మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Dec 20, 2020 , 00:28:44

రంగనాయక క్షేత్రాన అటు ఆధ్యాత్మికం.. ఇటు ఆహ్లాదం..

రంగనాయక క్షేత్రాన అటు ఆధ్యాత్మికం.. ఇటు ఆహ్లాదం..

పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందిన లక్ష్మీరంగనాయకుల స్వామి ఆలయం 

ఓపక్క రంగనాయకసాగర్‌.. మరోపక్క ప్రకృతి అందాలు 

ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్న పంట పొలాలు

రిజర్వాయర్‌ నిర్మాణంతో  ఆలయానికి రాష్ట్రవ్యాప్త గుర్తింపు   

కొండపైకి రోడ్డు మార్గం, అందుబాటులో ఫంక్షన్‌హాల్‌ 

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చొరవతో దినదినాభివృద్ధి 

సిద్దిపేట జిల్లాలోని లక్ష్మీ రంగనాయకస్వామి క్షేత్రం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ ఆలయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సీఎం కేసీఆర్‌, మంత్రి 

హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఇక్కడ నిర్మించిన రిజర్వాయర్‌కు రంగనాయక

సాగర్‌ అని స్వామి పేరు కలిసేలా నామకరణం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. రంగనాయకసాగర్‌ను చూసేందుకు వచ్చిన పర్యాటకులు, ఇక్కడ గుట్టపై కొలువుదీరిన శ్రీలక్ష్మీ రంగనాయకస్వామిని దర్శించుకుంటారు. కొండపైన ఉన్న 

ఆలయానికి వచ్చిన పర్యాటకులకు ఓవైపు రిజర్వాయర్‌ అందాలు.. మరోవైపు ప్రకృతి రమణీయత ఓ మంచి అనుభూతిని పంచుతున్నది. ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది. అలసిన మనసులకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నది. 

చిన్నకోడూరు : 

సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ గ్రామ శివారులో రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను ఆనుకొని శ్రీలక్ష్మీ రంగనాయక స్వామి కొండ ఉంది. ప్రభుత్వం ఇక్కడ రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మించడంతో ఈ కొండకు మంచి గుర్తింపు వచ్చింది. గ్రామం పక్కనే సుమారు నలభై ఎకరాల విస్తీర్ణంలో నైరుతి దిశలో ఎత్తైన కొండ ఉంది. ఈ కొండపై పలకల చెక్కబడిన పెద్ద బండరాయి కింద స్వామి వారు కొలువుదీరారు. రిజర్వాయర్‌ సందర్శనకు వచ్చే వారంతా కొండపైకి చేరుకొని స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని సరదాగా గడుపుతుంటారు. గ్రామస్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. శ్రావణమాసంలో స్వామివారి కొండపైన భక్తులు రాత్రివేళ నిద్రచేస్తారు. నిద్ర చేయడంతో ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తులు విశ్వాసం. 

కొండపైకి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు.. 

గతంలో భక్తులు కొండపైకి కాలినడకన వెళ్లాలంటే సరైన దారిలేక ఇబ్బందులు పడేవారు. బండరాళ్లు దాటుకుంటూ అతికష్టం మీద స్వామి దర్శనం చేసుకునే వారు. భక్తుల ఇబ్బందులను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్‌ కోటి రూపాయలతో గుట్టకింది భాగం నుంచి పైవరకు రోడ్డుమార్గం వేశారు. టూవీలర్స్‌ కాకుండా పెద్ద వాహనాలు సైతం సులువుగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సైతం సేదతీరేలా ధర్మశాల నిర్మించారు. అంతేకాకుండా కొండపైన పెళ్లిళ్లు, ఇతర శుభాకార్యాలు నిర్వహించేందుకు ఫంక్షన్‌ హాల్‌ నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. రంగనాయక సాగర్‌ను చూసేందుకు వచ్చేవారు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ కొలువుదీరిన స్వామి పేరునే రంగనాయకసాగర్‌ నిర్మించారని చర్చించుకుంటున్నారు. ఇక్కడే వన భోజనాలు చేసి సేదతీరుతుంటారు. గుట్టపై నుంచి చుట్టుపక్కల గ్రామాలతో జిల్లాకేంద్రం సిద్దిపేట, కనుచూపు మేర అటవీ ప్రాంతం, పచ్చని పంట పొలాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రంగనాయకుల స్వామి క్షేత్రానికి గుర్తింపు రావడంతో గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు.. 

మా గ్రామాన్ని ఆనుకొని (చంద్లాపూర్‌)లో ఉన్న లక్ష్మీ రంగనాయకస్వామి క్షేత్రానికి ఇంత గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో క్షేత్రాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నాం. కొండను ఆనుకొని రిజర్వాయర్‌ను నిర్మించడమే కాకుండా స్వామి వారి పేరు కలిసేలా రంగనాయకసాగర్‌ అని నామకరణం చేయడం శుభసూచకం. స్వామి పేరున గల రిజర్వాయర్‌ నుంచి బీడు భూములకు సాగునీరందించడం రైతుల అదృష్టంగా భావిస్తున్నాం. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో రంగనాయకుల స్వామి క్షేత్రం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు. 

- వేలేటి రోజారాధాకృష్ణశర్మ, జడ్పీ చైర్‌పర్సన్‌ సిద్దిపేట,  

రాధాకృష్ణ శర్మ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు


VIDEOS

logo