిద్దిపేట కలెక్టరేట్‌: కడు పేదరికంలో ఉన్న వారికే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఆ దిశగా ఎస్సీ, ఎస్టీ, సంచార జాతులకు, అభివృద్ధికి దూరం ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట హౌసింగ్‌ బోర్డు కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన ఆదర్శ ఎస్సీ బేడ, బుడగజంగాల సంఘం భవనాన్ని, రూ.10 లక్షలతో వడ్డెర సంఘం భవనాన్ని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే బేడ, బుడగజంగాలకు గుర్తింపు వచ్చిందన్నారు. పట్టణ నడిబొడ్డున బేడ, బుడగజంగాల సంఘ భవనం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకంలో సంచార జాతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సిద్దిపేటలో పూసల, గంగిరెద్దుల, ఫకీరోల్ల, మోచీ, ఎరుకల, నాయీబ్రాహ్మణ, రజక, దర్జీ, విశ్వబ్రాహ్మణ, ఇలా ప్రతీ కుల సంఘాలకు భవనాలు నిర్మించినున్నట్లు తెలిపారు. 58,59 జీవో కింద పట్టాలు ఇప్పించి శాశ్వత పరిష్కారం చూపామన్నారు.  

యూజీడీ కనెక్షన్లకు సుమారు 

రూ.8 కోట్లు వెచ్చిస్తాం..

పట్టణంలో రూ.250 కోట్లతో యూజీడీ వ్యవస్థకు వెచ్చించామని, కనెక్షన్లు ఎవరి ఇంటికి వారే ఇచ్చుకోవాలని.. కానీ ప్రతి ఒక్కరికీ రూ.1500 ఖర్చు చేయాల్సి వస్తుందని.. ప్రజలకు భారం పడుతున్నదని ఆలోచన చేసి వారిపై ఆర్థిక భారం పడకుండా భరోసానిస్తూ దాదాపు రూ.8 కోట్లు వెచ్చించి ఇంటింటికీ యూజీడీ కనెక్షన్లు ఇచ్చేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలిపారు. యూజీడీ పూర్తయ్యాక అన్ని వార్డుల్లో రోడ్డు వేసుకుందామన్నారు. 

స్వచ్ఛ సిద్దిపేటకు ప్రజలు సహకరించాలి 

సిద్దిపేటను స్వచ్ఛతతో కాపాడుకుందామని మంత్రి హరీశ్‌రావు కోరారు. ఢిల్లీ స్థాయిలో సిద్దిపేటకు అవార్డు వచ్చిందని, అది మీ సహకారంతోనే సాధ్యమైందన్నారు. కొందరు ఇప్పటికీ బహిరంగ చెత్త వేస్తున్నారని, దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తాపత్రయమన్నారు. రోడ్డుపై చెత్త వేస్తే జరిమానాలు విధిస్తున్నామని.. ప్రజల్లో మార్పు కోసమే అన్నారు. దేశంలో సిద్దిపేట మొదటి స్థానంలో ఉండాలని, ఢిల్లీ కేంద్రంలో స్వచ్ఛత కోసం ఇచ్చే అవార్డు మనకే రావాలన్నదే నా ఆశ అన్నారు. సేకరించిన చెత్తను రీసైక్లింగ్‌ చేస్తున్నామన్నారు. ప్రతి రోజు 50 టన్నుల చెత్త సేకరిస్తున్నామన్నారు. అందరికీ సమాన గౌరవం దక్కాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ పిలుపునిచ్చారు. బేడ, బుడగ జంగాల ప్రజలు ఆత్మగౌరవంతో ఉండేలా చేసిన ఘనత మీదేనని ఆ సంఘం ప్రతినిధులు వరంగల్‌ కార్పొరేటర్‌ యాదగిరి మంత్రి హరీశ్‌రావును కొనియాడారు. కార్పొరేషన్‌ ఏర్పాటు దిశగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, బేడ, బుడగ జంగాల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

నేడు వరివెద పద్ధతిలో సాగుపై అవగాహన 

పాల్గొననున్న మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌: సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో నేడు వరివెద పద్ధతిలో వ్యవసాయ సాగువిధానంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ సదస్సులో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొననున్నారని, ఆసక్తి గల రైతులు హాజరు కావాలని సూచించారు.  

VIDEOS

logo