సోమవారం 08 మార్చి 2021
Siddipet - Dec 18, 2020 , 00:12:47

ప్రజల ఆలోచనే కేసీఆర్‌ పాలన

ప్రజల ఆలోచనే కేసీఆర్‌  పాలన

  • నినాదాలను నిజం చేసిన సీఎం కేసీఆర్‌
  • ధూళిమిట్ట వాసుల 35 ఏండ్ల ఆకాంక్షను నెరవేర్చిన సర్కారు
  • ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి
  • ఆత్మగౌరవ వేదికలుగా రైతు వేదికలు
  • ధూళిమిట్ట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్‌రావు

చేర్యాల/మద్దూరు : జై కిసాన్‌, రైతేరాజు, అన్నదాత సుఖీభవ, రైతు లేనిదే రాజ్యం లేదు... అనే నినాదాలను విధానాలుగా మార్చుకొని, ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా సీఎం కేసీఆర్‌ పరిపాలన సాగిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ధూళిమిట్ట మండల కేంద్రాన్ని గురువారం మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బొడెకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ దుబ్బుడు దీపికా వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముక, అన్నదాత నినాదాలతో రైతులను కీర్తించడమే తప్ప, రైతుకు వెన్నుదన్నుగా నిలవడంలో గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని విమర్శించారు. దేశంలో 24గంటల పాటు ఉచితంగా కరెంట్‌ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఏటా రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలే హైకమాండ్‌ని, ప్రజా సమస్యల పరిష్కారమే గీటురాయిగా సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తున్నదని, నాడు కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఉంటే.. నేడు 24గంటల పాటు నాణ్యమైన కరెంట్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రైతు వేదికలు రైతు శిక్షణా కేంద్రాలు మారుతాయని, భవిష్యత్‌లో రైతు వేదికలు వారి పాలిట ఆత్మగౌరవ వేదికలుగా నిలువనున్నట్లు తెలిపారు. రైతులు వ్యవసాయాన్ని మూస పద్ధ్దతిలో కాకుండా ఆధునిక పద్ధతుల్లో సాగు చేయాలని మంత్రి సూచించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌ ప్రాంతాల్లో రైతులు నారు పోయకుండానే వరిసాగు చేస్తున్నారని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని తెలిపారు. ఈనెల 27వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

ధూళిమిట్ట మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

 దివంగత సీఎం ఎన్టీఆర్‌ 1984లో మండలాల వ్యవస్థను ఏర్పాటు చేసిన రోజుల్లోనే ధూళిమిట్ట మండలంగా ఆవిర్భవించాల్సి ఉండేదని, కానీ, నాటి పాలకుల నిర్లక్ష్యంతో మండల ఏర్పాటుకు నోచుకోలేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. 35 ఏండ్ల ప్రజల ఆకాంక్షను టీఆర్‌ఎస్‌ పాలనలో సీఎం కేసీఆర్‌ నెరవేర్చారన్నారు.కొత్తగా ఏర్పాటు చేసుకున్న ధూళిమిట్ట మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ధూళిమిట్టకు ఎంతో చరిత్ర ఉందని, ఇక్కడ ప్రతి ఇంటికో ఉద్యోగి ఉన్నాడని, మూడు తరాల ప్రజలు విదేశాల్లో స్థిరపడడం అంటే ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఒకనాడు నిత్యం కరువుతో అలమటించిన ధూళిమిట్టతో పాటు పరిసర గ్రామాల్లో, ప్రస్తుతం చెరువులు,కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిండా నీటితో కళకళాడుతున్నాయని, ఇక 365 రోజుల పాటు నీటి ఎద్దడి లేకుండా కాళేశ్వరం, దేవాదుల కాల్వలతో నీటిని నింపేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నేడు ధూళిమిట్ట మండలం ఏర్పాటు సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు తిగుళ్ల సుధాకర్‌శర్మ ప్రోత్సాహం సహకారంతో సాధ్యమైందన్నారు.ధూళిమిట్ట సిద్దిపేట జిల్లాలో 24వ మండలంగా ఆవిర్భవించిందని, రాష్ట్రంలో 591 మండలంగా రికారులోకి ఎక్కిందని, గ్రామస్తులు తెలంగాణ కోసం చేసిన ఉద్యమాలు, దీక్షలు, పోరాటాలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. మద్దూరు మండలంలో ఉన్న కమలాయపల్లి, అర్జునపట్ల గ్రామాలను చేర్యాల మండలంలో కలుపాలని గ్రామస్తులు తనను ఎన్నోసార్లు కలిశారని, ఆయా గ్రామాలను చేర్యాలలో కలిపి వారి ఆకాంక్షలను సైతం సీఎం కేసీఆర్‌ నిజం చేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాగిళ్ల తిరుపతిరెడ్డి, ఆర్డీవో జయచందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మల్లన్న ఆలయ మాజీ చైర్మన్‌ మేక సంతోష్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మంద యాదగిరి, మాజీ జడ్పీటీసీ నాచగొని పద్మావెంకట్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo